CM KCR | ముంబైలో వెలిసిన సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు
19 February 2022, 22:37 IST
- మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేను కలవడానికి ఆదివారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముంబై వెళ్తున్న విషయం తెలిసిందే. దీంతో అక్కడ ఒక రోజు ముందే కేసీఆర్ ఫ్లెక్సీలు వెలిశాయి.

ముంబైలో కొలువుదీరిన కేసీఆర్ భారీ ఫ్లెక్సీల్లో ఇదీ ఒకటి
ముంబై: తెలంగాణ సాయి పేరిట ముంబైలో సీఎం కేసీఆర్‌కు సంబంధించిన భారీ ఫ్లెక్సీలు వైరల్‌గా మారాయి. ఆదివారం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఒక రోజు ముందే ముంబై నగరం మొత్తం ఈ ఫ్లెక్సీలు కొలువుదీరాయి. దేశ్ కీ నేత కేసీఆర్ అంటూ ఈ ఫ్లెక్సీలపై నినాదాలు ముద్రించారు. కేసీఆర్‌తోపాటు ఆయనకు మద్దతిస్తున్న ఇతర ప్రాంతీయ పార్టీల నేతలు, ముఖ్యమంత్రుల ఫొటోలను కూడా ఈ ఫ్లెక్సీల్లో ఏర్పాటు చేయడం గమనార్హం.
ఈ మధ్య వరుస ప్రెస్‌మీట్లలో బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. దేశంలో గుణాత్మక మార్పు నినాదాన్ని మరోసారి తెరపైకి తెచ్చిన కేసీఆర్.. ఇప్పటికే వెస్ట్ బెంగాల్ సీఎం మమతా, తమిళనాడు సీఎం స్టాలిన్, మాజీ ప్రధాని దేవెగౌడలతో మాట్లాడారు.
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌తో ఫోన్లో మాట్లాడిన కేసీఆర్.. ఇక ఇప్పుడు నేరుగా కలవడానికి వెళ్తున్నారు. దీంతో దేశ్ కీ నేత కేసీఆర్ అంటూ మహారాష్ట్ర ఆయనకు స్వాగతం పలుకుతోంది. తెలంగాణలోని పథకాలు దేశమంతా అమలు చేయాలన్న నినాదాలు ఈ ఫ్లెక్సీలపై వెలిశాయి. ముంబైలో స్థిరపడిన తెలంగాణవాసులు కేసీఆర్‌కు ఘన స్వాగతం పలకడానికి సిద్ధమవుతున్నారు.