తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Anu Distance Exams: వద్దన్న వినకుండా కోర్సుల నిర్వహణ…ఆపై పరీక్షల్లో అక్రమాలు

ANU Distance Exams: వద్దన్న వినకుండా కోర్సుల నిర్వహణ…ఆపై పరీక్షల్లో అక్రమాలు

HT Telugu Desk HT Telugu

08 March 2023, 7:20 IST

    • ANU Distance Exams: యూనివర్శిటీకి ప్రాదేశిక పరిధికి వెలుపల డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సుల్ని నిర్వహించొద్దని యూజీసీ స్పష్టమైన ఆదేశాలిచ్చిన గుంటూరు నాగార్జున వర్శిటీ మాత్రం పెడచెవిన పెడుతోంది. తెలంగాణ విద్యార్ధులకు ఏపీలో పరీక్షా కేంద్రాలు కేటాయించి అక్రమాలకు పాల్పడుతోందనే ఆరోపణలు ఉన్నాయి. 
నాగార్జున యూనివర్శిటీ పరీక్షల్లో అక్రమాలు
నాగార్జున యూనివర్శిటీ పరీక్షల్లో అక్రమాలు

నాగార్జున యూనివర్శిటీ పరీక్షల్లో అక్రమాలు

ANU Distance Exams ఆంధ్రప్రదేశ్‌‌లోని గుంటూరుకు చెందిన ఆచార్య నాగార్జున యూనివర్శిటీ అందించే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సుల్ని తెలంగాణలో గుర్తించమని ఇప్పటికే ఉన్నత విద్యా శాఖ ప్రకటించింది. యూనివర్శిటీ ప్రాదేశిక హద్దులకు వెలుపల కోర్సుల్ని నిర్వహించడంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇటీవల వరుస రిక్రూట్‌మెంట్లను వెలువరించిన సమయంలో కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన డిస్టెన్స్‌ డిగ్రీలను గుర్తించమని తెలంగాణ ప్రకటించింది. ఇప్పటికే వేల సంఖ్యలో విద్యార్ధులు ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ద్వారా దూర విద్యా విధానంలో డిగ్రీలు చేస్తున్నారు.

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య పరీక్షల నిర్వహణ తీరుపై ఎప్పట్నుంచో విమర్శలు ఉన్నాయి. కోర్సుల నిర్వహణలో నాణ్యత కంటే అడ్మిషన్ల సంఖ్యను పెంచుకోవడంపైనే యూనివర్శిటీ శ్రద్ధ పెట్టడంతో ఈ పరిస్థితి వచ్చింది. తాజాగా యూనివర్శిటీ పరీక్షల్లో తెలంగాణ ఉన్నత విద్యా మండలి అక్రమాలను గుర్తించింది.

యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా యూనివర్శిటీ పరిధికి వెలుపల హైదరాబాద్‌లో దూరవిద్య కేంద్రాలను నిర్వహించడంపై చాలా కాలంగా వివాదం ఉంది. ఇతర రాష్ట్రాల యూనివర్శిటీల్లో చదివిన వారిపై తెలంగాణ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించడంతో తెలంగాణలో అడ్మిషన్లు పొందిన వారికి పరీక్ష కేంద్రాలను ఏపీలో కేటాయించింది.

యూనివర్శిటీ పరీక్షల నిర్వహణలో అక్రమాలపై ఫిర్యాదులు రావడంతో ఉన్నత విద్యాశాఖ ప్రత్యేకంగా రెండు బృందాలతో తనిఖీలు చేపట్టింది. ఎన్టీఆర్‌ జిల్లాలోని నందిగామ పరీక్షా కేంద్రంలో తెలంగాణ అమ్మాయికి బదులుక అబ్బాయి పరీక్ష రాస్తున్నట్లు అధికారుల బృందం గుర్తించింది. పరీక్ష రాస్తున్న యువకుడిని అదుపులోకి తీసుకోగా.. వారి నుంచి తప్పించుకొని పారిపోయాడు. పరీక్షలకు హాజరైన వారిలో చాలామంది అభ్యర్థుల హాల్‌టికెట్లపై ఫొటోలూ లేవు.

ఆన్‌లైన్‌లో హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవడంతో తమకు ఫొటోలు రాలేదని తనిఖీ బృందాలకు అభ్యర్థులు సమాధానమిచ్చారు. యూజీసీ నిబంధనల ప్రకారం ప్రభుత్వ కళాశాలల్లోనే స్టడీసెంటర్లు, పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేయాల్సిఉన్నా ప్రైవేటు కళాశాలల్లో, యూనివర్శిటీ గుర్తింపు ఉన్న వాటిల్లో కూడాస్టడీసెంటర్లు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

గుంటూరుకు చెందిన నాగార్జున వర్సిటీ తెలంగాణలో నెలకొల్పిన స్టడీ సెంటర్లలో డిగ్రీ, పీజీ పూర్తిచేసిన విద్యార్థుల ధ్రువపత్రాలు చెల్లవని తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా నాగార్జున వర్సిటీ తన పరిధిని దాటి స్టడీసెంటర్లను ఏర్పాటుచేసిందని, 2013 సెప్టెంబరు తర్వాత నాగార్జున యూనివర్శిటీ దూరవిద్యలో చదివిన విద్యార్థులు జూనియర్‌ అధ్యాపక పోస్టులకు అర్హులు కారని టీఎస్‌పీఎస్సీ దరఖాస్తులను స్వీకరించలేదు.

నాగార్జున యూనివర్శిటీ దూర విద్యలో చదివిన వారు తెలంగాణలో లక్షన్నర మంది ఉండొచ్చు. విభజన చట్టం ప్రకారం పదేళ్లు ఉమ్మడి రాజధాని ఉన్నందునే తెలంగాణలో కోర్సులు కొనసాగిస్తున్నామని చెబుతోంది. పక్కరాష్ట్రాల్లో స్టడీసెంటర్లు నిర్వహించడం యూజీసీ నిబంధనలకు విరుద్ధమైన అడ్మిషన్ల కక్కుర్తితో యూనివర్శిటీ ఇలా చేస్తోంది.

ఈ ఏడాది ఆంక్షల నేపథ్యంలో దూరవిద్య కింద తెలంగాణలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఏపీలో పరీక్షలు నిర్వహించారు. వారికి తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను కేటాయించారు. దూరవిద్య ద్వారా భారీగా ఆదాయం ఎక్కువగా వస్తుండటంతో నాగార్జున వర్సిటీ వీటిని కొనసాగిస్తోంది. విద్యార్థుల ధ్రువపత్రాల చెల్లుబాటు విషయాన్ని పట్టించుకోవడం లేదు. 2001 విద్యా సంవత్సరం నుంచి నాగార్జున యూనివర్శిటీ దూర విద్యలో డిగ్రీలను అందిస్తోంది. ఈ కోర్సుల నిర్వహణతోనే యూనివర్శిటీ ఆర్ధికంగా బలోపేతం అయ్యిందనే విమర్శలున్నాయి.

టాపిక్