తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rohit Sharma: ఇంగ్లండ్‌తో టెస్ట్‌ నుంచి రోహిత్‌ ఔట్‌.. బుమ్రాకు కెప్టెన్సీ

Rohit Sharma: ఇంగ్లండ్‌తో టెస్ట్‌ నుంచి రోహిత్‌ ఔట్‌.. బుమ్రాకు కెప్టెన్సీ

Hari Prasad S HT Telugu

29 June 2022, 19:58 IST

    • Rohit Sharma: ఇంగ్లండ్‌తో కీలకమైన ఐదో టెస్ట్‌కు ముందు టీమిండియాకు షాక్‌ తగిలింది. కరోనా బారిన పడిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు.
రోహిత్ శర్మ
రోహిత్ శర్మ (Action Images via Reuters)

రోహిత్ శర్మ

బర్మింగ్‌హామ్‌: భయపడినంతా జరిగింది. ఇంగ్లండ్‌తో చివరి టెస్ట్‌కు రోహిత్‌ శర్మ దూరమయ్యాడు. వామప్‌ మ్యాచ్‌ జరుగుతుండగానే కరోనా పాజిటివ్‌గా తేలిన అతనికి.. బుధవారం మరోసారి ఆర్టీ-పీసీఆర్‌ పరీక్ష నిర్వహించగా మరోసారి పాజిటివ్‌ అని వచ్చింది. దీంతో రోహిత్‌ స్థానంలో జస్‌ప్రీత్‌ బుమ్రా ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కపిల్‌ దేవ్‌ తర్వాత ఇండియన్‌ టీమ్‌కు కెప్టెన్సీ వహిస్తున్న పేస్‌బౌలర్‌ బుమ్రానే కావడం విశేషం.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

1987 వరల్డ్‌కప్‌లో చివరిసారి ఇండియన్‌ టీమ్‌కు కపిల్‌ దేవ్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. అంటే 35 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఓ పేస్‌ బౌలర్‌ టీమ్‌కు కెప్టెన్‌ అయ్యాడు. "రోహిత్‌ ఈ మ్యాచ్‌ ఆడటం లేదు. అతని ఆర్టీ-పీసీఆర్‌ టెస్ట్‌ మళ్లీ పాజిటివ్‌గానే వచ్చింది. అతడు ఇంకా ఐసోలేషన్‌లోనే ఉన్నాడు. వైస్‌ కెప్టెన్‌గా ఉన్న జస్‌ప్రీత్‌ బుమ్రా ఈ మ్యాచ్‌లో టీమ్‌ను లీడ్‌ చేస్తాడు" అని ఓ బీసీసీఐ అధికారి పీటీఐకి వెల్లడించారు.

టెస్టుల్లో ఇండియన్‌ టీమ్‌కు కెప్టెన్సీ వహిస్తున్న 36వ క్రికెటర్‌గా బుమ్రా నిలవనున్నాడు. బుమ్రా ఇప్పటి వరకూ 29 టెస్టులు ఆడి 123 వికెట్లు తీసుకున్నాడు. టీమ్‌లోకి అడుగుపెట్టిన చాలా తక్కువ కాలంలోనే బెస్ట్‌ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా ఎదగడంతోపాటు ఇప్పుడు కెప్టెన్సీ చేపట్టనుండటం విశేషం. రోహిత్‌ ఆడకపోతే బుమ్రా లేదా పంత్‌లలో ఒకరికి కెప్టెన్సీ దక్కే అవకాశం ఉందని ముందు నుంచీ భావిస్తున్నదే. చివరికి బోర్డు మాత్రం బుమ్రా వైపే మొగ్గు చూపింది.

ఇక ఇప్పుడు రోహిత్ స్థానంలో ఓపెనింగ్‌ ఎవరు చేస్తారన్నది చూడాల్సి ఉంది. మయాంక్‌ అగర్వాల్‌ను హుటాహుటిన ఇంగ్లండ్‌కు రప్పించినా.. అతన్ని ఆడించేది అనుమానమే అని బోర్డు వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో శుభ్‌మన్‌ గిల్‌తో కలిసి పుజారా ఓపెనర్‌గా వచ్చే అవకాశం ఉంది. బ్యాటింగ్‌ లైనప్‌లో పుజారా, గిల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, విహారీ, రిషబ్‌ పంత్‌ ఉండనున్నారు.

అయితే తుది జట్టులో రెండో స్పిన్నర్‌ ఉంటాడా లేక నాలుగో పేస్‌ బౌలరా అన్నది ఇంకా నిర్ణయించలేదు. బుమ్రాతోపాటు సిరాజ్‌, షమి టీమ్‌లో ఉంటారు. మరో ప్లేస్‌ కోసం శార్దూల్‌ ఠాకూర్‌ పోటీ పడనున్నాడు. ఒకవేళ ఇద్దరు స్పిన్నర్లు అశ్విన్‌, జడేజా ఉంటే మాత్రం శార్దూల్‌కు చోటు దక్కదు.