Rohit Sharma Rare Record: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. కోహ్లి సరసన ఎంఐ కెప్టెన్
18 April 2023, 21:11 IST
- Rohit Sharma Rare Record: ఐపీఎల్లో చరిత్ర సృష్టించాడు రోహిత్ శర్మ. అతడు విరాట్ కోహ్లి, శిఖర్ ధావన్ ల సరసన నిలిచాడు. మంగళవారం (ఏప్రిల్ 18) సన్ రైజర్స్ తో మ్యాచ్ లో రోహిత్ ఈ రికార్డు అందుకున్నాడు.
Mumbai Indians batter Rohit Sharma plays a shot during the IPL 2023 match
Rohit Sharma Rare Record: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఈ మెగా లీగ్ లో ఇప్పటికే ఆ రికార్డు అందుకున్న విరాట్ కోహ్లి, శిఖర్ ధావన్ ల సరసన నిలిచాడు. ఐపీఎల్లో 6 వేల పరుగులు అందుకున్న నాలుగో బ్యాటర్ గా రోహిత్ నిలిచాడు. అతని కంటే ముందు కోహ్లి, ధావన్, వార్నర్ ఈ రికార్డు అందుకున్నారు.
విరాట్ 6844 పరుగులతో టాప్ లో ఉండగా.. ధావన్ 6477, వార్నర్ 6109 రన్స్ చేశారు. ఐపీఎల్లో 232వ మ్యాచ్ లో రోహిత్ ఈ రికార్డు అందుకోవడం విశేషం. సన్ రైజర్స్ తో మ్యాచ్ లో రెండో ఓవర్ రెండో బంతికి బౌండరీ బాదడం ద్వారా రోహిత్ ఈ అరుదైన రికార్డును అందుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ లో రోహిత్ వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు.
ఈ మ్యాచ్ లో రోహిత్ 18 బంతుల్లోనే 28 రన్స్ చేశాడు. అందులో ఆరు ఫోర్లు ఉన్నాయి. నటరాజన్ వేసిన నాలుగో ఓవర్లో రోహిత్ ఔటయ్యాడు. కేకేఆర్ తో జరిగిన గత మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన రోహిత్.. ఈ మ్యాచ్ కు తుది జట్టులోకి వచ్చాడు. అంతకుముందు అతడు హైదరాబాద్ ఎయిర్ పోర్టులో దిగినప్పుడు తెలుగులో మాట్లాడి అలరించాడు.
మేము వచ్చేశాం.. ఎంఐ ఫ్యాన్స్ పదండి ఉప్పల్‌కు అని రోహిత్ అనడం విశేషం. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 192 పరుగులు చేసింది. కేమరాన్ గ్రీన్ 40 బంతుల్లో 64 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 2 సిక్స్ లు ఉన్నాయి.