Dhoni on Retirement: ఐపీఎల్‌కు ధోనీ గుడ్‌బై చెబుతున్నాడా.. ఇదీ అతని సమాధానం-dhoni on retirement says this in an event ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Dhoni On Retirement: ఐపీఎల్‌కు ధోనీ గుడ్‌బై చెబుతున్నాడా.. ఇదీ అతని సమాధానం

Dhoni on Retirement: ఐపీఎల్‌కు ధోనీ గుడ్‌బై చెబుతున్నాడా.. ఇదీ అతని సమాధానం

Hari Prasad S HT Telugu
Apr 17, 2023 06:07 PM IST

Dhoni on Retirement: ఐపీఎల్‌కు ధోనీ గుడ్‌బై చెబుతున్నాడా? దీనిపై ధోనీయే స్పందించాడు. సీఎస్కే నిర్వహించిన ఓ ప్రమోషనల్ ఈవెంట్ లో అతడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

ఎమ్మెస్ ధోనీ
ఎమ్మెస్ ధోనీ (AP)

Dhoni on Retirement: ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అంటూ గత మూడు సీజన్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే తనకు 2023 ఐపీఎల్ చివరిది కావచ్చని గతేడాది ధోనీయే పరోక్షంగా చెప్పాడు. దీంతో ఈ సీజన్ తర్వాత అతడు ఐపీఎల్ కు గుడ్‌బై చెప్పడం ఖాయమని చాలా మంది భావిస్తున్నారు. ఇదే ప్రశ్నను ఓ ప్రమోషనల్ ఈవెంట్ లో ధోనీని అడగగా.. అతడు తనదైన స్టైల్లో నవ్వుతూ సమాధానం చెప్పాడు.

ఇదే తనకు చివరి సీజనా కాదా అన్న విషయం నేరుగా చెప్పలేదు కానీ.. దానికి ఇంకా చాలా సమయం ఉందని, ఇప్పుడే దానిపై మాట్లాడితే మా కోచ్ ఒత్తిడికి గురవుతాడని ధోనీ జోక్ చేయడం విశేషం. ఆర్సీబీతో మ్యాచ్ కు ముందు సీఎస్కే ఓ ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించింది. అందులో కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తో కలిసి ధోనీ పాల్గొన్నాడు.

ఈ సందర్భంగా అతడు తన రిటైర్మెంట్ పై స్పందిస్తూ.. "ఆ నిర్ణయం తీసుకోవడానికి ఇంకా చాలా సమయం ఉంది. ప్రస్తుతానికి మాకు ఇంకా చాలా మ్యాచ్ లు ఉన్నాయి. నేను ఏదైనా చెబితే మా కోచ్ ఒత్తిడికి గురవుతాడు. అతన్ని ఒత్తిడిలోకి నెట్టదలచుకోలేదు" అని ధోనీ నవ్వుతూ చెప్పాడు. 41 ఏళ్ల ధోనీ తనలో ఇంకా సత్తా తగ్గలేదని ఈ సీజన్ లో నిరూపిస్తూనే ఉన్నాడు.

ఆడిన నాలుగు మ్యాచ్ లలోనే ఆరు సిక్స్ లు బాదాడు. రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో జడేజాతో కలిసి సీఎస్కేను దాదాపు గెలిపించినంత పని చేశాడు. కానీ చివరి బంతికి భారీ షాట్ కొట్టలేకపోవడంతో సీఎస్కే కేవలం 3 పరుగుల తేడాతో ఓడిపోయింది. 2020లో అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ధోనీ.. ఆ ఏడాదే ఐపీఎల్లోనూ ఆడి తప్పుకుంటాడని భావించారు.

కానీ 2021లో సీఎస్కేను నాలుగోసారి విజేతగా నిలిపాడు. ఇక 2022లో మొదట్లోనే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అయితే జడేజా కెప్టెన్ గా విఫలమవడంతో మరోసారి సారథ్య బాధ్యతలు చేపట్టాడు. 2023లో చెన్నైతోపాటు ఇండియాలోని వివిధ స్టేడియాల్లో ఆడి క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకోవాలని ఉందని గత సీజన్ లో అతడు చెప్పాడు.

Whats_app_banner

సంబంధిత కథనం