Gavaskar on Dhoni: ధోనీలాంటి కెప్టెన్ లేడు.. ఇక రాడు.. అతడో గొప్ప కెప్టెన్: గవాస్కర్
Gavaskar on Dhoni: ధోనీలాంటి కెప్టెన్ లేడు.. ఇక రాడు.. అతడో గొప్ప కెప్టెన్ అని అన్నాడు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ప్రదర్శనపై అతడు ఇలా స్పందించాడు.
Gavaskar on Dhoni: ఎమ్మెస్ ధోనీ.. ఇండియన్ క్రికెట్ లోనూ కాదు.. ప్రపంచ క్రికెట్ లోనూ అతడో లెజెండరీ ప్లేయర్. అంతకుమించిన గొప్ప కెప్టెన్. తన కెప్టెన్సీ స్కిల్స్ తో ప్రత్యర్థిని బోల్తా కొట్టించడం ఎలాగో ధోనీని చూసే నేర్చుకోవాలి. నరాలు తెగే ఉత్కంఠలోనూ ఎంతో ప్రశాంతంగా కనిపిస్తూ మిస్టర్ కూల్ గా పేరుగాంచిన ధోనీపై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు.
క్లిష్టమైన పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కు బాగా తెలుసు అని, మిగతా వాళ్ల కంటే ధోనీ భిన్నమని సన్నీ అన్నాడు. అతనిలాంటి కెప్టెన్ మరొకరు లేరు.. భవిష్యత్తులోనూ రారు అని అతడు అనడం విశేషం.
"క్లిష్టమైన పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలో చెన్నై సూపర్ కింగ్స్ కు తెలుసు. ఇది ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీలోనే సాధ్యం. 200 మ్యాచ్ లకు కెప్టెన్ గా ఉండటం చాలా కష్టం. అన్ని మ్యాచ్ లలో కెప్టెన్ అంటే చాలా భారం పడుతుంది. అది అతని వ్యక్తిగత ప్రదర్శనను కూడా దెబ్బ తీసే అవకాశం ఉంటుంది. కానీ మహి భిన్నమైన వ్యక్తి. అతడో భిన్నమైన కెప్టెన్. అతనిలాంటి కెప్టెన్ మరొకరు లేరు. భవిష్యత్తులోనూ ఇక ఎవరూ రారు" అని స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ గవాస్కర్ అన్నాడు.
ఈ లెజెండరీ కెప్టెన్ ఈ మధ్యే ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కు 200వ మ్యాచ్ కు కెప్టెన్ గా ఉన్న విషయం తెలిసిందే. ఈ మెగా లీగ్ చరిత్రలో మరెవరికీ సాధ్యం కాని రికార్డు ఇది. అయితే ఆ రికార్డు మ్యాచ్ లోనే చెన్నై టీమ్ ఓడిపోయింది. ఇక తమ తర్వాతి మ్యాచ్ లో సీఎస్కే సోమవారం (ఏప్రిల్ 17) ఆర్సీబీతో తలపడనుంది. ఈ మ్యాచ్ పై స్పందిస్తూనే గవాస్కర్ ఈ కామెంట్స్ చేశాడు.
ధోనీ కెప్టెన్సీలో సీఎస్కే ఇప్పటి వరకూ నాలుగు టైటిల్స్ గెలిచింది. ఇక ఐపీఎల్లో అతనికిదే చివరి సీజన్ అని భావిస్తున్న నేపథ్యంలో మరో టైటిల్ తో అతనికి వీడ్కోలు చెప్పాలని సీఎస్కే భావిస్తోంది. ధోనీ ఇప్పటి వరకూ 238 మ్యాచ్ లలో ఐదు వేలకుపైగా రన్స్ చేశాడు. ఈ లీగ్ లో 5 వేలకుపైగా రన్స్ చేసి ఏడో బ్యాటర్ గా ధోనీ నిలిచాడు.
సంబంధిత కథనం