Gavaskar on free hit: వరసగా రెండు వైడ్లు వేస్తే ఫ్రీహిట్ ఇవ్వాలి.. గవాస్కర్ సూచన
Gavaskar on free hit: వరసగా రెండు వైడ్లు వేస్తే ఫ్రీహిట్ ఇవ్వాలి అని గవాస్కర్ సూచించడం గమనార్హం. ఐపీఎల్లో చెన్నై, లక్నో మధ్య జరిగిన మ్యాచ్ లో సీఎస్కే బౌలర్లు భారీగా వైడ్లు వేయడంపై సన్నీ అసహనం వ్యక్తం చేశాడు.
Gavaskar on free hit: ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్ లో చివరికి సీఎస్కే 12 పరుగులతో గెలిచినా ఆ టీమ్ బౌలర్లపై విమర్శలు వస్తున్నాయి. స్టార్ బౌలర్ దీపక్ చహర్ సహా మిగతా బౌలర్లు కూడా భారీగా అదనపు పరుగులు సమర్పించుకున్నారు.
ఏకంగా 3 నోబాల్స్, 13 వైడ్లు వేశారు. దీనిపై మ్యాచ్ తర్వాత కెప్టెన్ ధోనీ కూడా బౌలర్లకు వార్నింగ్ ఇచ్చాడు. నోబాల్స్ వేయడం ఆపేయాలని, వైడ్లు తగ్గించుకోవాలని.. లేదంటే కొత్త కెప్టెన్ వస్తాడని ధోనీ అనడం విశేషం. ఇక మ్యాచ్ లో కామెంట్రీ ఇచ్చిన గవాస్కర్ కూడా ఈ ఎక్స్‌ట్రాల విషయంలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వరుసగా రెండు వైడ్ బాల్స్ వేస్తే ఫ్రీహిట్ ఇవ్వాలని అతడు సూచించాడు.
ప్రస్తుతం నోబాల్ వేస్తే తర్వాతి బాల్ ను ఫ్రీహిట్ గా ఇస్తున్న విషయం తెలిసిందే. దానిని వైడ్లకూ వర్తింపజేయాలని సన్నీ చెప్పడం గమనార్హం. అయితే రెండు వరస వైడ్లు వేసినప్పుడు తర్వాతి బంతిని ఫ్రీహిట్ గా ఇవ్వాలని గవాస్కర్ సూచించాడు. ఈ మ్యాచ్ లో దీపక్ చహర్, తుషార్ దేశ్‌పాండేలాంటి బౌలర్లు వరుసగా రెండు, మూడేసి వైడ్లు వేశారు.
తుషార్ అయితే తన తొలి ఓవర్లోనే మూడు వైడ్స్, రెండు నోబాల్స్ వేశాడు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన గవాస్కర్.. ఈ సూచన చేశాడు. అలా అయితేనే బౌలర్లు తమ లైన్ అండ్ లెంత్ పై మరింత దృష్టిసారిస్తారని సన్నీ అన్నాడు. ఆ సమయంలో కామెంట్రీ బాక్స్ లో సైమన్ డౌల్, ఇయాన్ బిషప్ లాంటి మాజీ బౌలర్లు ఉన్నారు. బౌలర్ల ముందే ఇలాంటి కామెంట్స్ చేయడం సరికాదని వాళ్లు సరదాగా అన్నారు.
సంబంధిత కథనం