Gavaskar warns India: ఈసారీ వరల్డ్ కప్ గెలవలేదంటే వాళ్లంతా ఇంటికే: గవాస్కర్
Gavaskar warns India: ఈసారీ వరల్డ్ కప్ గెలవలేదంటే వాళ్లంతా ఇంటికే అంటూ గవాస్కర్ టీమిండియాకు వార్నింగ్ ఇచ్చాడు. ప్లేయర్స్ విశ్రాంతి తీసుకోవడంపై సన్నీ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
Gavaskar warns India: టీమిండియా ఓ ఐసీసీ టోర్నీ గెలవక పదేళ్లు అవుతోంది. వరల్డ్ కప్ గెలిచి 12 ఏళ్లు అవుతోంది. ఈ మధ్యకాలంలో అటు టీ20, ఇటు వన్డే వరల్డ్ కప్ లలో సెమీస్, ఫైనల్స్ చేరుతున్నా.. కప్పు మాత్రం సొంతం చేసుకోలేకపోతోంది. గతేడాది టీ20 వరల్డ్ కప్ లోనూ సెమీస్ లో ఓడింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సొంతగడ్డపై జరగనున్న వన్డే వరల్డ్ కప్ టీమిండియాకు కీలకం కానుంది.
చివరిసారి 2011లో ఇండియాలోనే జరిగిన వరల్డ్ కప్ గెలిచిన మన టీమ్ కు.. ఇప్పుడు పుష్కర కాలం తర్వాత మరో అవకాశం వచ్చింది. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఇండియన్ టీమ్ కు ఓ వార్నింగ్ ఇచ్చాడు. ఈసారి కూడా వరల్డ్ కప్ గెలవకపోతే కొందరి అంతర్జాతీయ కెరీర్లు ముగిసే అవకాశం ఉందని అతడు స్పష్టం చేశాడు.
నిజానికి కోహ్లి, జడేజా, పాండ్యా, గిల్ లాంటి వాళ్లు మంచి ఫామ్ లో ఉన్నా గాయాలే ఆందోళన కలిగిస్తున్నాయి. బుమ్రా ఆర్నెళ్లకుపైగానే జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ మధ్యే శ్రేయస్ అయ్యర్ దూరమయ్యాడు. ఈ గాయాల నుంచి తప్పించుకోవడానికి ప్లేయర్స్ కు విశ్రాంతినిస్తున్నారు. అయితే ఇలా రెస్ట్ ఇవ్వడం, తుది జట్టులో తరచూ మార్పులు వరల్డ్ కప్ అవకాశాలను ప్రభావితం చేస్తాయని గవాస్కర్ అంటున్నాడు.
"వరల్డ్ కప్ ఏడాదిలో ఏ మ్యాచ్ మిస్ అయినా వాళ్ల సంసిద్ధతను ప్రభావితం చేస్తుంది. టీమ్ బ్యాలెన్స్ దెబ్బ తింటుంది. మరోసారి వరల్డ్ కప్ గెలవలేకపోతే మాత్రం దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. కొందరి అంతర్జాతీయ కెరీర్లు ముగిసిపోతాయి. ఇండియన్ టీమ్ కు ఆడకుండా రెస్ట్ తీసుకోవాలని అనుకుంటున్న ప్లేయర్స్ కు ఇదో హెచ్చరిక" అని గవాస్కర్ మిడ్ డేకు రాసిన కాలమ్ లో అభిప్రాయపడ్డాడు.
వరల్డ్ కప్ టీమ్ లో ఉండాల్సిన ప్లేయర్స్ కు విశ్రాంతి ఇవ్వాలన్న ప్రతిపాదనపై కూడా ఈ మధ్య గవాస్కర్ మండిపడ్డాడు. "రెస్ట్ అనే ప్రతిపాదనపై బీసీసీఐ మరోసారి ఆలోచించాలి. గ్రేడ్ ఎ క్రికెటర్లు మంచి కాంట్రాక్టులు అందుకున్నారు. ప్రతి మ్యాచ్ కు పేమెంట్ అందుకుంటారు. ఏదైనా కంపెనీ సీఈవో లేదంటే ఎండీకి ఇంత విశ్రాంతి దొరుకుతుందా?
ఇండియన్ క్రికెట్ మరింత ప్రొఫెషనల్ కావాలంటే కొన్ని గీతలు గీయాల్సిందే. రెస్ట్ కావాలంటే కొన్ని వదులుకోవాలి. అప్పుడు ఆడాలనుకోకపోతే రెస్ట్ తీసుకోండి. కానీ నేను ఇండియన్ టీమ్ కు ఆడను అని ఎవరైనా ఎలా అనగలరు" అని గవాస్కర్ అన్నాడు.
సంబంధిత కథనం