PCB on World Cup: పాక్ వరల్డ్ కప్ మ్యాచ్‌లు బంగ్లాదేశ్‌లో ఆడతామని చెప్పలేదు.. పీసీబీ మరో ట్విస్ట్
PCB on World Cup: పాక్ వరల్డ్ కప్ మ్యాచ్‌లు బంగ్లాదేశ్‌లో ఆడతామని చెప్పలేదుని పీసీబీ కొత్త ట్విస్ట్ ఇచ్చింది. గురువారం (మార్చి 30) మీడియాతో పీసీబీ ఛైర్మన్ నజమ్ సేఠీ ఈ విషయం చెప్పారన్న వార్తలను పీసీబీ ఖండించింది.
PCB on World Cup: వన్డే వరల్డ్ కప్ లో పాకిస్థాన్ టీమ్ ఆడే మ్యాచ్ లు ఇండియాలో కాకుండా బంగ్లాదేశ్ లో ఆడతామని పీసీబీ ఛీఫ్ నజమ్ సేఠీ చెప్పినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలుసు కదా. అయితే ఇప్పుడు పీసీబీ మాత్రం వాటిని ఖండించింది. సేఠీ ఎప్పుడూ ఆ మాట చెప్పలేదని స్పష్టం చేసింది. అటు ఐసీసీ కూడా తమ చర్చల్లో అసలు బంగ్లాదేశ్ విషయమే తెరపైకి రాలేదని, పాక్ జట్టుకు వీసా సమస్యలు ఉండబోవని బీసీసీఐ హామీ ఇచ్చినట్లు చెప్పింది.
ఈ హైబ్రిడ్ మోడల్ అనేది కేవలం ఆసియా కప్ కోసమే అని, పాకిస్థాన్ కు రావడానికి ఇండియా నిరాకరిస్తోంది కాబట్టే ఈ ప్రతిపాదన వచ్చినట్లు పీసీబీ తేల్చి చెప్పింది. "పీసీబీ ఛీఫ్ నజమ్ సేఠీ ఆసియా కప్ హైబ్రిడ్ మోడల్ పై ఏసీసీలో చర్చించినట్లు మాత్రమే మీడియాతో చెప్పారు. పాకిస్థాన్ కు జట్టును పంపడానికి బీసీసీఐ నిరాకరించడం వల్లే ఈ చర్చ జరుగుతోంది. ఇండియా మ్యాచ్ లు తటస్థ వేదికలో జరపాలన్న ప్రతిపాదనపై ఏసీసీలోనే చర్చ జరుగుతోంది అని నజమ్ చెప్పారు" అంటూ పీసీబీ వివరణ ఇచ్చింది.
తాను చెప్పిన విషయాన్ని మీడియాలో కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని నజమ్ సేఠీ అన్నారు. తాను ఐసీసీ లేదా ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్ 2023 గురించి మాట్లాడలేదని కూడా స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆసియా కప్ నిర్వహణ కోసం మాత్రమే ఏసీసీతో చర్చిస్తున్నామని, వరల్డ్ కప్ గురించి ఐసీసీతో ఎలాంటి చర్చలు జరగడం లేదని పీసీబీ స్పష్టం చేసింది.
అయితే వరల్డ్ కప్ లోనూ హైబ్రిడ్ మోడల్ గురించి సరైన సమయంలో ఐసీసీ దగ్గర ప్రస్తావిస్తామని చివర్లో పీసీబీ చెప్పడం గమనార్హం. ఆసియా కప్ లో ఇండియా మ్యాచ్ లు మాత్రం యూఏఈలాంటి తటస్థ వేదికలో జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ తర్వాత వరల్డ్ కప్ పై పాకిస్థాన్ ఏం చేస్తుందన్నది చూడాలి.
సంబంధిత కథనం