Dhoni Warning: నోబాల్స్ వేశారో కొత్త కెప్టెన్ వస్తాడు జాగ్రత్త.. సీఎస్కే బౌలర్లకు ధోనీ వార్నింగ్
Dhoni Warning: నోబాల్స్ వేశారో కొత్త కెప్టెన్ వస్తాడు జాగ్రత్త అంటూ సీఎస్కే బౌలర్లకు ధోనీ వార్నింగ్ ఇచ్చాడు. లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ గెలిచిన తర్వాత ధోనీ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Dhoni Warning: నోబాల్స్ వేశారో కొత్త కెప్టెన్ వస్తాడు జాగ్రత్త అంటూ సీఎస్కే బౌలర్లకు ధోనీ వార్నింగ్ ఇస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. లక్నోతో మ్యాచ్ గెలిచినా కూడా చెన్నై బౌలర్లు అసలు క్రమశిక్షణ పాటించలేదు. లెక్కకు మించి వైడ్లు, నోబాల్స్ వేశారు. దీనిపైనే ధోనీ తనదైన స్టైల్లో అసహనం వ్యక్తం చేశాడు. మ్యాచ్ సమయంలో ఎప్పటిలాగే అతడు కూల్ గానే ఉన్నాడు.
ఎంతో ఒత్తిడిలో బౌలర్లపై మరింత ఒత్తిడి పెంచడం ఇష్టం లేక అప్పుడు సహనంతో వ్యవహరించిన అతడు.. ప్రజెంటేషన్ సెర్మనీ సందర్భంగా నిర్మొహమాటంగా బౌలర్లను హెచ్చరించాడు. నోబాల్స్ అస్సలు వేయకూడదని, వైడ్లు కూడా తగ్గించుకోవాలని సలహా ఇచ్చాడు. లేదంటే కొత్త కెప్టెన్ వస్తాడని కూడా స్పష్టం చేశాడు. లక్నోతో మ్యాచ్ లో చెన్నై బౌలర్లు మూడు నోబాల్స్, 13 వైడ్లు వేశారు.
"వాళ్లు అసలు నోబాల్స్ వేయకూడదు. వైడ్లు కూడా తక్కువ వేయాలి. మేము చాలా ఎక్కువగా అదనపు బంతులు వేస్తున్నాం. వాటిని తగ్గించాలి. లేదంటే వాళ్లు కొత్త కెప్టెన్ కింద ఆడతారు. ఇంతకుముందు కూడా చెప్పాను. ఇది వాళ్లకు నేనిచ్చే సెకండ్ వార్నింగ్" అని ధోనీ అనడం విశేషం.
ఈ మ్యాచ్ లో చెన్నై 12 పరుగుల తేడాతో లక్నోపై విజయం సాధించింది. ఈ సీజన్ లో చెన్నై సాధించిన తొలి విజయమిదే. 217 పరుగుల భారీ స్కోరు చేసినా.. చెన్నైకి ఒక దశలో ఓటమి భయం పట్టుకుంది. దీనికి కారణం బౌలర్లు పదేపదే ఎక్స్‌ట్రాలతోపాటు భారీగా పరుగులు ఇవ్వడమే. అయితే చివరికి ఎలాగోలా లక్నోను 205 పరుగులకు కట్టడి చేసి 12 పరుగులతో విజయం సాధించింది.
నాలుగేళ్ల తర్వాత చెపాక్ లో చెన్నై టీమ్ ఆడింది. అభిమానులను అంచనాలను అందుకుంటూ సీజన్ లో తొలి విజయం అందుకుంది. ధోనీ కూడా ఆడింది మూడు బంతులే అయినా.. తొలి రెండు బంతులనే సిక్స్ లుగా మలచి ఆకట్టుకున్నాడు.
సంబంధిత కథనం