MS Dhoni: ధోనీ క్రీజులో ఉన్నా చెన్నై గెలవలేకపోయిన ఆ ఐదు మ్యాచ్‌లూ ఇవే-ms dhoni failed to finish the matches on five occasions in ipl ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ms Dhoni: ధోనీ క్రీజులో ఉన్నా చెన్నై గెలవలేకపోయిన ఆ ఐదు మ్యాచ్‌లూ ఇవే

MS Dhoni: ధోనీ క్రీజులో ఉన్నా చెన్నై గెలవలేకపోయిన ఆ ఐదు మ్యాచ్‌లూ ఇవే

Hari Prasad S HT Telugu
Apr 13, 2023 06:15 PM IST

MS Dhoni: ధోనీ క్రీజులో ఉన్నా చెన్నై గెలవలేకపోయిన ఐదు మ్యాచ్‌లు ఐపీఎల్లో ఉన్నాయి. తాజాగా ఆ లిస్టులో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ కూడా చేరింది. మిగతా ఆ మ్యాచ్ లేవో ఇప్పుడు చూద్దాం.

రాయల్స్ తో మ్యాచ్ లో సీఎస్కేని గెలిపించలేకపోయిన ధోనీ
రాయల్స్ తో మ్యాచ్ లో సీఎస్కేని గెలిపించలేకపోయిన ధోనీ (Agencies)

MS Dhoni: ధోనీ ఓ ఫైటర్, ధోనీ ఓ ఫినిషర్.. కానీ అతడు కూడా ఓ మనిషే. ఎంతటి గొప్ప బ్యాటరే అయినా, ఒత్తిడిని చిత్తు చేసే గొప్ప్ ప్లేయరే అయినా.. ఒక్కోసారి ప్లాన్ వర్కౌట్ కాదు. దీంతో టీమ్ కు ఓటమి తప్పదు. ధోనీ క్రీజులో ఉంటే చాలు టీమ్ కచ్చితంగా గెలుస్తుందన్న నమ్మకం అభిమానులకు ఉన్నా.. ప్రతిసారీ అది సాధ్యం కాదు అనడగానికి బుధవారం (ఏప్రిల్ 12) చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచే నిదర్శనం.

ఈ మ్యాచ్ లో ధోనీ చివరి బాల్ వరకూ క్రీజులో ఉన్నా.. సీఎస్కేకు ఓటమి తప్పలేదు. అప్పటికీ అతడు తనదైన రీతిలో సిక్స్ లతో విరుచుకుపడి ప్రత్యర్థిని భయపెట్టినా.. చివరికి తలవంచక తప్పలేదు. ఇప్పుడే కాదు.. ఇంతకుముందు కూడా ధోనీ ఇలా చివరి వరకూ క్రీజులో ఉన్నా సీఎస్కేను గెలిపించలేకపోయిన సందర్భాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

సీఎస్కే vs ఆర్ఆర్ (2023)

బుధవారం (ఏప్రిల్ 12) రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ చెన్నై అభిమానులకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. సొంతగడ్డపై జరిగిన ఈ మ్యాచ్.. ధోనీ కెప్టెన్ గా 200వది. ఆ మ్యాచ్ లోనూ టీమ్ ను గెలిపించి తనకు తానే గిఫ్ట్ ఇచ్చుకుందామని భావించిన ధోనీ ఆశలు నెరవేరలేదు. అతడు మెరుపు వేగంతో 17 బంతుల్లో 32 పరుగులు చేసినా.. చివరి ఓవర్లో రెండు కళ్లు చెదిరే సిక్స్ లు కొట్టినా.. 3 పరుగుల తేడాతో చెన్నై ఓడిపోయింది.

సన్ రైజర్స్ హైదరాబాద్ vs పుణె సూపర్ జెయింట్స్ (2016)

ఆ ఏడాది చెన్నై లేకపోవడంతో ధోనీ.. రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ తరఫున ఆడాడు. ఆ మ్యాచ్ లో తన టీమ్ గెలవడానికి చివరి రెండు బంతుల్లో ఆరు పరుగులు అవసరం అయ్యాయి. ధోనీ ఉండటంతో అది సాధ్యమే అనుకున్నారంతా. నెహ్రా వేసిన ఆ ఓవర్ ఐదో బంతికి ధోనీ రెండు పరుగులు తీయడానికి ప్రయత్నించాడు. అయితే రెండో పరుగు తీసే ప్రయత్నంలో రనౌటయ్యాడు.

2020లో సన్ రైజర్స్‌తోనే..

ఐసీఎల్ 2020లోనూ మరోసారి సన్ రైజర్స్ తోనే మ్యాచ్ ను ముగించలేకపోయాడు ధోనీ. ఈసారి చెన్నై తరఫునే అతడు ఆడాడు. ఆ మ్యాచ్ లో ధోనీ చివరికి 36 బంతుల్తో 47 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చివరి ఓవర్లో 28 రన్స్ అవసరమయ్యాయి. అబ్దుల్ సమద్ ఆ ఓవర్ వేశాడు. తొలి బంతికే అతడు ఐదు వైడ్లు ఇచ్చాడు. తర్వాత నాలుగు బంతుల్లో చెన్నై 9 రన్స్ చేయగలిగింది. చివరి రెండు బంతులకు 14 పరుగులు అవసరం అయ్యాయి. ధోనీ ఐదో బంతికి సింగిల్ మాత్రమే తీయగలిగాడు. చివరి బంతికి అవతలి బ్యాటర్ సిక్స్ కొట్టినా ఫలితం లేకపోయింది.

2013లో ముంబై ఇండియన్స్‌తో..

2013 ఐపీఎల్ ఫైనల్లోనూ ధోనీ తన చెన్నై టీమ్ ను గెలిపించలేకపోయాడు. ఆ మ్యాచ్ లో చెన్నై 149 పరుగులు ఛేదించాల్సి వచ్చింది. కానీ చెన్నై మాత్రం 9 వికెట్లకు 125 రన్స్ మాత్రమే చేయగలిగింది. ధోనీ ఒంటరి పోరాటం చేసి 45 బంతుల్లో 63 రన్స్ తో అజేయంగా నిలిచినా.. జట్టును గెలిపించలేకపోయాడు.

2019లో ఆర్సీబీతో..

ఇక 2019లో ఆర్సీబీతో మ్యాచ్ లో చెన్నై కేవలం పరుగు తేడాతో ఓడిపోయింది. ఆ మ్యాచ్ లో 162 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన చెన్నై.. చివరికి 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 రన్స్ చేసి ఒక పరుగుతో ఓడిపోయింది. ఆ మ్యాచ్ లోనూ ధోనీ 48 బంతుల్లో 84 పరుగులతో అజేయంగా నిలిచాడు. చివరి ఓవర్లో ఒక ఫోర్, మూడు సిక్స్ లు కూడా కొట్టాడు. అయితే చివరి బంతికి రెండు పరుగులు అవసరం అయ్యాయి. ఉమేష్ వేసిన స్లో కటర్ ను ధోనీ కొట్టలేకపోయాడు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న శార్దూల్ రనౌట్ కావడంతో ఒక పరుగు తేడాతో సీఎస్కే ఓడిపోయింది.

WhatsApp channel

సంబంధిత కథనం