Shikhar Dhawan: నా స్ట్రైక్‌రేట్ బాగుందా.. విమర్శకులకు ధావన్ దిమ్మదిరిగే రిప్లై
Shikhar Dhawan: నా స్ట్రైక్‌రేట్ బాగుందా అంటూ విమర్శకులకు దిమ్మదిరిగే రిప్లై ఇచ్చాడు శిఖర్ ధావన్. ఆదివారం (ఏప్రిల్ 9) సన్ రైజర్స్ తో మ్యాచ్ లో ధావన్ 99 పరుగులతో ఒంటరి పోరాటం చేసిన విషయం తెలిసిందే.
Shikhar Dhawan: ఐపీఎల్లో తనకంటే నిలకడగా ఆడే మరో బ్యాటర్ లేడని శిఖర్ ధావన్ మరోసారి నిరూపించాడు. సన్ రైజర్స్ తో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ అయిన ధావన్.. 66 బంతుల్లోనే 99 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ లో 12 ఫోర్లు, 5 సిక్స్ లు ఉన్నాయి. అయితే మిగతా పంజాబ్ బ్యాటర్లు విఫలమవడంతో ఈ మ్యాచ్ లో ఆ టీమ్ కు ఓటమి తప్పలేదు.
అయితే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు మాత్రం ధావన్ కే దక్కింది. ఈ సందర్భంగా మాట్లాడిన అతడు.. తనను విమర్శిస్తున్న వారికి దిమ్మదిరిగే రిప్లై ఇచ్చాడు. ఇన్నాళ్లూ తన స్ట్రైక్ రేట్ పై విమర్శలు చేస్తున్న వారిపై ధావన్ స్పందించాడు. "మీరేదో ట్వీట్ చేసినట్లున్నారు కదా. నా స్ట్రైక్ రేట్ ఇప్పుడు బాగుందా? నేను గూగ్లీస్ కూడా వేయగలను" అని ధావన్ అనడం విశేషం.
తమ టీమ్ వరుసగా వికెట్లు కోల్పోవడంతో మంచి స్కోరు సాధించలేకపోయామని, అందుకే ఓడిపోయినట్లు అతడు చెప్పాడు. ఈ మ్యాచ్ లో పంజాబ్ 143 రన్స్ మాత్రమే చేయగా.. అందులో ధావన్ స్కోరే 99 కావడం విశేషం. ఆ తర్వాత చేజింగ్ లో సన్ రైజర్స్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి సులువుగా టార్గెట్ చేజ్ చేసింది.
ఇదే బెస్ట్ టీ20 ఇన్నింగ్స్: బ్రియాన్ లారా
మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్ బ్రియాన్ లారా కూడా శిఖర్ ధావన్ పై ప్రశంసలు కురిపించాడు. ఇప్పటి వరకూ తాను శిఖర్ ధావన్ లాంటి టీ20 ఇన్నింగ్స్ చూడలేదని అనడం విశేషం. "శిఖర్ ధావన్ ను మెచ్చుకోవాల్సిందే. టీ20 క్రికెట్ లో నేను చూసిన బెస్ట్ ఇన్నింగ్స్ లో ఇదీ ఒకటి. అతడు గేమ్ ను పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకున్నాడు" అని లారా అన్నాడు.
మరో వెస్టిండీస్ దిగ్గజ ప్లేయర్ క్రిస్ గేల్ కూడా ధావన్ పై ప్రశంసలు కురిపించాడు. అతడు సెంచరీ చేయాల్సిందని అన్నాడు. మూడంకెల స్కోరుకు అతడు ఒక పరుగు దూరంలో నిలిచిపోయాడు. ఐపీఎల్లోనే బెస్ట్ ఇన్నింగ్స్ లో ఒకటని గేల్ అన్నాడు.
సంబంధిత కథనం