Kohli Tweet: టీమిండియా, ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి చేసిన ట్వీట్ ఒకటి ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఐపీఎల్ 2023లో భాగంగా సోమవారం (ఏప్రిల్ 17) ఆర్సీబీ, సీఎస్కే మధ్య మ్యాచ్ తర్వాత కోహ్లి ఈ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా ధోనీని ఆత్మీయంగా కౌగిలించుకుంటున్న ఫొటోను కూడా అతడు షేర్ చేశాడు. ఇప్పుడీ ట్వీట్ ఇంటర్నెట్ ను బ్రేక్ చేస్తోంది.
ఆర్సీబీ, సీఎస్కే కలిస్తే ఇండియా అన్నట్లు విరాట్ ఆ ట్వీట్ చేశాడు. సింపుల్ గా రెడ్, ఎల్లో కలర్స్ లో ఉన్న హార్ట్ ఎమోజీలను పోస్ట్ చేశాడు. ఈ రెండు రంగులూ ఆర్సీబీ, సీఎస్కే టీమ్స్ కు సంబంధించినవి. ఈ ట్వీట్ లో అతడు ధోనీని కూడా ట్యాగ్ చేశాడు. దీంతో ఇటు విరాట్ ఫ్యాన్స్, అటు ధోనీ ఫ్యాన్స్ ఇద్దరూ ఈ ట్వీట్ ను వైరల్ గా మార్చేశారు.
ఈ మ్యాచ్ లో సీఎస్కే 8 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారిన ఈ మ్యాచ్ అభిమానులకు మంచి థ్రిల్ అందించింది. మొదట సీఎస్కే 226 పరుగుల భారీ స్కోరు చేయగా.. తర్వాత బెంగళూరు 218 పరుగుల వరకూ వచ్చి ఆగిపోయింది. సిక్సర్ల వర్షంలో అభిమానులు తడిసి ముద్దయ్యారు.
మ్యాచ్ సంగతి పక్కన పెడితే.. తర్వాత ధోనీ, కోహ్లి మధ్య ఉన్న స్నేహ బంధం అభిమానులను మరింత ఆకర్షించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత రెండు జట్ల ప్లేయర్స్ హ్యాండ్ షేక్స్ చేస్తున్న సమయంలో ధోనీని కోహ్లి హగ్ చేసుకొని చెవిలో ఏదో చెప్పాడు. ఆ తర్వాత ఈ ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నారు. ఇక మ్యాచ్ ముగిసిన మరుసటి రోజు అంటే మంగళవారం (ఏప్రిల్ 18) విరాట్ ఈ ట్వీట్ చేశాడు.
సంబంధిత కథనం