KL Rahul out of IPL 2023: లక్నోకు భారీ షాక్.. ఐపీఎల్ నుంచి ఆ ఇద్దరూ ఔట్.. టీమిండియాకైనా ఆడతారా?
03 May 2023, 13:48 IST
KL Rahul out of IPL 2023: లక్నోసూపర్ జెయింట్స్ కు భారీ షాక్ తగిలింది. ఐపీఎల్ నుంచి ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్స్ ఔట్ అయ్యారు. అయితే వాళ్లు టీమిండియాకైనా ఆడతారా లేదా అన్నది కూడా అనుమానమే.
ఆర్సీబీతో మ్యాచ్ లో కేఎల్ రాహుల్ గాయపడ్డాడు
KL Rahul out of IPL 2023: ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ కు గట్టి షాకే తగిలింది. ఆ టీమ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తో పాటు స్టార్ పేస్ బౌలర్ జైదేవ్ ఉనద్కట్ మిగిలిన ఐపీఎల్ మొత్తానికీ దూరమయ్యారు. ఆర్సీబీతో మ్యాచ్ లో రాహుల్ గాయపడగా.. అంతకుముందే జైదేవ్ నెట్ ప్రాక్టీస్ చేస్తూ భుజం గాయానికి గురయ్యాడు. ఇప్పుడీ ఇద్దరూ వచ్చే నెలలో జరగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్ అయినా ఆడతారా లేదా అన్నది చూడాలి.
ఆర్సీబీతో మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో రాహుల్ తన తొడకు గాయం చేసుకున్నాడు. గాయం తగిలిన తర్వాత కాసేపటి వరకూ కదల్లేకపోయిన రాహుల్.. నడవడానికీ ఇబ్బందిపడుతూ డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిపోయాడు. ఆ తర్వాత లక్నో బ్యాటింగ్ సమయంలోనూ 9వ వికెట్ పడిన తర్వాత గానీ క్రీజులోకి రాలేదు. అప్పుడు కూడా అసలు పరుగెత్తలేకపోయాడు.
రాహుల్ మరో నెల రోజుల్లో (జూన్ 7) ప్రారంభం కాబోయే డబ్ల్యూటీసీ ఫైనల్ లోపు పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడా లేదా అన్నది చూడాలి. ఇప్పుడా బాధ్యత బీసీసీఐ స్పోర్ట్స్ సైన్స్, మెడికల్ టీమ్ ఉంది. అటు పేస్ బౌలర్ జైదేవ్ ఉనద్కట్ భుజం గాయం కూడా చాలా తీవ్రంగానే ఉన్నట్లు లక్నో టీమ్ తెలిపింది. దీంతో అతడు కూడా ఐపీఎల్ మొత్తానికీ దూరమయ్యాడు.
ఇది లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ కు కోలుకోలేని దెబ్బే. గురువారం (మే 4) కేఎల్ రాహుల్ లక్నో టీమ్ ను విడిచి వెళ్లనున్నాడు. బుధవారం (మే 3) చెన్నై సూపర్ కింగ్స్ తో లక్నో మ్యాచ్ ఆడనుంది. ప్రస్తుతానికి రాహుల్ కు ఎలాంటి స్కాన్లు తీయలేదు. ముంబైలో బీసీసీఐ పర్యవేక్షణలో స్కాన్లు తీసిన తర్వాత అతని గాయం తీవ్రత ఎంతో తేలనుంది.
ఇప్పటికే పంత్, శ్రేయస్ అయ్యర్, బుమ్రాలాంటి ప్లేయర్స్ డబ్ల్యూటీసీ ఫైనల్ కు దూరమైన నేపథ్యంలో ఆ సమయానికి రాహుల్ పూర్తి ఫిట్ గా ఉండటం చాలా అవసరం. అటు జైదేవ్ ఉనద్కట్ పరిస్థితి కూడా అలాగే ఉంది. అతని భుజంలో ఎముక జరగకపోయినా.. గాయం తీవ్రత ఎక్కువగానే ఉందని, డబ్ల్యూటీసీ ఫైనల్ సమయానికి పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడా లేదా అన్నది కూడా చెప్పలేమని పీటీఐ రిపోర్ట్ వెల్లడించింది.