IPL 2023 KL Rahul : అయ్యయ్యో ఇదేం పోలిక.. కేఎల్ రాహుల్ ఔట్ అయితేనే మంచిదట
IPL 2023 Telugu : క్రికెటర్లు సెంటిమెంట్ నమ్ముతారో లేదో తెలియదు గానీ.. ఫ్యాన్స్ మాత్రం కచ్చితంగా నమ్ముతారు. కొన్ని విషయాలు జరిగితేనే మ్యాచ్ గెలుస్తారని చెబుతారు. ఇప్పుడు ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ ఫ్యాన్స్ కూడా అదే అంటున్నారు. కేఎల్ రాహుల్ ఔట్ అయితేనే మంచిదంటున్నారు.
ఓ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, లక్నో సూపర్ జెయింట్స్(lucknow super giants) భారీ స్కోరు చేసినప్పుడల్లా.. ఆ మ్యాచ్‌లలో KL రాహుల్ పవర్‌ప్లేలో అవుట్ అయ్యాడు. ఇప్పుడు అదే విషయాన్ని ఫ్యాన్స్ పట్టుకున్నారు. ఐపీఎల్ సీజన్ 16లో భారీ స్కోరు నమోదు చేసి రికార్డు సృష్టించిన లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పుడు పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో నిలిచింది. లక్నో ఆడిన 8 మ్యాచ్‌ల్లో 5 గెలిచింది. ఈ ఐదు మ్యాచ్‌ల్లో కేఎల్ రాహుల్(KL Rahul) జట్టు 3 సార్లు 200కు పైగా పరుగులు చేయడం విశేషం.
లక్నో సూపర్‌జెయింట్ ఎప్పుడైతే భారీ స్కోరు చేస్తుందో.. ఆ మ్యాచ్‌లలో కేఎల్ రాహుల్ పవర్‌ప్లేలోనే అవుట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ తొందరగానే ఔటైన మ్యాచ్‌ల్లో లక్నో సూపర్‌జెయింట్స్ అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన చేయడం విశేషం. పంజాబ్ కింగ్స్(Punjab Kings)తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ రికార్డు స్థాయిలో 257 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 9 బంతుల్లో 12 పరుగులు చేసి ఔటయ్యాడు.
ఆర్‌సీబీ(RCB)తో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 20 బంతుల్లో 18 పరుగులు చేసి వికెట్ కోల్పోయాడు. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ 213 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. అదేవిధంగా, CSKపై రాహుల్ 18 బంతుల్లో 20 పరుగులు చేసినప్పటికీ, లక్నో సూపర్ జెయింట్ 205 పరుగులు చేసింది. అంతేకాకుండా, ఢిల్లీ క్యాపిటల్స్(Delhi capitals)పై లక్నో సూపర్‌జెయింట్స్ 193 పరుగులు చేసిన సమయంలో, KL రాహుల్ 12 బంతుల్లో 8 పరుగులు చేసి ఔటయ్యాడు.
రాహుల్ అద్భుత ప్రదర్శన చేసిన మ్యాచ్‌ల్లో లక్నో జట్టు స్కోరు ఇలా ఉంది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 56 బంతుల్లో 74 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ 159 పరుగులు మాత్రమే చేసింది. ఇక రాజస్థాన్ రాయల్స్‌పై రాహుల్ 32 బంతుల్లో 39 పరుగులు చేయగా, లక్నో 154 పరుగులు మాత్రమే చేయగలిగింది.
అలాగే, గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)పై కేఎల్ రాహుల్ 61 బంతుల్లో 68 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ ఓడిపోయింది. ఇలా అన్ని మ్యాచులను పోల్చుతున్నారు లక్నో ఫ్యాన్స్. 20 కంటే తక్కువ బంతులు ఎదుర్కొన్న కేఎల్ రాహుల్ తొందరగానే ఔటైతే.. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు భారీ స్కోరు చేస్తుందని నమ్ముతున్నారు.