Vaughn on KL Rahul: రాహుల్ ఆటపై సందేహం.. టీ20లకు పనికొస్తాడా? గెలిచే మ్యాచ్ చేజార్చుకున్న లక్నో-michael vaughan doubtful of kl rahul batting in t20 cricket ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Michael Vaughan Doubtful Of Kl Rahul Batting In T20 Cricket

Vaughn on KL Rahul: రాహుల్ ఆటపై సందేహం.. టీ20లకు పనికొస్తాడా? గెలిచే మ్యాచ్ చేజార్చుకున్న లక్నో

Maragani Govardhan HT Telugu
Apr 22, 2023 08:14 PM IST

Vaughn on KL Rahul: గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో ఓడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌పై మైఖేల్ వాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. టీ20 ఫార్మాట్‌‌లో అతడి ఫామ్‌పై అనుమానం వ్యక్తం చేశారు.

కేఎల్ రాహుల్
కేఎల్ రాహుల్ (AFP)

Vaughn on KL Rahul: గుజరాత్ టైటాన్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓడిపోయింది. 136 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక పరాజయం పాలైంది. 14 ఓవర్లకే 100 పరుగులకు చేరువైన లక్నో అనూహ్యంగా పరాజయం పాలైంది. కేఎల్ రాహుల్(68) అర్ధశతకంతో రాణించినా ఫలితం లేకపోయింది. గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోవడంతో లక్నో జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కెప్టెన్ కేఎల్ రాహుల్ నిదానంగా ఆడటంపై పలువురు మాజీలు అసంతృప్తితో ఉన్నారు. తాజాగా ఇంగ్లీష్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ సైతం రాహుల్ ఆటతీరును తప్పుపట్టారు. అంతేకాకుండా టీ20ల్లో అతడి గేమ్‌పై అనుమానం వ్యక్తం చేశారు.

"కేఎల్ రాహుల్ టెస్టుల్లో, వన్డేల్లో బ్రిలియంట్ బ్యాటర్. కానీ టీ20 క్రికెట్‌లో మాత్రం అతడిపై నాకు అనుమానం వస్తోంది. అతడు ఇంకా ఎక్కువ రిస్కులు తీసుకోవాలని నేను అనుుకంటున్నాను. నేను చాలా మంది భారత ఆటగాళ్లను చూశాను. నిలదొక్కుకునేంత వరకు ఎక్కువ బంతులు తీసుకుంటారు. టీ20 క్రికెట్‌లో అలా కాదు. అది మోడర్న్ గేమ్.. ఆలోపే మ్యాచ్ చేజారిపోతుంది." అని మైఖేల్ వాన్ స్పష్టం చేశారు.

7వ స్థానం లోపే బ్యాటింగ్ లైనప్ ఎండ్ అయ్యే తరంలో మనం లేమని వాన్ స్పష్టం చేశారు. కొన్నిజట్లలో 11 మంది బ్యాటర్లు ఉన్నారని గుర్తు చేశారు. "టీ20ల్లో దూకుడుగా ఆడాలి. కేఎల్ రాహుల్ చేతిలో మ్యాచ్ ఉంది. పాత బండి మాదిరిగా మూడో గేర్‌లో వెళ్లడం మాకు ఇష్టం లేదు. పెర్రారీ కారు వలే 5వ గేర్‌లో గేమ్‌లో ఊపు తీసుకురావాలి. రాహుల్ కనీసం 4వ గేర్‌లోనైనా ఆడగలడా? కొంచెం వేగంగా బ్యాటింగ్ చేయగలడా?" అని సందేహం వ్యక్తం చేశారు వాన్.

ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. లక్నో ముందుంచిన స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుంది. చివరి ఓవర్లలో తెలివిగా బౌలింగ్ చేసిన గుజరాత్ బౌలర్లు ఎట్టకేలకు విజయం సాధించారు. 136 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేని లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 128 పరుగులకే పరిమితమైంది. కేఎల్ రాహుల్ అర్ధశతకం చేసినా మ్యాచ్ మాత్రం గెలిపించలేకపోయాడు. గుజరాత్ బౌలర్లు ఐదు ఓవర్లలో కేవలం 19 పరుగులే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టారు. ఆఖరు ఓవర్లో లక్నో విజయానికి 19 పరుగులు అవసరం కాగా.. గుజరాత్ బౌలర్ మోహిత్ శర్మ 4 పరుగులే ఇచ్చాడు. పైగా 2 వికెట్లు తీశాడు. చివరి ఓవర్లో లక్నో 4 వికెట్లు కోల్పోయింది.

WhatsApp channel