IPL 2023 Points Table: ముంబయిపై గుజరాత్ విజయంతో మారిన స్థానాలు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ వివరాలివే
IPL 2023 Points Table: మంగళవారం నాడు ముంబయిపై గుజరాత్ విజయం సాధించడంతో పాయింట్ల పట్టికలో కొన్ని మార్పులు వచ్చాయి. ఈ విజయంతో గుజరాత్ టాప్-2కి చేరగా.. పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా రషీద్ ఖాన్ నిలిచాడు.
IPL 2023 Points Table: ముంబయి ఇండియన్స్‌పై గుజరాత్ టైటాన్స్ 55 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ సహా పలువురు బ్యాటర్లు విఫలం కావడంతో 208 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక ముంబయి చతికిలబడింది. గుజరాత్ బౌలర్లు సమష్టిగా రాణించి తమ జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. తాజా విజయంతో 10 పాయింట్లతో టాప్-2కి చేరింది గుజరాత్. 7 మ్యాచ్‌లు ఆడిన ఈ జట్టు కేవలం రెండింటిలోనే ఓడి 5 విజయాలతో రెండో స్థానంలో నిలిచింది. భారీ తేడాతో ముంబయి ఓడటంతో గుజరాత్‌కు 2 పాయింట్లు సహా రన్ రేట్ కూడా సమర్పించుకోవడంతో ప్రత్యర్థి జట్టు మెరుగైన స్థితిలో నిలిచేలా చేసింది.
అగ్రస్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌ను(+0.662) గుజరాత్(+0.580) పాయింట్లలో సమం చేసినప్పటికీ రన్ రేట్ తక్కువగా ఉండటంతో రెండో స్థానంతో సరిపెట్టుకుంది. నాలుగు విజయాలతో రాజస్థాన్ మూడో స్థానంలో ఉండగా.. లక్నో సూపర్ జెయింట్స్ నాలుగో స్థితిలో నిలిచింది. ఇంక అన్నింటికంటే దిగువన 2 విజయాలతో దిల్లీ క్యాపిటల్స్ ఉండగా.. అవే పాయింట్లతో సన్ రైజర్స్ హైదరాబాద్ కింది నుంచి రెండో స్థానంతో సరిపెట్టుకుంది.
ఆరెంజ్ క్యాప్..
ఆరెంజ్ క్యాప్ ఆర్సీబీ ప్లేయర్ ఫాఫ్ డుప్లెసిస్ వద్దే ఉంది. 7 మ్యాచ్‌ల్లో 405 పరుగులు చేసిన డుప్లి అగ్రస్థానంలో నిలవగా.. చెన్నై బ్యాటర్ డేవాన్ కాన్వే 314 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. 306 పరుగులతో వార్నర్ మూడో ప్లేస్‌లో నిలవగా.. ముంబయిపై అద్భుత అర్ధశతకం చేసిన శుబ్‌మన్(284) గిల్ నాలుగో స్థానానికి చేరాడు. ఫలితంగా విరాట్ కోహ్లీ(270) ఐదో స్థానానికి దిగజారాడు.
పర్పుల్ క్యాప్..
ముంబయితో జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్లతో అదరగొట్టిన రషీద్ ఖాన్ 14 వికెట్లతో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచి పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఫలితంగా మహమ్మద్ సిరాజ్(13 వికెట్లు), అర్షదీప్ సింగ్(13 వికెట్లు), యజువేంద్ర చాహల్(12 వికెట్లు) వరుసగా తర్వాతి స్థానాలకు దిగజారారు.
గుజరాత్‌పై ముంబయి 55 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 208 పరుగుల లక్ష్యాన్ని ఛేధించలేక 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టపోయి 152 పరుగులకే పరిమితమైంది. నేహాల్(40), కేమరూన్ గ్రీన్(33) మినహా మిగిలిన వారు చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. గుజరాత్ బౌలర్లలో నూర్ అహ్మద్ 3 వికెట్లతో విజృంభించగా.. రషీద్ ఖాన్, మోహిత్ శర్మ చెరో 2 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ బ్యాటర్లలో శుబ్‌మన్ గిల్(56) అర్ధసెంచరీతో ఆకట్టుకోగా.. చివర్లో అభినవ్(42), మిల్లర్(46), రాహుల్ తెవాతియా(20) మెరుపులు మెరిపించారు.
సంబంధిత కథనం