WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు టీమిండియాకు మరో షాక్.. స్టార్ పేసర్‌కు గాయం
WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు టీమిండియాకు మరో షాక్ తగిలేలా ఉంది. స్టార్ పేసర్ గాయపడ్డాడు. ఐపీఎల్ సందర్భంగా లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్న జైదేవ్ ఉనద్కట్ కు భుజం గాయమైంది.
WTC Final: టీమిండియాను గాయాలు ఇప్పట్లో వదిలేలా లేవు. వచ్చే నెలలో జరగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ కు ముందు టీమిండియాకు మరో షాక్ తగిలేలా ఉంది. స్టార్ పేస్ బౌలర్ జైదేవ్ ఉనద్కట్ గాయపడ్డాడు. ఇప్పటికే ఈ కీలకమైన మ్యాచ్ కు ఇండియన్ టీమ్ శ్రేయస్ అయ్యర్, పంత్, బుమ్రా లేకుండానే బరిలోకి దిగుతోంది.
ఇప్పుడు ఫైనల్ జట్టుకు ఎంపికైన ఉనద్కట్ కూడా గాయపడటం టీమ్ మేనేజ్‌మెంట్ కు మింగుడుపడటం లేదు. ప్రస్తుతం ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్న జైదేవ్ ఉనద్కట్.. ఆదివారం (ఏప్రిల్ 30) ప్రాక్టీస్ సందర్భంగా భుజానికి గాయం చేసుకున్నాడు. నెట్స్ లో బౌలింగ్ చేయబోతూ కిందపడిన అతని భుజానికి గాయమైంది.
ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్స్ ఈ విషయాన్ని సోమవారం (మే 1) ఆర్సీబీ, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ సందర్భంగా వెల్లడించింది. ఉనద్కట్ గాయపడిన సందర్భంలోని వీడియోను చూపించారు. అతడు గాయపడగానే భుజానికి ఐస్ ప్యాక్స్ పెట్టి బయటకు తీసుకెళ్లారు. దీనికి సంబంధించి లక్నో సూపర్ జెయింట్స్ ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు.
ఒకవేళ జైదేవ్ కూడా డబ్ల్యూటీసీ ఫైనల్ కు దూరమైతే మాత్రం ఇండియాకు పెద్ద దెబ్బ పడినట్లే. ఇప్పటికే మరో పేస్ బౌలర్ ఉమేష్ యాదవ్ కూడా గాయపడ్డాడు. కేకేఆర్ తరఫున ఆడుతున్న ఉమేష్.. ఆ టీమ్ చివరగా ఆడిన మ్యాచ్ కు దూరమయ్యాడు. ఫైనల్ కు ఎంపిక జట్టులో వీళ్లు కాకుండా శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్ మాత్రమే ఉన్నారు.
ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఐదుగురు స్టాండ్ బైలను సిద్ధంగా ఉంచగా.. అందులో ఇద్దరు పేసర్లు ఉన్నారు. నవ్‌దీప్ సైనీ, ముకేశ్ కుమార్ లలో ఒకరు జైదేవ్ ఉనద్కట్ స్థానంలో వచ్చే అవకాశం ఉంటుంది. జూన్ 7 నుంచి ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ జరగనుంది.
సంబంధిత కథనం