Jaydev Unadkat Hat Trick: తొలి ఓవర్‌లో హ్యాట్రిక్ - రంజీ ట్రోఫీలో జయదేవ్ ఉనద్కత్ రికార్డ్
Jaydev Unadkat Hat Trick: రంజీ ట్రోఫీలో టీమ్ ఇండియా పేసర్ జయదేవ్ ఉనద్కత్ తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్ సాధించి రికార్డ్ క్రియేట్ చేశాడు. జయదేవ్ ధాటికి ఢిల్లీ పది పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది.
Jaydev Unadkat Hat Trick: రంజీ ట్రోఫీలో జయదేవ్ ఉనద్కత్ కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్ దక్కించుకున్న ఏకైక బౌలర్‌గా చరిత్రను సృష్టించాడు. గత ఏడాది దేశవాళీ క్రికెట్‌లో బౌలింగ్‌తో ఆకట్టుకున్న జయదేవ్ దాదాపు 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జాతీయ జట్టులో స్థానాన్ని దక్కించుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఈ సిరీస్‌లో చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
ఈ సిరీస్ ముగిసిన తర్వాత రంజీ ట్రోఫీలో భాగమైన అతడు తొలి మ్యాచ్‌లో అదిరిపోయే ప్రదర్శనను కనబరిచాడు. రంజీ ట్రోఫీలో గ్రూప్ బీ ఎలైట్‌లో భాగంగా మంగళవారం సౌరాష్ట్ర, ఢిల్లీ మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్ ఎంచుకున్నది.
తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లు తీసి ఢిల్లీకి షాక్ ఇచ్చాడు జయదేవ్ ఉనద్కత్. తొలి బంతికే ధృవ్ షోరేను ఔట్ చేశాడు. రెండో బాల్‌కు వైభవ్ రావల్, మూడో బంతికి కెప్టెన్ యశ్ ధుల్‌ను పెవిలియన్‌కు పంపించాడు. అతడి బౌలింగ్ ధాటికి పరుగులు ఖాతా తెరవకుండానే ఢిల్లీ మూడు వికెట్లు కోల్పోయింది.
తన రెండో ఓవర్‌లో సిద్ధు, లలిత్ యాదవ్‌లను ఔట్ చేశాడు. రంజీ ట్రోఫీలో రెండో ఓవర్లు వేసి ఐదు వికెట్లు తీసుకున్న తొలి బౌలర్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు. జయదేవ్ ధాటికి ఢిల్లీ 10 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది.
తొలి సెషన్ ముగిసే సరికి ఏడు ఓవర్లు వేసిన జయదేవ్ 20 రన్స్ ఇచ్చి ఆరు వికెట్లు తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ నలుగురు డకౌట్ కావడం గమనార్హం. ప్రస్తుతం పదిహేను ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 58 పరుగులు ఇన్నింగ్స్ కొనసాగిస్తోంది ఢిల్లీ.
టాపిక్