Yashasvi Jaiswal: అప్పుడు పానీ పూరీ అమ్మాడు.. ఇప్పుడు ఐపీఎల్లోనే సెంచరీ బాదాడు.. యశస్వీ జర్నీ సూపర్
Yashasvi Jaiswal: అప్పుడు పానీ పూరీ అమ్మాడు.. ఇప్పుడు ఐపీఎల్లోనే సెంచరీ బాదాడు. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ జర్నీ సూపర్ అనకుండా ఉండలేరు.
Yashasvi Jaiswal: ఐపీఎల్ పై ఎన్ని విమర్శలు ఉన్నా.. ఆణిముత్యాల్లాంటి క్రికెటర్లను ఇండియన్ టీమ్ కు అందించిన ఘనత మాత్రం ఈ మెగా లీగ్‌దే. ఎందరో మట్టిలో మాణిక్యాలను వెలికి తీసింది. తాజాగా అలాంటి మాణిక్యమే ఇండియన్ టీమ్ కోసం సిద్ధమవుతున్నాడు. అతని పేరు యశస్వి జైస్వాల్. నిజానికి కొంతకాలంగా ఐపీఎల్లో ఉంటున్నా.. ఈ ఏడాది మాత్రం అతడు టాప్ ఫామ్ లో ఉన్నాడు.
ప్రస్తుతం అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ జైస్వాల్ దగ్గరే ఉండటం విశేషం. ఆదివారం (ఏప్రిల్ 30) ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో తన తొలి సెంచరీ చేశాడు. కేవలం 62 బంతుల్లోనే 124 రన్స్ చేసిన జైస్వాల్.. రాయల్స్ కు భారీ స్కోరు అందించాడు. ఈ మ్యాచ్ ఓడినా కూడా అతని ఇన్నింగ్స్ మాత్రం ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.
పానీ పూరీ నుంచి ఐపీఎల్ వరకు..
ఈ సీజన్ లో యశస్విదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. ఇప్పుడు సంచనాలు క్రియేట్ చేస్తున్న యశస్వి ఒకప్పుడు పానీ పూరీ అమ్మాడన్న విషయం తెలుసా? 11 ఏళ్ల వయసులో తన తల్లిదండ్రులను వదిలేసి ముంబైలో అడుగుపెట్టాడతడు. పగలు క్రికెట్ ఆడుతూ.. రాత్రిపూట పానీ పూరీ అమ్ముతూ చాలా కష్టాలే పడ్డాడు. ముంబైలోని ఆజాద్ మైదాన్ లోని టెంట్లలో కాలం వెల్లదీశాడు.
అలా మెల్లగా క్రికెట్ లో మెరుపులు మెరిపిస్తున్న యశస్విని ఓ రోజు కోచ్ జ్వాలా సింగ్ చూశాడు. అక్కడి నుంచి యశస్వి దశ తిరిగింది. ఆ తర్వాత 2019లో ముంబై టీమ్ కు ఆడాడు. దేశవాళీ క్రికెట్ లో వన్డే డబుల్ సెంచరీ చేసిన యంగెస్ట్ ప్లేయర్ గా యశస్వి రికార్డు క్రియేట్ చేశాడు. అప్పటికి అతని వయసు కేవలం 17 ఏళ్ల 292 రోజులు మాత్రమే.
అదే ఏడాది వేలంలో రాజస్థాన్ రాయల్స్ అతన్ని కొనుగోలు చేసింది. 2020లో ఇండియా అండర్ 19 టీమ్ టాప్ స్కోరర్ అతడే. అంతేకాదు అండర్ 19 వరల్డ్ కప్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గానూ నిలిచాడు. 2020 నుంచి 2022 వరకూ ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ కు ఆడినా.. పెద్దగా స్కోర్లు సాధించలేకపోయాడు. అయితే ఈ ఏడాది మాత్రం అతడు రెచ్చిపోతున్నాడు.
జోస్ బట్లర్ తో కలిసి ఓపెనింగ్ చేస్తున్న జైస్వాల్.. అతన్నే మించిపోయి పరుగులు చేస్తున్నాడు. ముంబైతో మ్యాచ్ లో సెంచరీ చేసినా.. తన టీమ్ ఓడిపోవడమే అతనికి కాస్త మింగుడు పడని విషయం. అయితే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు మాత్రం అతనికే దక్కింది.
సంబంధిత కథనం