Rahane on comeback: రహానే ఎమోషనల్ పోస్ట్.. టీమిండియాలోకి తిరిగి వచ్చిన తర్వాత తొలి రియాక్షన్
Rahane on comeback: రహానే ఎమోషనల్ పోస్ట్ చేశాడు. టీమిండియాలోకి తిరిగి వచ్చిన తర్వాత అతని తొలి రియాక్షన్ వైరల్ అవుతోంది. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే టీమ్ లోకి రహానేను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
Rahane on comeback: ఇండియన్ క్రికెట్ టీమ్ చివరిసారి ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లిన సమయంలో కంగారూ గడ్డపై చారిత్రక విజయం సాధించిన కెప్టెన్ అజింక్య రహానే. ఆ సిరీస్ తొలి టెస్టు ఆడిన తర్వాత విరాట్ తిరిగి ఇండియాకు రావడంతో తర్వాత మూడు టెస్టుల్లో సారథ్యం వహించిన రహానే ఊహకందని విజయాన్ని సాధించి పెట్టాడు. అలాంటి ప్లేయర్ క్రమంగా జట్టులోనే చోటు కోల్పోయాడు.
అయితే ఇప్పుడు అదే ఆస్ట్రేలియాతో జరగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ కోసం ఎంపిక చేసిన జట్టులోకి అనూహ్యంగా అజింక్య రహానే తిరిగొచ్చాడు. సీనియర్ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ గాయాలతో దూరమవడంతోపాటు ఐపీఎల్లో రహానే కళ్లు చెదిరే ఫామ్ కూడా అతనికి కలిసొచ్చింది. ఆ ఫైనల్ ఆడే తుది జట్టులోనూ అతడు కచ్చితంగా ఉండే అవకాశాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో గురువారం (ఏప్రిల్ 27) రహానే తన లింక్డిన్ ప్రొఫైల్ లో ఎమోషనల్ పోస్ట్ చేశాడు. తన కెరీర్ లో ఎదుర్కొన్న ఒడిదుడుకులను అతడు అందులో వివరించాడు. "ఓ ప్రొఫెషనల్ క్రికెటర్ గా నా కెరీర్ లో నా ప్రయాణం ఎప్పుడూ సాఫీగా సాగదని తెలుసుకున్నాను.
కొన్నిసార్లు మన ప్లాన్ కు తగినట్లు జరగని సందర్భాలు ఉన్నాయి. వచ్చిన ఫలితంతో నిరాశకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే వచ్చే ఫలితం మన ఏకాగ్రతను దెబ్బతీయకుండా చూసుకోవాలని నేను నేర్చుకున్నాను" అని రహానే అన్నాడు.
"నా కెరీర్ ను చూసుకుంటే.. ప్రతికూల ఫలితం వచ్చిన సందర్భంలోనూ చేసే పనిని కొనసాగించాను. అదే నాకు చాలా నేర్పించింది. అలాంటి సందర్భాలే నన్ను ఓ మనిషిగా, క్రికెటర్ గా ఎదగడానికి సాయం చేశాయి. క్రికెట్ లోనే నైపుణ్యం ఉన్న ఏ రంగంలో అయినా ఇదే అవసరం. ఇది కేవలం మన నియంత్రణలో ఉండే అంశాలపైనే దృష్టిసారించేలా చేస్తుంది.
మనల్ని మన లక్ష్యాల వైపు నడిపిస్తుంది. ఒత్తిడిని తట్టుకొని నా నియంత్రణలో ఉండేవాటిపైనే దృష్టి సారించడం నేర్చుకున్నాను. ప్రతి ఒక్కరికీ నేను ఇచ్చే సలహా కూడా ఇదే. మీ సామర్థ్యాలను నమ్మండి. మీరు చేస్తున్న పనిని చేసుకుంటూ వెళ్లండి" అని రహానే అన్నాడు.
ఐపీఎల్లో ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న రహానే.. ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఏకంగా 199 స్ట్రైక్ రేటుతో పరుగులు సాధిస్తున్నాడు. ఐదు మ్యాచ్ లలో 209 రన్స్ చేశాడు. అందులో రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.
సంబంధిత కథనం