Rishab Pant Ruled Out: ఆసియా కప్‌, ప్రపంచకప్‌కు పంత్ దూరం..!-rishabh pant set to be ruled out of asia cup and world cup 2023 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rishab Pant Ruled Out: ఆసియా కప్‌, ప్రపంచకప్‌కు పంత్ దూరం..!

Rishab Pant Ruled Out: ఆసియా కప్‌, ప్రపంచకప్‌కు పంత్ దూరం..!

Maragani Govardhan HT Telugu
Apr 26, 2023 01:40 PM IST

Rishab Pant Ruled Out: టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ఈ ఏడాది జరగనున్న ఆసియా, ప్రపంచకప్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. తాజా నివేదికల ప్రకారం అతడు ఈ టోర్నీలో ఆడేది అనుమానంగా మారింది.

రిషభ్ పంత్
రిషభ్ పంత్ (BCCI)

Rishab Pant Ruled Out: టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ గత డిసెంబరులో కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న అతడు.. ఈ మధ్యకాలంలోనే బయట కనిపిస్తున్నాడు. ఇటీవల దిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్ చూసేందుకు వచ్చాడు. ఇంకా కర్ర సహాయంతోనే అతడు నడుస్తున్నాడు. తన అనారోగ్య కారణంగా ఇప్పటికే జాతీయ జట్టుకు దూరమైన అతడు ఐపీఎల్ సహా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు కూడా అందుబాటులో ఉండట్లేదు. తాజాగా పంత్ ఈ ఏడాది జరగనున్న ఆసియా కప్, వన్డే ప్రపంచకప్‌కు కూడా దూరమవుతాడని తాజా నివేదికల సమాచారం.

ఈ ఏడాది సెప్టెంబరులో ఆసియా కప్ జరగనుంది. ఈ టోర్నీతో పాటు అక్టోబరు, నవంబరులో జరగనున్ వన్డే ప్రపంచకప్‌కు కూడా పంత్ దూరం కానున్నాడని తెలుస్తోంది. క్రీడా వర్గాల సమాచారం ప్రకారం పంత్ వీలైనంత వేగంగా కోలుకోడానికి ప్రయత్నిస్తున్నాడట. జనవరి కల్లా కమ్ బ్యాక్ ఇవ్వాలని అతడు భావిస్తున్నాడు. జనవరి అంటే అతడికి కారు ప్రమాదం జరిగి అప్పటికీ ఏడాది అవుతుంది.

తాజా రిపోర్టుల ప్రకారం రిషభ్ పంత్ ఎలాంటి సహాయం లేకుండా నడవడానికి కనీసం రెండు వారాల పడుతుందని తెలుస్తోంది. గతంలో పంత్ ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడిన బీసీసీఐ అతడి రికవరీ ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. ఈ క్లిష్ట సమయంలో అతడికి కావాల్సిన మద్దతును అందిస్తామని స్పష్టం చేసింది.

రిషభ్ ఈ జనవరిలో లిగమెంట్ సర్జరీ చేయించుకున్నాడు. ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్ అండ్ మెడికల్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో అతడికి సర్జరీ జరిగింది. ఈ సంస్థ హెడ్ డాక్టర్ దిన్షా పార్థివాలా ఆధ్వర్యంలో ఈ శస్త్రచికిత్స జరిగింది. తాజా నివేదిక ప్రకారం పంత్‌కు రెండో సర్జరీ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

జట్టుకు పంత్ దూరం కావడంతో టెస్టు క్రికెట్‌లో అతడి స్థానంలో కేఎస్ భరత్‌ను తీసుకుంది బీసీసీఐ. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌కు మాత్రం కేఎల్ రాహుల్ కీపర్‌గా వ్యవహరించాడు. రానున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌‍కు కూడా పంత్ దూరం కావడంతో కేఎస్ భరత్ ఒక్కడే ప్రొఫెషనల్ వికెట్ కీపర్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఇంగ్లాండ్‌లో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌కు మాత్రం కేఎల్ రాహుల్‌ను తీసుకునే అవకాశముంది.

WhatsApp channel

టాపిక్