Ponting on Risabh Pant: పంత్‌కు గొప్ప గౌరవం.. ఐపీఎల్లో అతడు లేకపోయినా అతని జెర్సీ నంబర్
Ponting on Risabh Pant: పంత్‌కు గొప్ప గౌరవం దక్కనుంది. ఐపీఎల్లో అతడు ఆడకపోయినా అతని జెర్సీ నంబర్ ను తాము ధరిస్తామని ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రిషబ్ పంత్ చెప్పడం విశేషం.
Ponting on Risabh Pant: స్టార్ వికెట్ కీపర్, తమ కెప్టెన్ అయిన రిషబ్ పంత్ ను ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ఎంతగా మిస్ అవుతుందో చెప్పడానికి ఇదో మంచి ఉదాహరణ. అదే సమయంలో అతనికి ఆ టీమ్ ఇస్తున్న గౌరవం కూడా ఆశ్చర్యపరుస్తుంది. తాజాగా ఢిల్లీ టీమ్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ చేసిన కామెంట్సే దీనికి నిదర్శనం.
గతేడాది డిసెంబర్ 30న కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్.. ఈ సీజన్ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ ప్రారంభమయ్యే సమయానికి అతడు ఆడకపోయినా కనీసం టీమ్ డగౌట్ లో తన పక్కన కూర్చోవాలని హెడ్ కోచ్ రికీ పాంటింగ్ చాలా ఆరాటపడ్డాడు. ఒకవేళ పంత్ అలా వస్తే సరే.. లేదంటే అతడు తమతోనే ఉన్నాడన్న నమ్మకం కుదిరేలా అతని నంబర్ ను తమ షర్ట్స్ లేదా క్యాప్ లపై వేసుకుంటామని పాంటింగ్ చెప్పడం గమనార్హం.
"ప్రతి మ్యాచ్ కు అతడు నా పక్కనే కూర్చోవాలని నేను భావిస్తున్నాను. కానీ ఒకవేళ అది కుదరకపోతే మాకు తోచిన మార్గాల్లో అతన్ని జట్టులో భాగం చేయాలని భావిస్తున్నాం. మా షర్ట్స్, క్యాప్ లపై అతని నంబర్ రాసుకుంటాం. అతడు మాతో లేకపోయినా.. మా లీడర్ మాత్రం అతడే అని చాటి చెప్పడానికే ఇదంతా" అని పాంటింగ్ అన్నాడు.
శుక్రవారం (మార్చి 24) జరిగిన ఢిల్లీ టీమ్ ఈవెంట్ లో పాల్గొన్న పాంటింగ్.. పంత్ పై ఈ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. పంత్ స్థానంలో వికెట్ కీపర్ ఎవరు అన్నదానిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని కూడా చెప్పాడు. "దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సర్ఫరాజ్ ఖాన్ టీమ్ తో చేరాడు. ప్రాక్టీస్ గేమ్స్ చూసిన తర్వాత దీనిపై తుది నిర్ణయం తీసుకుంటాం. ఇందులో రిషబ్ లేని లోటు పూడ్చలేం. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనతో పలు మార్గాలు మా ముందు ఉన్నాయి" అని పాంటింగ్ అన్నాడు.
పంత్ లేకపోవడంతో డేవిడ్ వార్నర్ ఈ సీజన్ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును లీడ్ చేయనున్నాడు. అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ గా ఉండనున్నాడు. గత సీజన్ లో క్యాపిటల్స్ తరఫున 432 పరుగులతో వార్నర్ టాప్ లో నిలిచాడు. 2022 మెగా వేలంలో ఢిల్లీ టీమ్ తో వార్నర్ చేరాడు. అతన్ని రూ.6.25 కోట్లకే ఢిల్లీ టీమ్ దక్కించుకుంది. ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్ ను ఏప్రిల్ 1న లక్నో సూపర్ జెయింట్స్ తో ఆడుతుంది.
సంబంధిత కథనం