David Warner as Delhi Captain: ఐపీఎల్‌లో డేవిడ్ వార్నర్ స్టార్‌డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్నప్పుడు తెలుగువారంతా తమవాడిలాగే ఓన్ చేసుకున్నారు. ఫ్రాంఛైజీని వీడుతున్నప్పుడు కూడా వద్దంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం వార్నర్ భాయ్ హైదరాబాద్ నుంచి వైదొలికి దిల్లీ క్యాపిటల్స్ తరఫున తన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. గత ఐపీఎల్‌లో దిల్లీ వైపు అద్భుత ప్రదర్శన చేశాడు. తాజా రిపోర్టుల ప్రకారం ఈ సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని తెలుస్తోంది.
దిల్లీ రెగ్యూలర్ కెప్టెన్ రిషబ్ పంత్ గత డిసెంబరులో కారు ప్రమాదంలో గాయపడటంతో అతడు ఈ ఐపీఎల్‌కు దూరం కానున్నాడు. దీంతో అతడి స్థానంలో వార్నర్‌కు దిల్లీ కెప్టెన్సీ పగ్గాలను అప్పజెప్పనున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా అక్షర్ పటేల్‌కు వైస్ కెప్టెన్‌గా బాధ్యతలను అప్పగించనున్నారని సమాచారం. ఈ విషయాన్ని దిల్లీ క్యాపిటల్ మేనేజ్మెంట్‌కు చెందిన ప్రతినిధి ఒకరు స్వయగా వెల్లడించారు. "ఈ ఐపీఎల్ 2023 సీజన్‌లో దిల్లీ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్ వ్యవహరిస్తారని, వైస్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్ ఉంటారని" ఆయన ఓ క్రీడా పోర్టల్‌కు తెలియజేశారు.
డేవిడ్ వార్నర్ గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. అతడి సారథ్యంలో హైదరాబాద్‌లో 2016లో ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకుంది. ఐపీఎల్ 2023లో దిల్లీ తన మొదటి మ్యాచ్‌ను లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ఏప్రిల్ 1న ఈ మ్యాచ్ జరగనుంది.
హైదరాబాద్ నుంచి వైదొలిగిన తర్వాత వార్నర్ దిల్లీ గూటికి చేరాడు. అతడు అంతకుముందు 2009 నుంచి 2013 వరకు దిల్లీ క్యాపిటల్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ వేలంలో దిల్లీ అతడిని రూ.6.25 కోట్లకు సొంతం చేసుకుంది. దీంతో గతేడాది తిరిగి ఆ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. గత సీజన్‌లో 12 మ్యాచ్‌ల్లో 48 సగటుతో అతడు 432 పరుగులు చేశాడు. ఇందులో 5 అర్ధశతకాలు ఉన్నాయి.
ప్రస్తుతం డేవిడ్ వార్నర్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తొలి రెండు టెస్టులకు ప్రాతినిధ్యం వహించాడు. అయితే గాయం కారణంగా తదుపరి రెండు టెస్టులకు దూరమయ్యాడు. దీంతో ఆస్ట్రేలియాకు తిరుగు ప్రయాణమయ్యాడు. విశ్రాంతి అనంతరం భారత్‌తో మూడు వన్డేల సిరీస్ కోసం తిరిగి వచ్చే అవకాశముంది. మార్చి 17 నుంచి ఈ వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇటీవల జరిగిన రెండు టెస్టుల్లోనూ వార్నర్ విఫలమయ్యాడు. ఆడిన మూడు ఇన్నింగ్స్‌ల్లో 1, 10, 15 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
సంబంధిత కథనం