Warner Ruled out: ఆస్ట్రేలియాకు మరో షాక్.. గాయంతో వార్నర్ దూరం
Warner Ruled out: ఆస్ట్రేలియా జట్టు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయం కారణంగా తదుపరి రెండు టెస్టులకు అందుబాటులో ఉండట్లేదు. ఈ మేరకు అతడు స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యాడు.
Warner Ruled out: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియాకు మరో దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్వదేశానికి తిరిగి వెళ్లనున్నాడు. హెయిర్ లైన్ గాయం కారణంగా అతడు తదుపరి జరగనున్న రెండు టెస్టులకు దూరం కానున్నాడు. ఇప్పటికే భారత్ 2-0 తేడాతో ఆధిక్యంలో ఉన్న నేపథ్యంలో తాజాగా డేవిడ్ వార్నర్ దూరం కావడం ఆసీస్‌కు గట్టి దెబ్బ తగిలినట్లయింది.
దిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టులో 36 ఏళ్ల వార్నర్‌కు నిమిషాల వ్యవధిలోనే రెండు గాయాలయ్యాయి. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో బంతి వార్నర్ మోచేతికి తాకింది. ఫలితంగా కాంకషన్‌గా మ్యాథ్యూ రెన్షా అతడి స్థానంలో ఆడాడు. తాజాగా గాయం నుంచి కోలుకోకపోవడంతో వార్నర్ మిగిలిన రెండు టెస్టులకు దూరం కానున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటనలో పేర్కొంది.
"డేవిడ్ వార్నర్ భారత్‌లో టెస్టు పర్యటనకు దూరమయ్యాడు. అతడు స్వదేశానికి తిరిగి వస్తాడు. దిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టులో అతడి మోచేతికి దెబ్బ తగిలి హెయిర్ లైన్ ప్రాక్చరైంది." అని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటనలో తెలిపింది. అయితే మార్చి 17 నుంచి 22 వరకు జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు వార్నర్ తిరిగి వస్తాడని స్పష్టం చేసింది.
దిల్లీలో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని నిలబెట్టుకుంది. మూడో టెస్టు మార్చి 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ టెస్టుకు వార్నర్ స్థానంలో ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ చేశాడు. ఒకవేళ డేవిడ్ వార్నర్ అందుబాటులో లేకపోతే ఇండోర్ టెస్టులోనూ ట్రావిస్ హెడ్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నట్లు ఆసీస్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ తెలిపారు.