Ponting request for Pant: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ గతేడాది డిసెంబర్ 30న కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలుసు కదా. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్ కు ఇప్పటికే రెండు సర్జరీలు జరిగాయి. అతడు మళ్లీ క్రికెట్ ఆడటానికి కనీసం ఆరు నెలల సమయం పడుతుందని డాక్టర్లు కూడా స్పష్టం చేశారు.,దీంతో పంత్ ఐపీఎల్ కు దూరం కానున్నాడు. అయితే లీగ్ లో అతడు ఆడే టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ మాత్రం పంత్ కు ఓ రిక్వెస్ట్ పంపించాడు. అతడు ఆడే పరిస్థితుల్లో లేకపోయినా సరే.. తనతో పాటు డగౌట్ లో కూర్చోవాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పాడు.,"అలాంటి వ్యక్తులను భర్తీ చేయలేం. అంతే. అలాంటి ప్లేయర్స్ చెట్లపై పెరగరు. టీమ్ లో పంత్ స్థానంలో వచ్చే వికెట్ కీపర్ బ్యాటర్ కోసం మేము వెతకాలి. అతను ఆడటానికి ఫిట్ గా లేకపోయినా కూడా పంత్ మాతో ఉండాలని కోరుకుంటున్నాం. పంత్ ఓ కెప్టెన్ గానే కాదు.. అందరికీ వ్యాపించే అతని నవ్వు మాకు బాగా నచ్చుతుంది. ,ఒకవేళ అతడు ప్రయాణాలకు సిద్ధంగా ఉంటే, టీమ్ తో పాటు రాగలిగితే.. అతడు నాతోపాటు డగౌట్ లో కూర్చోవాలని కోరుకుంటున్నాను. మార్చి నెలలో మేము క్యాంప్ ఏర్పాటు చేయబోతున్నాం. అప్పటిలోగా అతడు రాగలిగితే టీమ్ తోపాటు ఉండాల్సిందిగా కోరుకుంటున్నా" అని పాంటింగ్ అన్నాడు.,డిసెంబర్ 30న పంత్ ఢిల్లీ నుంచి రూర్కీ వెళ్తుండగా కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడు ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. త్వరలోనే అతన్ని డిశ్చార్జ్ చేయనున్నారు. పంత్ తో తాను మాట్లాడానని, త్వరలోనే అతడు తిరిగి ఫీల్డ్ లోకి వస్తాడన్న ఆశాభావం పాంటింగ్ వ్యక్తం చేశాడు.,"పంత్ అంటే నాకు చాలా ఇష్టం. అతనితో ఫోన్ లో మాట్లాడినప్పుడు కూడా ఇదే విషయం చెప్పాను. అది చాలా భయంకరమైన సమయం. అతనికే కాదు అందరికీ. అతని గురించి తెలిసిన ఎవరైనా పంత్ ను ఇష్టపడతారు. ప్రస్తుతానికి పంత్ త్వరగా కోలుకోవాలని, మళ్లీ క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నాను" అని పాంటింగ్ అన్నాడు.,