Rahane Selection: రహానే ఎంపికకు కారణం ఐపీఎల్ కాదట.. అసలు కారణం ఇదీ-rahane selection to team indian not because of ipl but for this reason ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rahane Selection: రహానే ఎంపికకు కారణం ఐపీఎల్ కాదట.. అసలు కారణం ఇదీ

Rahane Selection: రహానే ఎంపికకు కారణం ఐపీఎల్ కాదట.. అసలు కారణం ఇదీ

Hari Prasad S HT Telugu
Apr 25, 2023 04:29 PM IST

Rahane Selection: రహానే ఎంపికకు కారణం ఐపీఎల్ కాదట. సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు ఎలా ఉన్నా.. నేషనల్ టీమ్ సెలక్టర్ల ఆలోచన మాత్రం మరోలా ఉన్నట్లు కాస్త విశ్లేషిస్తే అర్థమవుతుంది.

అజింక్య రహానే
అజింక్య రహానే (PTI)

Rahane Selection: ప్రస్తుతం నడుస్తున్న ఐపీఎల్లో అజింక్య రహానే 2.0ని చూసే అవకాశం అభిమానులకు దక్కుతోంది. ఒంటిపైకి ఎల్లో జెర్సీ వచ్చిందో లేదో అతడు చెలరేగిపోతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన ఐదు మ్యాచ్ లలో అతడు ఏకంగా 200 స్ట్రైక్ రేట్ తో పరుగులు చేశాడు. ఇది చూసి రహానే ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులోకి రావడం ఖాయమన్న అంచనాలు ముందే వచ్చాయి.

అందుకు తగినట్లే సెలక్టర్లు అతనికి డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడబోయే టీమిండియాలో చోటు కల్పించారు. అయితే దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఐపీఎల్లో ఐదు మ్యాచ్ లలో మెరుపులు మెరిపించినంత మాత్రాన రహానేకు టెస్టు జట్టులో.. అది కూడా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే జట్టులో ఎలా చోటు కల్పిస్తారు? ఇలా అయితే రంజీ ట్రోఫీకి అసలు విలువే లేదు అన్నట్లుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.

నిజానికి ఆ విమర్శల్లోనూ నిజం లేకపోలేదు. ఐపీఎల్ కు ముందు రహానే రంజీ ట్రోఫీలో రెండు సెంచరీలు చేశాడు. హైదరాబాద్ పై ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది. కానీ ఆ రెండు తప్పించి మిగతా మ్యాచ్ లలో రహానే స్కోర్లు చూస్తే 2, 51, 42, 11, 44, 14, 35, 24, 16గా ఉన్నాయి. ఈ స్కోర్లు అతనికి సుమారు మూడేళ్ల తర్వాత ఇండియన్ టెస్టు జట్టులో చోటు కల్పించే అవకాశమే లేదు.

మరి రహానే ఎంపిక ఎందుకు?

రహానే కంటే రంజీ ట్రోఫీ రాణించిన సర్ఫరాజ్ ఖాన్, మయాంక్ అగర్వాల్ బెస్ట్ అన్న వాదనలు ఉన్నాయి. కానీ సెలక్టర్ల ఆలోచన మాత్రం మరోలా ఉంది. కీలకమైన ఆటగాళ్లు గాయాల కారణంగా డబ్ల్యూటీసీ ఫైనల్ కు దూరమయ్యారు. రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ లాంటి వాళ్లు లేరు. దీంతో మిడిలార్డర్ బలహీనమైపోయింది. ఈ నేపథ్యంలో ఓ అనుభవజ్ఞుడైన ప్లేయర్ కోసం చూసిన సెలక్టర్లకు రహానే కనిపించాడు.

ముఖ్యంగా ఈ ఫైనల్ ఇంగ్లండ్ లో జరుగుతుండటంతో అక్కడ కమిన్స్, హేజిల్‌వుడ్, స్టార్క్ లాంటి సీనియర్ ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కొనేందుకు సమర్థుడైన సీనియర్ బ్యాటర్ అవసరం. బంతి స్వింగ్ అయ్యే పరిస్థితుల్లో మయాంక్ లేదా సర్ఫరాజ్ లాంటి వాళ్లపై ఆధారపడటం కష్టమే అన్నది సెలక్టర్ల ఆలోచనగా కనిపిస్తోంది. అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ లాంటి ఆల్ రౌండర్లు ఉన్నా.. వాళ్లు ఇండియా కండిషన్స్ లో అయితే మెరుగ్గా రాణించగలరు.

ఇంగ్లండ్ కండిషన్స్ లో మిడిలార్డర్ లో రహానేలాంటి సీనియర్ అవసరాన్ని సెలక్టర్లు గమనించారు. అందుకే రహానేతోపాటు కేఎల్ రాహుల్ ను కూడా స్పెషలిస్టు వికెట్ కీపర్ గా తుది జట్టులోకి తీసుకునే అవకాశం కూడా ఉంది. కేఎస్ భరత్ తనకు వచ్చిన అవకాశాన్ని సరిగా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 82 టెస్టులు ఆడిన అనుభవం ఉన్న రహానే.. ఇంగ్లండ్ లో ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటాడన్న నమ్మకం సెలక్టర్లకు ఉంది.

ఇదంతా చూస్తుంటే రహానే ఎంపిక కేవలం డబ్ల్యూటీసీ ఫైనల్ వరకే కనిపిస్తున్నా.. ఆ మ్యాచ్ ను అతడు ఎలా సద్వినియోగం చేసుకుంటాడన్నదాన్ని బట్టి మళ్లీ టెస్టు టీమ్ లో రహానే రెగ్యులర్ మెంబర్ అవుతాడా లేదా అన్నది ఆధారపడి ఉంటుంది.

WhatsApp channel

సంబంధిత కథనం