BCCI selector on Sarfaraz Khan: ఇండియన్ క్రికెట్ టీమ్ లోకి ఎంపిక కావాలన్నది ప్రతి క్రికెటర్ కల. దానికోసం డొమెస్టిక్ క్రికెట్ లో పరుగుల వరద పారించడమో, వికెట్ల మీద వికెట్లు తీయడమో చేయాలి. ప్రస్తుతం టీమిండియాలోకి రావడానికి ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అదే చేస్తున్నాడు. గత రెండు, మూడేళ్లుగా పరుగుల వరద పారిస్తున్నాడు.
అయినా సెలక్టర్లు అతన్ని కరుణించడం లేదు. ఆస్ట్రేలియా సిరీస్ కోసం తనను ఎంపిక చేయకపోవడంపై అతడు పబ్లిగ్గానే విమర్శలు చేశాడు. మాజీ క్రికెటర్లు కూడా సర్ఫరాజ్ ను విస్మరించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే దీనిపై తాజాగా నేషనల్ సెలక్టర్లలో ఒకడైన శ్రీధరన్ శరత్ స్పందించాడు. సర్ఫరాజ్ ను ఎందుకు ఎంపిక చేయలేదో వివరించే ప్రయత్నం చేశాడు.
"అతడు కచ్చితంగా మా దృష్టిలో ఉన్నాడు. సరైన సమయంలో అతనికి జట్టులో అవకాశం దక్కుతుంది. అయితే ఓ జట్టును ఎంపిక చేసే సమయంలో మేము కూర్పు, సమతుల్యతలాంటి వాటిని దృష్టిలో ఉంచుకోవాల్సి వస్తుంది" అని శ్రీధరన్ శరత్ చెప్పాడు. అంతేకాదు సర్ఫరాజ్ కంటే ముందు సూర్యకుమార్ ను ఎందుకు ఎంపిక చేయాల్సి వచ్చిందో కూడా వివరించాడు.
"సూర్యకుమార్ యాదవ్ కూడా ప్రత్యర్థి నుంచి చాలా వేగంగా మ్యాచ్ ను దూరం చేయగలడు. బౌలర్లను దెబ్బ తీయడానికి అతని దగ్గర చాలా షాట్లు ఉన్నాయి. అంతేకాదు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అతడు 5 వేలకుపైగా పరుగులు చేశాడన్న విషయం మరచిపోవద్దు" అని శరత్ చెప్పాడు.
మరోవైపు సర్ఫరాజ్ ఖాన్ ప్రస్తుత రంజీ సీజన్లో ముంబై తరఫున ఇప్పటికే మూడు సెంచరీలు బాదాడు. హైదరాబాద్, తమిళనాడు, ఢిల్లీలతో జరిగిన మ్యాచ్ లలో సర్ఫరాజ్ సెంచరీలు చేశాడు. సర్ఫరాజ్ మిడిలార్డర్ బ్యాటర్ కావడం కూడా అతనికి ఇండియన్ టీమ్ లో చోటు దక్కకుండా చేస్తోంది.
ఎందుకంటే ప్రస్తుతం టెస్టుల్లో ఇండియా మిడిలార్డర్ బలంగా ఉంది. చెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, ఆ తర్వాత వికెట్ కీపర్ బ్యాటర్ వస్తారు. అయితే ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ గాయపడటంతో ఆస్ట్రేలియా సిరీస్ కు అతడు అందుబాటులో లేకపోతే సూర్యకుమార్ టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంటుంది.
సంబంధిత కథనం