Ashish Nehra on Suryakumar: టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. గతేడాది టీ20ల్లో అదరగొట్టిన ఈ స్టార్.. అదే ఫామ్‌ను ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నాడు. ఈ నెలలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో సెంచరీతో రెచ్చిపోయిన సూర్య.. శుక్రవారం నుంచి న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20లోనూ అదరగొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు. అంతేకాకుండా ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గానూ నిలవడంతో అతడిపై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా సూర్యకుమార్ యాదవ్‌పై టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా కూడా స్పందించాడు. అతడు అన్ని ఫార్మాట్లలోనూ ఆకట్టుకుంటాడని స్పష్టం చేశాడు.,"అతడు(సూర్యకుమార్ యాదవ్) అన్ని ఫార్మాట్లలోనూ ఆకట్టుకుంటాడని అనుకుంటున్నా. అతడి ఆ సామర్థ్యముంది. అతడు కొన్ని వన్డేలే ఆడాడు. అయితే ఇదే స్థాయిలో నిరంతరం మంచి ప్రదర్శన చేయగలిగితే.. తుది జట్టులో తప్పకుండా స్థానాన్ని పదిలం చేసుకోగలుగుతాడు" అని నెహ్రా స్పష్టం చేశాడు. మిగిలిన వాళ్లు పుంజుకోకపోతే కచ్చితంగా సూర్యకుమారే వారి స్థానాన్ని ఆక్రమిస్తాడని అన్నాడు.,"ఆటగాళ్లు తమ పరిమితులను మించి ఆడాలి. మంచి ప్రదర్శనలు చేయాలి. ఒకవేళ మెరుగ్గా రాణించకపోయినట్లయితే సూర్యకుమార్ వారి స్థానాన్ని ఆక్రమిస్తాడు. అతడు ఈ స్థాయిలో ఆడటం నాకు ఎలాంటి ఆశ్చర్యాన్ని కలిగించలేదు. ఎందుకంటే గత రెండు, మూడేళ్లుగా అతడు నిలకడగా రాణిస్తున్నాడు. ఇదే నిలకడను, స్థిరత్వాన్ని ఇకపైనా కొనసాగిస్తాడని ఆశిస్తున్నా. అతడి స్ట్రైక్ రైట్ అద్భుతం" అని నెహ్రా తెలిపాడు.,ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ కెరీర్ ఉన్నత దశలో ఉన్నాడని, అతడి ఆత్మవిశ్వాసం అద్భుతమని కొనియాడాడు. టీ20 క్రికెట్‌లో అద్భుతంగా ఆడుతున్నాడని, చాలా మంది బిగ్ హిట్టర్ల సైతం అతడి కంటే వెనుకంజలోనే ఉన్నాడని నెహ్రా స్పష్టం చేశాడు.,