Raina on Suryakumar: సూర్యకుమార్ లేకుంటే మూడు ఫార్మాట్లూ ఉండవు: సురేశ్ రైనా
Raina on Suryakumar: సూర్యకుమార్ లేకుంటే మూడు ఫార్మాట్లూ ఉండవని అన్నాడు మాజీ క్రికెటర్ సురేశ్ రైనా. టెస్టుల్లోనూ అతనికి అవకాశం ఇవ్వాలని, ఎన్నో సెంచరీలు బాదగలడని రైనా అభిప్రాయపడ్డాడు.
Raina on Suryakumar: ఏడాది కాలంగా ఇండియన్ క్రికెట్ లో మార్మోగుతున్న పేరు సూర్యకుమార్ యాదవ్. ప్రస్తుతానికి టీ20 ఫార్మాట్ లో అతనికి తిరుగు లేకపోయినా.. వన్డే క్రికెట్ లో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నాడు. ఇక వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరగబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం టెస్టు టీమ్ లోనూ సూర్యకుమార్ కు చోటు దక్కింది.
అయితే టాప్ ఫామ్ లో ఉన్న సర్ఫరాజ్ ఖాన్ బదులు సూర్యకు చోటివ్వడమేంటన్న విమర్శలు కూడా వచ్చాయి. గతేడాది టీ20ల్లో వెయ్యికిపైగా రన్స్ చేసినా.. టెస్టుల్లో అతడు ఏ మేరకు రాణిస్తాడన్న సందేహాలు ఉన్నాయి. అయితే సూర్య టెస్టుల్లోనూ రాణిస్తాడని అన్నాడు మాజీ క్రికెటర్ సురేశ్ రైనా. అంతేకాదు అసలు అతడు లేకపోతే మూడు ఫార్మాట్లూ ఉండవని అనడం గమనార్హం.
"కచ్చితంగా, అతడు ఆడుతున్న తీరు చూస్తుంటే.. అతడు మూడు ఫార్మాట్లలోనూ ఉండాల్సిందేనని నేను భావిస్తున్నాను. అతడు లేకపోతే మూడు ఫార్మాట్లూ ఉండవు. అతని ఆటతీరు, అతని సంకల్పం, వివిధ షాట్లు ఆడే తీరుతోపాటు భయం లేకుండా ఆడతాడు. గ్రౌండ్ కొలతలను తనకు తగినట్లుగా మార్చుకోగలడు" అని రైనా అన్నాడు.
"అతడు ముంబై ప్లేయర్. రెడ్ బాల్ క్రికెట్ ఎలా ఆడాలో అతనికి తెలుసు. అతనికిది గొప్ప అవకాశం. టెస్టు క్రికెట్ ఆడటం వల్ల వన్డే టీమ్ లోనూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోగలడు. తర్వాత ఎన్నో సెంచరీలు, డబుల్ సెంచరీలు చేయగలడు" అని రైనా అన్నాడు. ఇక ఇదే చర్చలో పాల్గొన్న మరో మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా కూడా రైనా వ్యాఖ్యలతో ఏకీభవించాడు.
"కచ్చితంగా అతడు టెస్టు టీమ్ లో ఉండాలి. సూర్య ఆడిన తీరు చూస్తే అతడు మూడు ఫార్మాట్లలోనూ ఉండాలి. ఈ ప్రశ్న ఎందుకు వస్తుందో నాకు తెలుసు. సర్ఫరాజ్ ఖాన్ ఆడుతున్న తీరు చూస్తే అదే అనిపిస్తుంది. కానీ అతనికి కూడా టైమ్ వస్తుంది. కానీ సూర్య టెస్టు టీమ్ లో ఉండటానికి 100 శాతం అర్హుడు" అని ఓజా స్పష్టం చేశాడు.
సంబంధిత కథనం