Rishabh Pant: పంత్ వచ్చేశాడు.. ఢిల్లీ, గుజరాత్ మ్యాచ్ చూసిన స్టార్ ప్లేయర్
Rishabh Pant: పంత్ వచ్చేశాడు.. ఢిల్లీ, గుజరాత్ మ్యాచ్ చూశాడు ఈ స్టార్ ప్లేయర్. ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగడంతో ఢిల్లీ టీమ్ కోరిక మేరకు అతడు స్టేడియానికి వచ్చాడు.

Rishabh Pant: టీమిండియా, ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కారు ప్రమాదం తర్వాత తొలిసారి పబ్లిక్ అప్పియరెన్స్ ఇచ్చాడు. అతడు ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటన్స్ మధ్య మంగళవారం (ఏప్రిల్ 4) జరిగిన మ్యాచ్ చూశాడు. పంత్ వస్తున్నాడని ముందే తెలియడంతో అతని కోసం డీడీసీఏ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పంత్ ఇంకా ఊతకర్ర సాయంతోనే నడుస్తున్నాడు.
దీంతో అతని కోసం ప్రత్యేకంగా ర్యాంప్ ఏర్పాటు చేశారు. పంత్ ను అతని కారు దగ్గరికి వెళ్లి మరీ డీడీసీఏ అధికారులు స్వాగతం పలికారు. అతన్ని స్టాండ్స్ లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టారు. పంత్ ను చూడగానే స్టేడియం అంతా మార్మోగిపోయింది. ఫ్యాన్స్ కు అతడు అభివాదం చేశాడు. కెమెరాలు తరచూ పంత్ ను చూపించాయి. అతడు బిగ్ స్క్రీన్ పై కనిపించినప్పుడల్లా ఫ్యాన్స్ కేరింతలు కొట్టారు.
గతేడాది డిసెంబర్ 30న కారు ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అతనికి రెండు సర్జరీలు జరిగాయి. ఆ గాయాల నుంచి అతడు మెల్లగా కోలుకుంటున్నాడు. తరచూ సోషల్ మీడియా ద్వారా తన హెల్త్ పై అప్‌డేట్ ఇస్తున్నాడు. ఊతకర్ర సాయంతో తాను నడుస్తున్న ఫొటోతోపాటు స్విమ్మింగ్ పూల్ లోనూ నడుస్తున్న వీడియోను షేర్ చేసుకున్నాడు.
అయితే ఆ ప్రమాదం తర్వాత తొలిసారి ఇలా అభిమానుల ముందుకు అతడు వచ్చాడు. అతడు ఆడకపోయినా సరే పంత్ డగౌట్ లోకి వచ్చి తమతోపాటు కూర్చుంటే చాలు అని లీగ్ ప్రారంభానికి ముందు కోచ్ పాంటింగ్ అనేవాడు. ఇప్పుడు సొంతగడ్డపై మ్యాచ్ జరుగుతుండటంతో పంత్ నేరుగా స్టేడియానికి వచ్చాడు. అతడు త్వరగా కోలుకోవాలంటూ ఢిల్లీ టీమ్ సభ్యులు చెప్పిన విషెస్ వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్ తమ ట్విటర్ అకౌంట్లో షేర్ చేసింది.
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 రన్స్ చేసింది. డేవిడ్ వార్నర్ 37, అక్షర్ పటేల్ 36, సర్ఫరాజ్ ఖాన్ 30 పరుగులు చేశారు.
సంబంధిత కథనం