Australia Squad For WTC: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. వార్నర్ పునరాగమనం
Australia Squad For WTC: జూన్ 7 నుంచి భారత్‌తో జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. అంతేకాకుండా ఆ తర్వాత జరగనున్న యాషెస్ సిరీస్ తొలి రెండు టెస్టులకు కూడా స్క్వాడ్‌ను ప్రకటించింది.
Australia Squad For WTC: ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ రోజు రోజుకు ఆసక్తికరంగా జరుగుతున్నాయి. ఉత్కంఠ కలిగించే థ్రిల్లింగ్ మ్యాచ్‌లతో అభిమానులు అసలు, సిసలైన క్రికెట్ మజాను ఆస్వాదిస్తున్నారు ఓ పక్క ఐపీఎల్ రంజుగా సాగుతున్న తరుణంలో.. ఈ టోర్నీ తర్వాత భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌పై కూడా ఆసక్తి నెలకొంది. తాజాగా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఈ మెగా టెస్టు టోర్నీ కోసం తమ జట్టును ప్రకటించింది. ఈ మ్యాచ్‌కు ఆసీస్ సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు అవకాశం కల్పించింది. అంతేకాకుండా ఇంగ్లాండ్‌తో జరగనున్న యాషెస్ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌లకు కూడా 15 మంది సభ్యుల కలిగిన జట్టును ప్రకటించింది.
టెస్టు ఫార్మాట్‌లో చాలా కాలం నుంచి నిలకడగా రాణిస్తున్న 36 ఏళ్ల వార్నర్.. ఇటీవల భారత్‍తో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో గాయపడ్డాడు. దీంతో జట్టుకు దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకున్న అతడు.. ప్రస్తుతం ఐపీఎల్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. దీంతో తిరిగి జట్టులోకి తీసుకుంది ఆసీస్. వార్నర్‌తో పాటు మరో ఇద్దరిని ఓపెనర్లుగా ఎంపిక చేసింది. మార్కస్ హ్యారిస్, మ్యాట్ రెన్షాను తీసుకుంది. వీరితో పాటు రెగ్యూలర్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా కూడా ఇందులో ఉన్నారు. ఫలితంగా మొత్తం 17 మంది సభ్యులతో జట్టును ప్రకటించింది. మే 28న ఈ జట్టు నుంచి 15 మందిని తుది పోరుకు ఎంపిక చేస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టం చేసింది.
వార్నర్ కాకుండా మిచెల్ మార్ తిరిగి జట్టులోకి అవకాశం దక్కించుకున్నాడు. 2019 తర్వాత అతడు టెస్టు జట్టులోకి రావడం ఇదే తొలిసారి. ఇతడితో పాటు కేమరూన్ గ్రీన్, టాడ్ మర్ఫీ తదితరులు యాథవిధిగా జట్టులో కొనసాగనున్నారు. భారత్‌తో టెస్టు సిరీస్ సమయంలో గాయపడిన ప్యాట్ కమిన్స్ తిరిగి కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోనున్నాడు. బౌలింగ్ విషయానికొస్తే ఆసీస్ పేస్ త్రయం మిషెల్ స్టార్క్, జోష్ హేజిల్‌నవుడ్, స్కాట్ బోలాండ్ ఉన్నారు.
ఇదిలా ఉంటే భారత్‌తో సిరీస్‌లో సత్తా చాటిన స్పిన్నర్లు ఆష్టన్ అగర్, పీటర్ హ్యాండ్స్‌కంబ్, మిచెల్ స్వెప్‌సన్, మ్యాట్ కుహ్నేమన్‌ను జట్టులోకి తీసుకోలేదు. అలాగే పేస్ బౌలర్ ల్యాన్స్ మోరిస్ కూడా గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. జూన్ 7న ఆస్ట్రేలియా-భారత్ మధ్య లండన ఓవల్ వేదికగా వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ జరగనుంది. జూన్ 16 నుంచి ఇంగ్లాండ్‌తో ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్ ఆడనుంది.
టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఎంపికైన ఆస్ట్రేలియా జట్టు..
ప్యాట్ కమిన్స్(కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కేరీ, కేమరూన్ గ్రీన్, మార్కస్ హ్యారీ, జోష్ హేజిల్ వుడ్, ట్రేవిస్ హెడ్, జోష్ ఇంగ్లీస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లయన్, మిచెల్ మార్ష్, టాడ్ మర్ఫీ, మ్యాథ్యూ రెన్షా. స్టీవెన్ స్మిత్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్.