Arjun Tendulkar First IPL Wicket: ఐపీఎల్‌లో జూనియర్ బోణీ.. రోహిత్ శర్మ ఫుల్ ఖుషీ.. వీడియో వైరల్-tendulkar takes 1st ipl wicket in tense last over against sunrisers hyderabd ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Arjun Tendulkar First Ipl Wicket: ఐపీఎల్‌లో జూనియర్ బోణీ.. రోహిత్ శర్మ ఫుల్ ఖుషీ.. వీడియో వైరల్

Arjun Tendulkar First IPL Wicket: ఐపీఎల్‌లో జూనియర్ బోణీ.. రోహిత్ శర్మ ఫుల్ ఖుషీ.. వీడియో వైరల్

Maragani Govardhan HT Telugu
Apr 19, 2023 06:31 AM IST

Arjun Tendulkar First IPL Wicket: ఐపీఎల్‌లో అర్జున్ తెందూల్కర్ తన తొలి వికెట్ తీశాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భువనేశ్వర్‌ కుమార్‌ను ఔట్ చేసి తన తొలి వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ ఆనందంలో మునిగిపోయాడు. ప్రస్తుతం వీడియో వైరల్ అవుతోంది.

అర్జున్ తెందూల్కర్
అర్జున్ తెందూల్కర్ (AFP)

Arjun Tendulkar First IPL Wicket: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ తనయుడిగా క్రికెట్‌‌ను ఎంచుకున్న అర్జున్ తెందూల్కర్‌కు ఐపీఎల్‌లో పిలుపు కోసం చాలా రోజులుగా ఎదురుచూశాడు. ముంబయి ఇండియన్స్ వేలంలో అతడిని కొనుగోలు చేసినప్పటికీ అతడికి తుది జట్టులో మాత్రం అవకాశం రాలేదు. దాదాపు రెండేళ్ల నిరీక్షణ తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఇటీవల జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. అయితే ఆ మ్యాచ్‌లో అతడు వికెట్లేమి తీయలేదు. కానీ తన రెండో మ్యాచ్‌లో మాత్రం తక్కువ పరుగులను సమర్పించడమే కాకుండా ఐపీఎల్‌లో తన మొదటి వికెట్‌ను తీశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్‌ను ఔట్ చేసి ఈ టోర్నీలో తన తొలి వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు.

193 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ విజయానికి చివరి ఓవర్‌లో 20 పరుగులు అవసరం కాగా.. అర్జున్ తెందూల్కర్‌కు బంతిని ఇచ్చాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఆ ఓవర్లో కేవలం 4 పరుగులే ఇచ్చిన అర్జున్.. ఓ వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అద్భుతమైన యార్కర్ లెంగ్త్ డెలీవరీని సంధించగా.. హైదరాబాద్ బ్యాటర్ భువి కవర్‌లో ఆడాడు. అక్కడే ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ ఆ క్యాచ్‌ను ఒడిసి పట్టాడు. దీంతో అర్జున్ తొలి వికెట్ కల నెరవేరింది. అర్జున్ వికెట్ తీయగానే.. కెప్టెన్ రోహిత్ శర్మ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై పోయాడు. అర్జున్‌ను అభినందిస్తూ స్టేడియంలో కేరింతలు కొట్టాడు. ఈ భువి ఔట్‌తో ముంబయి 14 పరుగుల తేడాతో విజయం సాధించింది.

అంతకుముందు రెండు ఓవర్లలోనూ అద్భుతంగా బౌలింగ్ చేశాడు ఈ జూనియర్ తెందూల్కర్. సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేసి బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 2.5 ఓవర్లు బౌలింగ్ చేసిన 18 పరుగులు మాత్రమే ఇవ్వడమే కాకుండా ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అతడి ఎకానమీ రేటు కూడా 6.40 కావడం గమనార్హం.

మ్యాచ్ అనంతరం మాట్లాడిన అర్జున్.. "ఐపీఎల్‌లో తొలి వికెట్ తీయడం ఆనందంగా ఉంది. నా చేతిలో ఏముందో దానిపైనే ఫోకస్ పెట్టాను. ప్లాన్ చేసి చక్కగా అమలు చేశాను. వైడ్ బౌలింగ్ చేసి బ్యాటర్ లాంగ్ బౌండరీని ఆడేలా చేయడమే మా ప్లాన్. నాకు బౌలింగ్ చేయడం చాలా ఇష్టం. కెప్టెన్ అడిగినప్పుడల్లా బౌలింగ్ చేయడం ఆనందంగా ఉంది. జట్టు ప్రణాళికకు కట్టుబడి నా బెస్ట్ ఇస్తాను. అని" అన్నాడు.

తన తండ్రి సచిన్‌ ఇచ్చిన సలహాలను అర్జున్ గుర్తు చేసుకున్నాడు. "మేము క్రికెట్ గురించి చాలా విషయాలు మాట్లాడుకుంటాము. మ్యాచ్‌కు ముందు వ్యూహాలను చర్చించుకుంటాము. ప్రతి గేమ్ ముందు ప్రాక్టీస్ చేయమని ఆయన నాకు చెబుతారు. అలాగే నేను నా డెలీవరిపై దృష్టిపెట్టాను. మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేశాను." అని అర్జున్ చెప్పాడు.

ఈ మ్యాచ్‍‌‌లో హైదరాబాద్‌పై ముంబయి 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. 193 పరుగుల లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ 178 పరుగులకు ఆలౌటైంది. చివరి ఓవర్లో విజయానికి 20 పరుగులు అవసరం కాగా.. బౌలింగ్ చేసిన అర్జున్ తెందూల్కర్ కేవలం 4 పరుగులే ఇచ్చి ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. గత మ్యాచ్ హీరో హ్యారీ బ్రూక్(9), కెప్టెన్ మార్క్‌క్రమ్(22) తక్కువ పరుగులకే ఔట్ కావడంతో మ్యాచ్‌ను కోల్పోయింది హైదరాబాద్. ఈ మ్యాచ్‌లో ముంబయి బౌలర్లు పియూష్ చావ్లా, రిలే మెరెడెత్, జేసన్ బెహ్రెండార్ఫ్ తలో 2 వికెట్లు తమ ఖాతాలో వేసుకుకోగా,.. అర్జున్ తెందూల్కర్, కెమరూన్ గ్రీన్ చెరో వికెట్ తీశారు. దీంతో వరుసగా మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ముంబయి.

WhatsApp channel