LSG vs RCB: 127 కొట్టలేక చేతులెత్తేశారు - లక్నోపై బెంగళూరు అద్భుత విజయం
LSG vs RCB: సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో లక్నోపై బెంగళూరు అద్భుత విజయాన్ని అందుకున్నది. బెంగళూరు విధించిన 127 పరుగుల టార్గెట్‌ను ఛేదించడంలో విఫలమైన లక్నో 108 రన్స్‌కే ఆలౌటైంది.
LSG vs RCB: లక్నో సూపర్ జెయింట్స్ టార్గెట్ 127 రన్స్...కైల్ మేయర్స్, పూరన్, స్టోయినిస్ లాంటి హిట్టర్లతో నిండిన లక్నో పది ఓవర్లలోనే ఈ లక్ష్యాన్ని ఛేదిస్తుందని ఐపీఎల్ ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ అనుకున్నది ఒక్కటి అయ్యింది ఒక్కటి. స్వల్ప టార్గెట్‌ను ఛేదించలేక లక్నో చతికిలా పడింది. 18 రన్స్ తేడాతో ఓటమి పాలైంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు ఇరవై ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 126 రన్స్ చేసింది. డుప్లెసిస్ (40 బాల్స్‌లో 41 రన్స్), కోహ్లి (Virat Kohli) (30 బాల్స్‌లో 31) టాప్ స్కోరర్లుగా నిలిచారు. వీరిద్దరు తొలి వికెటకు 62 పరుగులు జోడిస్తే మిగిలిన బ్యాట్స్‌మెన్స్ అందరూ కలిసి 62 రన్స్ చేశారు. దాంతో లక్నో ముందు బెంగళూరు స్వల్ప టార్గెట్‌ను ఉంచింది.
లక్నో బౌలర్లలో నవీన్ 3, అమిత్ మిశ్రా, రవి బిష్ణోయ్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. 127 పరుగులు టార్గెట్‌తో సెకండ్ బ్యాటింగ్ చేపట్టిన లక్నో 108 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇన్నింగ్స్ ఆరంభమైన రెండో బంతికే కైల్ మేయర్స్ వికెట్‌తో లక్నో పతనం ఆరంభమైంది.
66 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టెయిలెండర్లు కృష్ణప్ప గౌతమ్ (23 రన్స్), అమిత్ మిశ్రా (19), నవీన్ (13) రన్స్ చేయడంతో లక్నో స్కోరు వంద దాటింది. బెంగళూరు బౌలర్లలో హేజిల్‌వుడ్, కర్ణ్ శర్మ తలో రెండు వికెట్లు దక్కించుకున్నారు.