Phalguna masam pariharalu: ఫాల్గుణ మాసంలో మీ రాశి ప్రకారం ఈ పరిహారాలు పాటిస్తే అంతా శుభమే జరుగుతుంది
05 March 2024, 12:46 IST
- Phalguna masam pariharalu: ఫాల్గుణ మాసం దానధర్మాలకు, ఉపవాసాలు చేసేందుకు పవిత్రమైన మాసం. మీ రాశి ప్రకారం ఈ మాసంలో ఇలా చేశారంటే అంతా శుభమే జరుగుతుంది.
ఫాల్గుణ మాసంలో మీ రాశి ప్రకారం ఈ పనులు చేయండి
Phalguna masam pariharalu: పవిత్రమైన మాసాలలో ఫాల్గుణ మాసం ఒకటి. ఈ నెలలో శివుడు, విష్ణుమూర్తి, లక్ష్మీ దేవి, చంద్రదేవుడిని ఎక్కువగా పూజిస్తారు. దానధర్మాలు చేసేందుకు ఈ మాసం ప్రత్యేకమైనది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఫాల్గుణ మాసంలో కొన్ని పరిహారాలు పాటించడం వల్ల దైవ అనుగ్రహం పొందుతారు. మీకున్న అనేక సమస్యల నుంచి బయట పడేందుకు ఇలా చేసి చూడండి.
మానసిక ఒత్తిడి తగ్గించుకునేందుకు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మానసిక ఒత్తిడి అనుభవించే వాళ్ళు ఫాల్గుణ మాసంలో శ్రీకృష్ణుడిని పూజించాలి. స్నానం చేసే ముందు నీటిలో గులాబీ రేకులు లేదా రోజ్ వాటర్ వేసుకుని స్నానం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
ఆరోగ్య సమస్యలను అధిగమించేందుకు
ఈ కాలంలో ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే శివుడిని పూజించడం మంచిది. అలాగే గంధం నుదుటి మీద రాసుకోవడం, శివుడికి నైవేద్యంగా సమర్పించడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు.
ఆర్థిక పరిస్థితి
ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఫాల్గుణ మాసంలో లక్ష్మీదేవిని ఆచార వ్యవహారాలు, సరైన నియమాలు పాటించి పూజించాలి. అమ్మవారికి ఎంత ఇష్టమైన ఎర్ర గులాబీలు సమర్పించండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఆనందం, శ్రేయస్సు కోసం
జీవితంలో సవాళ్లను ఎదురయినప్పుడు ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కొరవడుతుంది. అటువంటి సమయంలో “ఓం సోమ సోమాయ నమః” అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు పఠించాలి. ఇలా చేయడం వల్ల సవాళ్లను సునాయాసంగా అధిగమించగలుగుతారు.
ఫాల్గుణ మాసంలో చంద్రుని ఆరాధించడం ప్రత్యేకత సంతరించుకుంటుంది. జాతకంలో చంద్రుడు స్థానం బలహీనంగా ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. వాటిని అధిగమించేందుకు ఈ మాసంలో తెల్లటి పువ్వులు, పెరుగు, తెలుపు రంగు శంఖం, పంచదార, ఆహారం, తెల్లటి వస్త్రాలు మొదలైనవి దానం చేయాలి.
ఫాల్గుణ మాసంలో మీ రాశి ప్రకారం ఈ పనులు చేయండి
మేష రాశి
మేష రాశి జాతకులు ఇంటి నుంచి బయలుదేరే ముందు చక్కెర కలిపిన నీటిని తాగడం మంచిది. అలాగే మీరు ఏదైన పని మీద వెళ్తుంటే తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే మీరు చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు.
వృషభ రాశి
ఈ రాశి జాతకులు ప్రతి రోజు తమ ఇంటి ఈశాన్యం మూలలో నెయ్యి దీపం వెలిగించాలి. రోజూ కనకధార స్తోత్రం పారాయణం చేయాలి.
మిథున రాశి
మిథున రాశి జాతకులు పెరుగు, పాలు దానం చేయాలి. శివుడికి అభిషేకం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు.
కర్కాటక రాశి
ఈ రాశి వారు ఫాల్గుణ మాసంలో చంద్రుని కాంతిలో కూర్చొని చంద్రుడికి సంబంధించిన మంత్రాలు 108 సార్లు జపించాలి. అవసరమైన వారికి పాలు, పెరుగు దానం చేస్తే మంచి ఫలితాలు పొందుతారు.
సింహ రాశి
సూర్య భగవానుడు అనుగ్రహం కోసం కొద్దిగా బెల్లం కలిపిన నీటిని సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. దాంతోపాటు లక్ష్మీదేవిని పూజించడం మంచిది.
కన్య రాశి
ప్రతిరోజు ఆవుకి పచ్చి ఆకుకూరలు తినిపించడం శుభ ఫలితాలు ఇస్తుంది.
తులా రాశి
తులారాశి జాతకులు తెలుపు రంగు దుస్తులు ధరించాలి. శివుడిని సోమవారం క్రమం తప్పకుండా పూజించడం మంచిది.
వృశ్చిక రాశి
ఈ రాశి వారు ఫాల్గుణ మాసంలో చంద్రుడికి పచ్చిపాలు, నీరు కలిపి అర్ఘ్యం సమర్పించాలి.
ధనుస్సు రాశి
ఫాల్గుణ మాసంలో రోజు తులసి పూజ చేసి ఒక తులసి ఆకు సేవించాలి.
మకర రాశి
ఈ సమయంలో తన తల్లిని జాగ్రత్తగా చూసుకోవాలి. లక్ష్మీదేవికి ఎరుపు రంగు పూలతో పూజ చేయాలి.
కుంభ రాశి
ప్రతిరోజు శివుని ఆరాధించాలి. శివలింగానికి నీరు సమర్పించేటప్పుడు ఓం నమః శివాయ అని జపించాలి. నిరుపేదలకు దానం చేయాలి.
మీన రాశి
తెల్ల చందనం, పాలు, పెరుగు వంటివి పేదలకు లేదా దేవాలయంలో దానం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. అలాగే నుదుటిపై తెల్లటి తిలకం ధరించాలి.