Laddu holi: ఇక్కడ రంగులతో కాదు లడ్డూలతో హోలీ జరుపుకుంటారు.. అలా ఎందుకు చేస్తారో తెలుసా?-history and intresting facts about laddu holi in uttara pradesh mathura ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Laddu Holi: ఇక్కడ రంగులతో కాదు లడ్డూలతో హోలీ జరుపుకుంటారు.. అలా ఎందుకు చేస్తారో తెలుసా?

Laddu holi: ఇక్కడ రంగులతో కాదు లడ్డూలతో హోలీ జరుపుకుంటారు.. అలా ఎందుకు చేస్తారో తెలుసా?

Gunti Soundarya HT Telugu
Feb 24, 2024 07:00 PM IST

Laddu holi: హోలీ అంటే రంగుల పండుగ. అన్నాచెల్లెళ్ల బంధం కాని వాళ్ళు ఒకరి మీద మరొకరు రంగులు చల్లుకుంటూ సంబరంగా వేడుక జరుపుకుంటారు. కానీ ఇక్కడ హోలీ మాత్రం రంగులతో కాదు లడ్డూలతో జరుగుతుంది.

లడ్డూల హోలీ
లడ్డూల హోలీ (pixabay)

Laddu holi: ఫాల్గుణ మాసంలో అందరూ ఎంతో సరదాగా జరుపుకునే పండుగ హోలీ. చిన్నా పెద్ద తేడా లేకుండా రంగులు పిచికారీ చేసుకుంటూ వీధుల వెంట పరుగులు పెడుతూ కనిపిస్తారు. ఎంతో సంతోషంగా సాగే ఈ సంప్రదాయ వేడుకలో అందరూ పాల్గొని ఉత్సాహంగా పండుగ జరుపుకుంటారు. ఈ ఏడాది హోలీ పండుగ మార్చి 25 న వచ్చింది.

హోలీ అంటే రంగుల పండుగ అనే విషయం అందరికీ తెలుసు. కానీ ఇక్కడ హోలీ అంటే మాత్రం రంగులు కాదు లడ్డూలు. ఒకరి మీద మరొకరు రంగులు కాకుండా నోరూరించే లడ్డూలు విసురుకుంటారు. ఎంతో ప్రత్యేకమైన ఈ హోలీ ఎక్కడో కాదు రాధాకృష్ణులకు ఇష్టమైన ప్రదేశం మధురలో జరుగుతుంది. ఈ లడ్డూల హోలీలో పాల్గొనేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఆసక్తి వస్తారు.

లడ్డూల హోలీ ఎలా వచ్చిందంటే?

ఉత్తరప్రదేశ్ లోని మధుర ప్రాంతంలో ఈ ప్రత్యేకమైన లడ్డూ హోలీ పండుగ జరుగుతుంది. ద్వాపర యుగం నుంచి ఈ లడ్డూల హోలీ జరుపుకోవడం ఆచారంగా వస్తుంది. ఈ ఆచారంలో భాగంగా దేవుడికి సమర్పించే నైవేద్యం లడ్డూలను ఒకరిపై మరొకరు విసురుకుంటూ ఉంటారు.

పురాణాల ప్రకారం హోలీ ఆడేందుకు రాధ నివసించే మధుర సమీపంలోని బర్సానా ప్రాంతం నుంచి కృష్ణుడు నివసించే నందగావ్ కి ఒక ఆహ్వానం పంపించారు. ఈ ఆహ్వానం తీసుకెళ్ళే వ్యక్తిని పాండా అంటారు. నందగావ్ ప్రజలు ఆహ్వానం అందుకుని సంతోషంగా అంగీకరించారు. తమ అంగీకారాన్ని తెలుపుతూ మరొక లేఖ బర్సానాకి పంపించారు. పాండా ఈ లేఖ తెచ్చినప్పుడు అక్కడి ప్రజలు సంతోషంగా తాలీ పళ్ళెంలో లడ్డూలు పెట్టి స్వాగతం పలికారు.

అప్పుడే అక్కడికి కొంతమంది గోపికలు వచ్చి పూజారి మీద సరదాగా రంగులు విసిరారు. సమయానికి పూజారి చేతిలో రంగులు లేకపోవడంతో లడ్డూలు వారి మీదకు తిరిగి విసిరాడు. అప్పటి నుంచి బర్సానాలో లడ్డూ హోలీ సంప్రదాయ వేడుకగా జరుపుకుంటున్నారు. ఎంతో సరదాగా సాగే ఈ వేడుకని తిలకించి పాల్గొనేందుకు దూర ప్రాంతాల నుంచి కూడా ఔత్సాహికులు పండుగ సమయంలో ఇక్కడికి చేరుకుంటారు. ఈ సమయంలో ఆలయం మొత్తం రంగులు, లడ్డూలతో నిండిపోతుంది.

హోలీ కోసం 50 క్వింటాళ్ల లడ్డూలు తయారీ

బర్సానా పట్టణంలోని శ్రీజి ఆలయంలో హోలీ పండుగ రావడానికి కొన్ని రోజులు ముందు ఈ లడ్డూల హోలీ జరుగుతుంది. ఈ వేడుక ప్రారంభం కావడానికి ముందు శ్రీజి ఆలయంలో ప్రియమైన వారికి, దేవతలకి లడ్డూలు సమర్పిస్తారు. తర్వాత లడ్డూల హోలీ ప్రారంభంఅవుతుంది. ఆలయంలో దైవ దర్శనం కోసం వచ్చిన భక్తుల మీద కూడా లడ్డూలు విసురుతారు.

బర్సా నాలో జరుపుకునే ఈ లడ్డూ హోలీలో దాదాపు 40 నుండి 50 టన్నుల లడ్డూలను ఉపయోగిస్తారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు విదేశాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. లడ్డూ హోలీ అయిపోయిన తర్వాత లత్మార్ హోలీ ప్రారంభమవుతుంది. ఈ హోలీ లో భాగంగా మహిళలు పురుషులని కర్రలతో కొడతారు.

Whats_app_banner