Vaishaka pournami 2024: వైశాఖ పౌర్ణమి శుభ ముహూర్తం, పూజా విధానం, పాటించాల్సిన పరిహారాలు
22 May 2024, 19:00 IST
- Vaishaka pournami 2024: వైశాఖ పౌర్ణమి మే 23వ తేదీ జరుపుకుంటున్నారు. ఈరోజున కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించడం వల్ల దోషాలు తొలగిపోవడంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపద పెరుగుతుంది.
వైశాఖ పౌర్ణమి 2024
Vaishaka pournami 2024: హిందూ మతంలో వైశాఖ మాసం శుక్లపక్షం పౌర్ణమి రోజున మత కార్యక్రమాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజు చేసే పూజలు, ఉపవాస దీక్షలు పాటిస్తే సకల బాధల నుంచి విముక్తి కలిగిస్తాయని నమ్ముతారు. హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ పౌర్ణమి మే 23న జరుపుకుంటారు. ఈ రోజుని బుద్ధ పూర్ణిమ లేదా బుద్ధ జయంతి అని కూడా అంటారు.
ఈ ప్రత్యేకమైన రోజున దానధర్మాలు, ధార్మిక కార్యక్రమాలు చేయడం పవిత్రంగా భావిస్తారు. వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామిని పూజించడం వల్ల ఆశించిన ఫలితాలు కలుగుతాయని చెబుతారు.
వైశాఖ పూర్ణిమ తిథి, శుభ సమయం
పంచాంగం ప్రకారం వైశాఖ మాసం పౌర్ణమి తిథి మే 22 రాత్రి 7:42 గంటలకు ప్రారంభం అవుతుంది. మే 23 రాత్రి 7. 22 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం మే 23న వైశాఖ పౌర్ణమి జరుపుకుంటారు. పవిత్ర నది స్నానమాచరించేందుకు ఉదయం 4: 04 గంటలకు మంచి సమయం.
ఈ ఏడాది వైశాఖ పౌర్ణమి నాలుగు శుభ యోగాలతో జరుపుకోనున్నారు. సర్వార్థ సిద్ది యోగం, శివయోగం, విశాఖ నక్షత్రం వచ్చాయి. వీటికి తోడు గురువారం వైశాఖ పౌర్ణమి రావడం మరింత శ్రేయస్కరం.
సర్వార్థ సిద్ధి యోగం ఉదయం 9.15 గంటల నుంచి మే 24 ఉదయం 5. 26 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో పూజ చేయడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి. శివయోగం మధ్యాహ్నం 12.1.12 గంటల నుంచి మరుసటి రోజు 11.22 వరకు ఉంటుంది. విశాఖ నక్షత్రం ఉదయం 9:15 గంటల వరకు ఉంటుంది. తర్వాత అనురాధ నక్షత్రం వస్తుంది. విశాఖ నక్షత్రం బృహస్పతికి చెందినది. వీటితోపాటు గురువారం విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజు.
వైశాఖ పౌర్ణమి రోజు ఈ సింపుల్ రెమెడీస్ పాటించడం వల్ల మీకు ఉన్న అనేక కష్టాలు, దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. ఈరోజు ఉపవాసం ఉండాలని అనుకునే వాళ్ళు పౌర్ణమి రోజున చంద్రుడికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత ఉపవాసం విరమిస్తారు. ఈ రోజున చంద్రుడిని పూజించడం వల్ల చంద్ర దోషం తొలగిపోతుంది. జాతకంలో చంద్రుడి స్థానం బలపడుతుంది.
పితృ దోష ముక్తికి పరిహారాలు
వైశాఖ పౌర్ణమి రోజున రావి చెట్టుకు నీరు సమర్పించడం వల్ల పితృ దోషం తొలగిపోతుంది. కుటుంబ సభ్యులకు పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి.
పురోగతి కోసం
కెరీర్, వృత్తిపరమైన పురోగతి కోసం వైశాఖ పౌర్ణమి రోజు రావి చెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల పనిలో ఆటంకాలు తొలగిపోతాయి. ప్రతి రంగంలో విజయం సాధిస్తారని నమ్ముతారు.
శని దోషం పోయేందుకు
శని దోషం తొలగిపోవడానికి వైశాఖ పౌర్ణమి రోజున పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున శనీశ్వరుడిని, రావిచెట్టును పూజించడం వల్ల సకల దోషాలు తొలగిపోతాయి. శని చల్లని చూపు, ఆశీస్సులు లభిస్తాయి.
విష్ణుమూర్తి ఆరాధన
పౌర్ణమి రోజు తప్పనిసరిగా విష్ణుమూర్తి, లక్ష్మీదేవిని పూజించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు కలుగుతాయని నమ్ముతారు. ఈ రోజున పూజా సమయంలో లక్ష్మీదేవి పాదాలకు 11 పసుపు గోధుమలు సమర్పించాలి. తర్వాత వాటిని ఎర్రటి వస్త్రంలో కట్టి సురక్షితంగా ఉంచాలి. ఇలా చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు.