Peepal tree: ఆదివారం రావి చెట్టును ఎందుకు పూజించకూడదు? దీని వెనుక ఉన్న కారణం ఏంటి?-why not worship ravi tree on sunday what is the reason behind this ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Peepal Tree: ఆదివారం రావి చెట్టును ఎందుకు పూజించకూడదు? దీని వెనుక ఉన్న కారణం ఏంటి?

Peepal tree: ఆదివారం రావి చెట్టును ఎందుకు పూజించకూడదు? దీని వెనుక ఉన్న కారణం ఏంటి?

Gunti Soundarya HT Telugu
Apr 13, 2024 04:03 PM IST

Peepal tree: హిందూ మతంలో రావి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కానీ ఆదివారం మాత్రం రావి చెట్టును తాకడం చేయకూడదు. అలాగే నీరు సమర్పించకూడదు. దీని వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసా?

 ఆదివారం రావి చెట్టుని పూజించకూడదా?
ఆదివారం రావి చెట్టుని పూజించకూడదా? (unsplash)

Peepal tree: హిందూ మత గ్రంథాల ప్రకారం చెట్లలో దేవతలు నివసిస్తారని చెబుతారు. సనాతన ధర్మంలో అనేక చెట్లు, మొక్కలు, నదులు, పర్వతాలతో దేవుళ్ళకి దగ్గర సంబంధం ఉందని అంటారు. అందుకే వాటిని చాలా పవిత్రమైనవిగా పరిగణిస్తారు.

దాదాపు ప్రతి గుడిలోనూ రావి చెట్టు ఉంటుంది. భగవంతుని స్వరూపంగా రావి చెట్టును భావిస్తారు. పురాణాలలో కూడా ఈ చెట్టు గురించి ప్రస్తావన ఉంటుంది. రావి చెట్టును పూజించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని నమ్ముతారు. ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు, పూజలు చేస్తే అనేక దోషాలు, సమస్యలు తొలగిపోతాయి. ఈ చెట్టును పూజిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. అయితే ఈ చెట్టును ఎప్పుడు పూజించాలి? ఎప్పుడు పూజించకూడదనే విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి.

ఆదివారం పూజించకూడదా?

రావి చెట్టుని ఆదివారం నాడు పొరపాటున కూడా తాకకూడదు. చెట్టుకు నీరు సమర్పించకూడదని చెబుతారు. ఇలా చేయడం వల్ల వారి జీవితంలో ఎన్నో అనార్ధాలు ఎదురవుతాయి. ఆదివారం నాడు దీనికి నీరు సమర్పించడం వల్ల దరిద్రం తాండవిస్తుందని నమ్ముతారు. దీని వెనక ఒక కథ కూడా ఉంది.

లక్ష్మీదేవి అక్క దరిద్ర దేవత జేష్టాదేవి ఓ రోజు మహావిష్ణువు దగ్గరకు వెళ్తారు. అయితే తాము నివసించడానికి స్థలాన్ని ఇవ్వమని కోరుకుంటారు. శ్రీ మహావిష్ణువు మీరిద్దరూ రావి చెట్టు మీద నివాసం ఉండమని చెప్తారు. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు తన అక్క దరిద్ర దేవత జేష్టా దేవికి వివాహం కాలేదని చెప్పి బాధపడుతుంది. ఆమె వివాహం జరిగిన తర్వాత పెళ్లి చేసుకోవాలని చెప్తుంది.

ఎలాంటి వరుడు కావాలో చెప్పమని మహావిష్ణువు దరిద్ర దేవతను అడుగుతాడు. అప్పుడు దేవతలకు లేదా మానవుల కుటుంబానికి చెందిన వ్యక్తిని భర్తగా కావాలని దరిద్ర దేవత కోరుకుంటుంది. అయితే ఆ వ్యక్తి పెళ్లి జరిగిన తర్వాత ఎవరిని పూజించకూడదని షరతు విధిస్తుంది. అలాగే ఎవరూ పూజించని ప్రదేశంలో తనకు ఆశ్రయం ఇవ్వమని అడుగుతుంది.

తనకు తగిన వరుడు దొరకడం చాలా కష్టమని దరిద్ర దేవత అనుకుంటుంది. కానీ విష్ణుమూర్తి రిషి అనే వ్యక్తిని తీసుకొచ్చి వివాహం జరిపిస్తాడు. ఇద్దరు ఎటువంటి పూజలు చేయకుండా దరిద్రమైన జీవితం జీవించాలని అనుకుంటారు. విష్ణుమూర్తి దరిద్ర దేవతని ఆదివారం రోజు రావి చెట్టులో నివసించమని చెప్తాడు. అందుకే ఆరోజు దేవతలందరూ రావిచెట్టును విడిచిపెడతారు. అందువల్లే ఆదివారం నాడు రావి చెట్టును పూజించరు. మిగతా వారాల్లో రావి చెట్టును పూజించవచ్చు.

ఆదివారం రోజు రావి చెట్టుకు నీరు పోస్తే ఇంట్లో దరిద్రం తాండవిస్తుందని చెబుతారు. చేపట్టే ప్రతి పనిలో నిరాశ ఎదురవుతుంది. అందుకే పొరపాటున కూడా ఆదివారం రోజు రావి చెట్టుకు నీరు సమర్పించకూడదు.

రావిచెట్టు కింద దీపం వెలిగిస్తే కలిగే ప్రయోజనాలు

రావి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల శని దేవుడి ఆశీస్సులు లభిస్తాయి. ఒక వ్యక్తికి శ్రేయస్సు లభిస్తుంది. ఈ చెట్టు మూలంలో ఆవాల నూనెతో దీపాన్ని వెలిగించడం వల్ల పేదరికం తొలగిపోతుంది. అనేక గ్రహ దోషాలు తొలగిపోతాయని పండితులు సూచిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం రావి చెట్టు కింద దీపం వెలిగించడానికి ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు. గ్రహదోషాలు, ఏలినాటి శని, అర్ధాష్టమ శని వల్ల సమస్యలు తలెత్తే వాళ్ళు ఆ రోజు దీపం వెలిగిస్తే మంచి జరుగుతుంది.

రావి చెట్టు ఆకులతో పరిహారాలు

రావి చెట్టు ఆకులతో కొన్ని పరిహారాలు పాటించడం వల్ల మంచి జరుగుతుంది. గురువారం నాడు రావి చెట్టు ఆకులు కోసి గంగాజలంతో వాటిని శుభ్రం చేసుకోవాలి. వాటికి పసుపు, చందనం రాసి ఓం స్వీ శ్రీం హీమ్ నమః అని రాసి దానిపై వెండి నాణెం ఉంచి భద్రంగా ఉంచుకోవాలి. మీ వద్ద వెండి నాణెం లేకపోతే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని రావి ఆకుపై రాసి ఇంట్లో ఏదైనా పవిత్ర స్థలంలో ఉంచుకోవచ్చు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.

ఇలా చేయడం వల్ల సకల దేవతల అనుగ్రహం మీకు లభిస్తుంది. ఆశీర్వాదాలు లభిస్తాయి. జీవితంలో ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. మత గ్రంథాల ప్రకారం రావి చెట్టును విష్ణు నివాసంగా చెబుతారు. అందుకే ఈ చెట్టు నరకడానికి కూడా భయపడతారు. ఒకవేళ రావి చెట్టుని నరకాలని అనుకుంటే ముందుగా విష్ణుమూర్తికి క్షమాపణ చెప్పిన తర్వాత ఆ పని చేయాలి. అది కూడా ఆదివారం రోజు మాత్రమే ఈ చెట్టుని కత్తిరించాలి.