తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Narmada River: హిందూ పురాణాల ప్రకారం నర్మదా నది పుట్టుక ఎలా జరిగింది? ఈ నది ప్రాశస్త్యం ఏంటి?

Narmada river: హిందూ పురాణాల ప్రకారం నర్మదా నది పుట్టుక ఎలా జరిగింది? ఈ నది ప్రాశస్త్యం ఏంటి?

HT Telugu Desk HT Telugu

05 May 2024, 13:11 IST

    • Narmada river: నర్మదా నది జననం ఎలా జరిగింది. ఈ నదీ పరీవాహక ప్రాంతాల్లో ఉన్న పుణ్య క్షేత్రాలు ఏంటి? వాటి విశిష్టతల గురించి పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చక్కగా వివరించారు. 
నర్మదా నది పుట్టుక ఎలా జరిగింది?
నర్మదా నది పుట్టుక ఎలా జరిగింది? (pinterest)

నర్మదా నది పుట్టుక ఎలా జరిగింది?

Narmada river: నర్మద అంటే ఆహ్లాదకరమైనదని అర్థం. శివపార్వతుల కుమార్తెగా శివపార్వతుల చెమట ద్వారా ఉద్భవించిన కన్యగా నర్మదా నది గురించి పురాణాలలో చెప్పబడినదని ప్రముఖ అధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

లేటెస్ట్ ఫోటోలు

Mercury transit: గ్రహాల రాకుమారుడు వచ్చేశాడు.. ఈ నెల అంతా వీరికి డబ్బే డబ్బు

May 18, 2024, 03:19 PM

Mohini Ekadashi : మోహిని ఏకాదశి రోజున ఈ రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం

May 18, 2024, 08:31 AM

మే 18, రేపటి రాశి ఫలాలు.. రేపు విలువైన వస్తువులు పోయే అవకాశం ఉంది, జాగ్రత్త

May 17, 2024, 08:25 PM

Sukraditya yogam: శుక్రాదిత్య యోగం.. ఈ మూడు రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది

May 17, 2024, 02:37 PM

ఈ రాశుల వారికి భారీ ధన లాభం- ఇంకొన్ని రోజుల్లో ప్రమోషన్​!

May 17, 2024, 12:21 PM

saturn Retrograde 2024 : శని తిరోగమనంతో రాజయోగం.. మంచి మంచి ఆఫర్లు వీరి సొంతం

May 17, 2024, 08:14 AM

నర్మద జననం

నర్మద జననం జరిగిన తరువాత ఆమె అందానికి దేవతలందరు పరవశించి ఆమెను వివాహము చేసుకోవాలని ప్రయత్నించారు. శివుడు ఆమె ఎవరకు అందుతుందో వారికి ఇచ్చి వివాహం చేస్తానని చెప్పటం ఇంద్రుడితో సహా దేవతలందరూ ఆమెను పొందడానికి ప్రయత్నించి విఫలమయ్యారు.

దేవతలతో చాలాకాలం పరిహాసాలాడి వారికి చిక్కినట్లుగా చిక్కి మాయమవ్వడం ఇదంతా చూసి శివపార్వతులు ఆనందించి దేవతలతో పరిహాసం అడుటచేత ఆమెకు నర్మదగా పేరు పెట్టెను అని చిలకమర్తి తెలిపారు. నర్మదా అంటే పరిహాసం అని ఒక అర్ధం. శివపార్వతుల మన్నన పొందినటువంటి నర్మదకి ఎప్పుడు మరణం ఉండదని వరం శివుడు ఇచ్చినట్లుగా నా మరణం ఇతి కాబట్టి నర్మదా అని చెప్పబడినది.

భారతీయుల దృష్టిలో నది ప్రవహించే నీరు మాత్రమే కాదు. జీవాన్నిచ్చే శక్తి. తాపం తీర్చే వనరే కాదు. ప్రాణం నిలిపే తల్లి కూడా. అందుకే నదిని దేవతగా పూజిస్తాం. అనాదిగా తన తరాలను నిలబెడుతున్న నదిపట్ల మనిషిది కృతజ్ఞత మాత్రమే కాదు, ఆరాధనా భావం కూడా. ఆ నదీ తీరానే పితృ దేవతలను తలుచుకుంటాడు. నదీ జలాలను అర్ఘ్యంగా సూర్యుడికి సమర్పిస్తారు. ఆ నీటితో తడిసి వాటిని నెత్తిన జల్లుకుని మూడు మునకలు వేసి తరిస్తాడు. అందుకు కల్పించుకున్న ఓ అపురూప సందర్భమే పుష్కర స్నానం. నర్మదా సింధు కావేరీ.. అంటూ నీటిని పవిత్రం చేసే మంత్రం చెప్పుకుంటాం. ప్రస్తుతం నర్మదా నది పుష్కరాలు జరుగుతున్నాయని చిలకమర్తి తెలిపారు.

జన్మవృత్తాంతం

హిందూ పురాణాలలో నర్మదా నదికి ఓ ప్రత్యేక స్థానం ఉన్నది. స్కంద, కూర్మ, మత్స్య పురాణాలలో నర్మద వృత్తాంతం కనిపిస్తుంది. శివుడి దేహం నుంచి పుట్టినది కాబట్టి అయోనిజ అనీ, పరమేశ్వరుడికి ప్రీతికరమైనది కాబట్టి నర్మద అనీ, అలలతో ఎగురుతూ ప్రవహించేది కాబట్టి దేవానది అనీ పిలుస్తారు. ఇవే కాకుండా పూర్వ గంగ, సోమోద్భవ లాంటి చాలా పేర్లే కనిపిస్తాయి. నాగులకు తమ రాజ్యాన్ని తిరిగి ఇప్పించే క్రమంలో, నర్మదా దేవి పురకుత్సుడనే రాజును ఆకర్షించి నాగలోకానికి రప్పించినట్టు ఒక కథ వినిపిస్తుంది.

నర్మదా నది విశేషాలు

అమర్‌ కంటక్‌ దగ్గర పుట్టిన నర్మద మైదాన ప్రాంతాల గుండా కాకుండా రాళ్లు, కొండలను చీల్చుకుంటూ... అడవుల మధ్య ప్రవహిస్తూ సాగుతుంది. ఈ నది ప్రవహించే దారి పొడవునా ప్రతీ క్షేత్రం ఏదో ఒక పురాణ పాత్రతో ముడిపడి ఉండటం విశేషం. మాంధాత చక్రవర్తి తపస్సు చేసిన మాంధాత ద్వీపం, జాబాలి పేరు మీదుగా జబల్పూర్‌, భృగు మహర్షి తపస్సు ఆచరించిన టబ్రోచ్‌ లాంటి స్థలాలు పురాణకాలంలో ఉన్న అనుభూతినిస్తాయి. ఈ నదిలో శివలింగాన్ని పోలిన బాణలింగాలు కనిపించడం మరో ప్రత్యేకత. ఇన్ని అబ్బురాలు ఉన్నాయి కాబట్టే నర్మదా నదిని చూసినంతనే పుణ్యం లభిస్తుందని భావిస్తారు.

ఆ నదీతీరాన జరిగే స్నానం, దానం, యాగం విశేష ఫలితాన్నిస్తాయని నమ్ముతారు. మన దేశంలో ఉన్న ప్రతి నదికీ ఓ ప్రత్యేకత ఉంది. అది పారే విధానం, దిక్కు సారం, ఆ తీరాన వెలసిన క్షేత్రాలు, నది వెంబడి సాగే జీవనం… వీటన్నిటి ఆధారంగా వాటికి ప్రత్యేకతలను ఆపాదించి కొలుచుకునే ఆచారం మనది. అందుకే మనవారు కేవలం సమీపంలో ఉన్న నదిని మాత్రమే పవిత్రంగానో, పుణ్యక్షేత్రంగానో భావించరు. బ్రహ్మపుత్ర నుంచి పంపానది వరకు ప్రతి నదినీ దేవతగా గుర్తిస్తారు.

ఏదో ఒక సమయంలో వాటిని దర్శించాలని కోరుకుంటారు. అందుకే ఒక నదికి వచ్చే పుష్కరాలు స్థానిక వేడుకగా కాకుండా దేశమంతా పండుగలా భావించే వేదికగా మారతాయి. ఈ సంవత్సనం నర్మదా నది పుష్కరాలు మే 1నుంచి 12 వరకు జరుగుతాయని చిలకమర్తి తెలియచేశారు.

ఇదీ పుష్కరుడి కథ

పుష్కరాల సంప్రదాయం వెనుక ఉన్న కథలలో ఎక్కువగా వినిపించే గాథ ఇది. పూర్వం తుందిలుడు అనే రుషి ఉండేవాడు. ఆయన శివుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు ఘోరమైన తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగితే...

“నీలో నాకు శాశ్వత స్థానం లభించేట్లు అనుగ్రహించమనని వేడుకున్నాడు" తుందిలుడు. అతని భక్తికి మెచ్చిన శివుడు తనలోని జలశక్తికి ప్రతినిధిగా మారమని తుందిలుణ్ణి అనుగ్రహించాడు. అలా ఈ జగాన ఉన్న జలాలకు తుందిలుడు అధిపతి అయ్యాడు.

జలం లేకుండా జీవం లేదు అందుకే తుందిలుడికి పుష్కరుడు (పోషించేవాడు) అన్న మారు పేరు స్థిరపడింది. ఇదిలా ఉండగా బ్రహ్మ దేవుడు తన సృష్టిని కొనసాగించడానికి జలశక్తి అవసరమైంది. దాంతో పుష్కరుణ్ణి తనకు అండగా ఉండమని ఆహ్వానించాడు. శివుడి అనుజ్ఞతో పుష్కరుడు బ్రహ్మ దగ్గరికి వెళ్లి సృష్టికి సాయపడ్డాడు.

బ్రహ్మ పని పూర్తయినప్ప టికీ పుష్కరుణ్ణి వదులుకోవడం ఆయనకు ఇష్టం లేక పోయింది. అలా పుష్కరుడు బ్రహ్మ దగ్గరే ఉండిపోయాడు. కొన్నాళ్లకు దేవగురువైన బృహస్పతి, భూమి మీద ఉన్న జీవులందరినీ తన జలశక్తితో పాపవిమోచనం చేయగలిగే పుష్కరుణ్ని తనతో పంపమని బ్రహ్మను అభ్యర్థించాడు. పుష్కరుణ్ణి శాశ్వతంగా వదులుకోవడం ఇష్టం లేని బ్రహ్మ దేవుడు ఓ మధ్యేమార్గాన్ని సూచించాడు.

బృహస్పతి ఒక ఏడాదిలో ఏ రాశిలో అయితే ప్రవేశిస్తాడో నాటి నుంచి 12 రోజుల పాటు ఒక నదిలో ఉండమని సూచించాడు. అలా 12 రాశులకు, 12 నదులను కేటాయించాడు.

గంగా నది (మేష రాశి), నర్మద (వృషభం), సరస్వతి (మిథునం), యమున (కర్కాటకం), గోదావరి (సింహం), కృష్ణ (కన్య), కావేరి (తుల), భీమా/ తామ్రపర్డి (వృశ్చికం), తపతి/బ్రహ్మపుత్ర (ధనుస్సు), తుంగభద్ర (మకరం), సింధు (కుంభం), ప్రాణహిత (మీనం).

ఉత్తరాదికి జీవనది

నదుల గురించి చెప్పుకొనేటప్పుడు గంగ, యమున, కృష్ణ గోదావరి లాంటి పేర్లు వినిపించినంతగా నర్మదాను తల్చుకోరు. నిజానికి నర్మదా నది కూడా అంతే అద్భుతమైన జీవనది. భారతదేశంలో ప్రవహించే నదులలో అయిదో అతిపెద్ద నది. పశ్చిమంగా ప్రవహించే వాటిలో అతి పొడవైనది. అందుకే మహా నది అని కూడా పిలుస్తుంటారు. గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రలలో ప్రవహించే ఈ నది తాలి రెండు రాష్ట్రాలకు అపారమైన జలరాశిని అందిస్తున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ, సామాజిక జీవనం లాంటి వాటిని నర్మదా లేకుండా ఊహించలేం.

సుమారు లక్ష చదరపు కిలోమీటర్ల నర్మదా పరీవాహక ప్రాంతం చాలా వైవిధ్యమైంది, పురాతనమైంది కూడా. దాదాపు 16 కోట్ల సంవత్సరాల కిందట ఉత్తర భారతదేశం, ఇప్పటి ద్వీపకల్పం విడివిడిగా ఉండేవి. వాటి మధ్య ఏర్పడిన లోయలో ప్రవహిస్తున్నదే నర్మద.

పట్నాలు, పుణ్యక్షేత్రాలు - ఉపనదులతో ప్రవహించే నర్మదా దారి పొడవునా అనేక ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తూ సాగుతుంది. నర్మదా పరీవాహక ప్రాంతంలో ఖనిజాలతో సమృద్ధిగా ఉండే నల్లరేగడి నేలలు ఎక్కువ. జబల్‌ పూర్‌, దభోయ్‌, ధర్మపురి, హార్ధా తదితర నగరాలు, పట్టణాలు నర్మదా తీరంలో ఉన్నాయి. ఇక నర్మదా పొడవునా ఉన్న పుణ్యక్షేత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

అమర్‌ కంటక్‌

దట్టమైన అరణ్యాలలో కనిపించే అరుదైన పుణ్య క్షేత్రం అమర్‌ కంటరక్‌. నర్మదా నది జన్మస్థానం. అటు వింధ్య, ఇటు సాత్పుర పర్వత శ్రేణుల కూడలి. వేయి స్థలాన్ని చూసి తీరాల్సిన పుణ్యక్షేత్రంగా మార్చేశాయి. దాదాపు 600కు పైగా అరుదైన జీవజాతులు ఇక్కడ ఉన్నాయని అంచనా. కాళిదాసు, కబీర్‌ లాంటి మహా మహులు ఇష్టపడిన ప్రదేశమిది. వెయ్యేండ్ల క్రితం కామదేవ రాజు నిర్మించిన త్రిముఖి ఆలయం, జైన మందిరం, శంకరాచార్య ఆశ్రమం... లాంటి కట్టడాలెన్నో ఇక్కడ కనిపిస్తాయి.

ఓంకారేశ్వర్‌

హైందవ పుణ్యక్షేత్రాలలో జ్యోతిర్లింగాలకు ఉన్న ప్రాముఖ్యాన్ని గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వాటిని చూస్తేనే జన్మ తరిస్తుందనే నమ్మకం. వాటిలో ఒకటి నదీ తీరాన, అందులోనూ ఓ ద్వీపం మీద ఉండటం విశేషం. అదే ఓంకారేశ్వరం. ఈ ప్రాంతం ఓంకార రూపంలో ఉండటమే ఆ పేరుకు కారణమని చెబుతారు. దానవులను శిక్షించేందుకు శివుడు ఓంకారేశ్వరుడిగా ఇక్కడ అవతరించాడని స్ధల పురాణం. ఇదే ద్వీపం మీద అమలేశ్వరుని పేరుతో మరో శివాలయం ఉంది. శంకరాచార్యుడు తన గురువు గోవింద భగవత్సాదులను ఇక్కడే కలుసుకున్నారన్న నమ్మకానికి సూచనగా, ఆయన విగ్రహం కూడా కనిపిస్తుంది. ఈ ద్వీపానికి కేవలం 140 కిలో మీటర్ల దూరంలోనే మరో జ్యోతిర్లింగ క్షేత్రం ఉజ్జయిని ఉంది.

జబల్‌పూర్‌

పురాణాలు, రాజులు, వలసపాలన, నగరీకరణ, ఖౌగోళిక వైవిధ్యం... జబల్‌పూర్‌ తల్చుకోగాలనే ఇలాంటి ఎన్నో అంశాలు గుర్తుకొస్తాయి. నర్మద పాల రాళ్లను చీల్చుకుంటూ ఏర్పరిచిన మార్చుల్‌ రాక్స్‌, ధువందర్‌ జలపాతాలు, కొండ మీద కట్టిన మదన్‌ మహల్‌ కోట, కన్హా నేషనల్‌ పార్క్‌ బార్లి డ్యామ్‌ లాంటి పర్యాటక ప్రదేశాలు చాలానే ఉన్నాయిక్కడ. 64 యోగినులను ప్రతిష్టించిన చౌసట్‌ యోగిని ఆలయం ఓ మార్మిక ప్రదేశం. త్రిపుర సుందరి ఆలయం, తాల్‌ ఐడా జైన్‌ మందిర్‌ లాంటి గుడులు జబల్‌పూర్‌ అడుగడుగునా కనిపిస్తాయి. ప్రపంచ ప్రసిద్ధ ఖజరహో అలయాలు ఇక్కడికి 250 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి.

నెమావర్‌

చాలా చిన్న ఊరే. కానీ అడుగడుగునా అరుదైన ఆలయాలున్న చోటు. ఇక్కడున్న వెయ్యేండ్ల నాటి సిద్ధ నాథ్‌ ఆలయం వాస్తు శిల్పంలో ఓ అద్భుతం. మారు మూలగా ఉండటం వల్ల, దండయాత్రలను తప్పించుకున్న ఈ ఆలయంలోని శిల్పాలను చెక్కారా, కరిగించారా అన్నంతగా మెలికలు తిరిగి ఉంటాయి. నెమావర్‌ దగ్గర నర్మద సరిగ్గా సగానికి ఉంటుంది.

పరిక్రమ

ఆలయం చుట్టూ ప్రదక్షిణ గురించి విన్నాము, గిరి ప్రదక్షిణ గురించీ విన్నాము... కానీ ఒక నది చుట్టూ ప్రదక్షిణ చేసే అపురూప సంప్రదాయమే నర్మద పరిక్రమ. నర్మద చుట్టూ తిరుగుతూ దాదాపు 2,600 కిలో మీటర్లు సాగే యాత్ర ఇది. అరేబియా సముద్రంలో నర్మద కలిసే స్థానమైన భరూచ్‌ నుంచి మొదలుపెట్టి, అది ఉద్భవించే అమర్‌ కంటక్‌ వరకు వెళ్లి... అక్కడ తీరం మారి వ్యతిరేక దిశలో, తిరిగి భరూచ్చి చేరుకోవడంతో ఈ పరిక్రమ పూర్తవుతుంది. దారి పొడవునా ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ, వాటితో ముడిపడి ఉన్న ఇతిహాసాలను తలుచుకుంటూ, స్థానిక సంప్రదాయాలను పాటిస్తూ సాగే అరుదైన యాత్ర ఇది. సాధువులు కాలినడకన చేసే ఈ యాత్రను నేరుగా చేయలేని వారి కోసం, అక్కడి పర్యాటక శాఖ రవాణా సౌకర్యాలు కల్పించిందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

టాపిక్

తదుపరి వ్యాసం