Ram Navami at Ayodhya temple: అయోధ్య ఆలయంలో అంగరంగ వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు; రామ్ లల్లాకు సూర్యాభిషేకం-ram navami at ayodhya temple grand celebrations after 500 years ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ram Navami At Ayodhya Temple: అయోధ్య ఆలయంలో అంగరంగ వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు; రామ్ లల్లాకు సూర్యాభిషేకం

Ram Navami at Ayodhya temple: అయోధ్య ఆలయంలో అంగరంగ వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు; రామ్ లల్లాకు సూర్యాభిషేకం

HT Telugu Desk HT Telugu
Apr 17, 2024 11:35 AM IST

Ram Navami at Ayodhya temple: అయోధ్య ఆలయంలో ఘనంగా శ్రీరామనవమి నిర్వహించడానికిి అన్ని ఏర్పాట్లు చేశారు. అయోధ్యలో రామ్ లల్లాకు కొత్త ఆలయం నిర్మించిన తరువాత జరుగుతున్న తొలి శ్రీరామ నవమి వేడుకలు ఇవి. ఈ రోజు ప్రత్యేకంగా బాల రాముడి నుదుటిపై సూర్య కిరణాలు పడి సూర్యాభిషేకం జరిగేలా ఏర్పాట్లు చేశారు.

అయోధ్యలో బాల రాముడి విగ్రహానికి అభిషేకం చేస్తున్న పూజారులు
అయోధ్యలో బాల రాముడి విగ్రహానికి అభిషేకం చేస్తున్న పూజారులు (PTI)

Ram Navami at Ayodhya temple: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం ఉదయం వేలాది మంది భక్తులు అయోధ్య రామాలయానికి పోటెత్తారు. అయోధ్యలోని రామాలయంలో 500 సంవత్సరాల తరువాత ఘనంగా శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయి. రామనవమి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు దేశ శుభాకాంక్షలు తెలిపారు. అయోధ్య (Ayodhya) లో రామ నవమి వేడుకలు జరుగుతుండడంతో మొత్తం అయోధ్య సాటిలేని ఆనందంలో ఉందని వ్యాఖ్యానించారు. రామ మందిర ప్రతిష్ఠ తర్వాత అక్కడ శ్రీరామ నవమి పండుగ జరుపుకోవడం ఇదే మొదటిసారి అని గుర్తు చేశారు. రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు.

సూర్యాభిషేకం ఎప్పుడంటే?

దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామ్ లల్లా సూర్యాభిషేకం బుధవారం మధ్యాహ్నం 12:15 గంటలకు జరగనుంది. ఈ కార్యక్రమం నాలుగు నిమిషాల పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో సూర్యకిరణాలు రామ్ లల్లా నుదుటిపై 'తిలకం'ను ఏర్పరుస్తాయి.

అయోధ్యలో రామనవమి వేడుకల విశేషాలు

  1. రామాలయాన్ని సందర్శించే ముందు భక్తులు అయోధ్యలోని సరయూ నది పవిత్ర జలాల్లో స్నానమాచరించారు. రాత్రి వేళల్లో ఘాట్లకు భక్తులు పోటెత్తారు. తెల్లవారు జామున 3.30 గంటలకు రామాలయంలో దర్శనం ప్రారంభమైంది.
  2. జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా కొత్త ఆలయంలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత ఇదే తొలి శ్రీరామనవమి.
  3. సూర్య తిలకం సందర్భంగా రామాలయంలోకి భక్తులను అనుమతిస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా తెలిపారు. రామనవమి వేడుకలను పురస్కరించుకుని ఆలయ ట్రస్టు ఆధ్వర్యంలో 100 ఎల్ ఈ డీ స్క్రీన్ లను, ప్రభుత్వం 50 ఎల్ ఈడీలను ఏర్పాటు చేస్తున్నాయి. ప్రజలు తాము ఉన్న చోట నుంచే ఈ వేడుకలను వీక్షించవచ్చు.
  4. భక్తుల సౌకర్యం కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు అయోధ్య రేంజ్ ఐజీ ప్రవీణ్ కుమార్ తెలిపారు. అన్ని ప్రాంతాలను జోన్లు, సెక్టార్లుగా విభజించామని, భారీ వాహనాల రాకపోకలకు కూడా ఏర్పాట్లు చేశామని తెలిపారు.
  5. రామ్ లల్లాకు 56 రకాల భోగ్ ప్రసాదాలను సమర్పించనున్నారు.
  6. రూర్కీలోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (CBRI) శాస్త్రవేత్తలు సూర్యుని కదలికల ఆధారంగా, రామ్ లల్లా విగ్రహం నుదుటిపై సూర్య కిరణాలు పడే సూర్యాభిషేక సమయాన్ని నిర్ధారించారు. రామ్ లల్లా సూర్యాభిషేకం అధిక నాణ్యత కలిగిన అద్దాలు, లెన్సులతో కూడిన ఆప్టోమెకానికల్ వ్యవస్థను ఉపయోగించి జరుగుతుందని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది.
  7. 'సూర్యాభిషేకం' విజయవంతం కావడానికి సీబీఆర్ ఐ నిపుణులు ప్రస్తుతం అయోధ్యలో మకాం వేశారు.
  8. అక్టోబర్ 23, 2022 న దీపోత్సవ్ వేడుక కోసం అయోధ్యను సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయంలో జరిగే మాదిరిగానే రామనవమి నాడు సూర్యకిరణాలు నేరుగా రామ్ లల్లా విగ్రహంపై పడే విధంగా రామ మందిరం గర్భగుడిని నిర్మించాలని ట్రస్ట్ సభ్యులకు సూచించారు.
  9. వేసవి కావడంతో ఎండ నుంచి భక్తులను రక్షించేందుకు జన్మభూమి మార్గంలో శాశ్వత పందిరిని, భక్తి మార్గంలో తాత్కాలిక పందిరిని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా, అయోధ్య యంత్రాంగం తేధి బజార్ నుండి నయా ఘాట్ వరకు మేళా ప్రాంతంలో 29 చోట్ల హెల్ప్ బూత్ లను ఏర్పాటు చేసింది.
  10. మంగళ హారతి నుంచి రాత్రి 11 గంటల వరకు కొనసాగే స్వామివారి దర్శన వ్యవధిని 19 గంటలకు పొడిగించారు. నాలుగు భోగాల సమర్పణల సమయంలో కేవలం ఐదు నిమిషాలు మాత్రమే కర్టెన్ ను మూసివేస్తారు.

Whats_app_banner