Sri Rama Navami Special Recipes: శ్రీ రామనవమికి తీయని సాంప్రదాయ వంటకాలు, చూస్తేనే నోరూరిపోతాయి
Sri Ramnavami: శ్రీరామనవమి కుటుంబ సమేతంగా నిర్వహించుకునే పండుగ. ఆ రోజు ఎన్నో తీపి నైవేద్యాలను వండి నివేదిస్తారు. ఇక్కడ కొన్ని సాంప్రదాయ వంటకాలు ఉన్నాయి.
శ్రీరామ నవమి 2024 రెసిపీలు: చైత్ర నవరాత్రుల తొమ్మిదవ రోజున, విష్ణువు ఏడో అవతారంగా చెప్పే శ్రీరాముడి జననాన్ని శ్రీరామ నవమిగా నిర్వహించుకుంటారు. ఈ పర్వదినం సందర్భంగా భక్తులు ఆలయాలను సందర్శించి, ఉపవాసం ఉండి, ఇంట్లోనే ప్రత్యేక పూజలు చేస్తారు. శ్రీరాముడు, సీతామాత ఆశీస్సులు పొందుతారు. ఈ ఏడాది శ్రీరామనవమి పర్వదినాన్ని ఏప్రిల్ 17వ తేదీ బుధవారం నిర్వహించుకుంటున్నాం. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. దక్షిణ భారతదేశంలో పానకం, నీర్ మోర్, కోసంబరి, పాయసం తయారు చేస్తే, ఉత్తర భారతదేశంలో శెనగపిండి లడ్డూ, కొబ్బరి బర్ఫీ, సూజీ హల్వా, కాలే చానే, పూరీలను ప్రత్యేకంగా తయారు చేస్తారు.
పచ్చి బఠానీ ఖీర్ రెసిపీ
కావలసిన పదార్థాలు
పచ్చి బఠానీలు - ఒక కప్పు
పాలు - ఒక లీటరు
యాలకులు - నాలుగు
పంచదార - అర కప్పు
నెయ్యి - రెండు స్పూన్లు
బాదం, పిస్తా, ఎండుద్రాక్ష- గుప్పెడు
తయారీ విధానం
- బఠాణీలను ఉడకబెట్టి మెత్తని పేస్ట్ లా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి.
- స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి.
- అందులో బఠాణీల పేస్టు, పాలు వేసి మరిగించాలి.
- మంటను తక్కువగా ఉంచితే త్వరగా మాడిపోకుండా ఉంటుంది.
- ఈ మిశ్రమం బాగా ఉడికి దగ్గరగా అవుతుంది.
- తర్వాత పంచదార, యాలకుల పొడి వేసి బాగా కలపాలి.
- మరో చిన్న బాణలిలో నెయ్యి వేసి పిస్తా, ఎండుద్రాక్ష, బాదం పప్పులు వేయించాలి.
- వీటిని చల్లార్చి పాయసంలో కలపాలి.
- పాయసాన్ని ఒకసారి కలిపి స్టవ్ కట్టేయాలి. అంతే పచ్చిబఠాణీల ఖీర్ రెడీ అయినట్టే.
- …………………………..
సొరకాయ ఖీర్ రెసిపీ
కావలసిన పదార్థాలు
సొరకాయ తురుము - ఒక కప్పు
పాలు - అర లీటరు
యాలకుల పొడి - ఒక స్పూను
బెల్లం తురుము - అర కప్పు
నెయ్యి - అయిదు స్పూన్లు
బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష- గుప్పెడు
తయారీ విధానం
- సొరకాయ తురుమును శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
- స్టవ్ మీద కళాయి పెట్టి పాలు వేసి మరిగించాలి.
- మరుగుతున్న పాలల్లో సొరకాయ తురుమును వేసి ఉడకించాలి.
- అందులో బెల్లం తురుము వేసి కొన్ని నిమిషాలు ఉడికించాలి.
- యాలకుల పొడి వేసి బాగా కలపాలి.
- చిన్న బాణలిలో నెయ్యి వేసి జీడిపప్పు, ఎండుద్రాక్ష, బాదం పప్పులు వేయించాలి. దీన్ని ఆ పాయసంలో కలపాలి.
- స్టవ్ కట్టేసి ఈ పాయసాన్ని ఫ్రిజ్ లో పెట్టాలి. చల్లగా తింటే టేస్ట్ అదిరిపోతుంది.
- ……………………………
కొబ్బరి లడ్డూ రెసిపీ
కావలసిన పదార్థాలు
కొబ్బరి తురుము - మూడు కప్పులు
కండెన్స్ డ్ మిల్క్ - పావు లీటరు
యాలకుల పొడి - అర స్పూను
నెయ్యి - రెండు స్పూన్లు
తయారీ విధానం
- స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి.
- ఆ నెయ్యిలో కండెన్స్ డ్ మిల్క్ వేసి మీడియం మంట మీద వేసి కలపాలి.
- ఈ మిశ్రమం కళాయికి అంటుకోకుండా బాగా కలపాలి.
- స్టవ్ ఆఫ్ చేసి యాలకుల పొడి వేసి కలపాలి.
- గది ఉష్ణోగ్రతకు అది చల్లబడ్డాక, కొంత మిశ్రమాన్ని తీసుకుని చేతులతో లడ్డూలా చుట్టుకోవాలి.
- అంతే తీయని కొబ్బరి లడ్డూ రెడీ అయినట్టే.
టాపిక్