Komuravelli mallanna jatara: కొమురవెల్లి మల్లన జాతర.. ఈ జాతర విశిష్టత ఏంటి?
25 January 2024, 18:00 IST
- Komuravelli mallanna jatara: కొమురవెల్లి మల్లన్న స్వామి జాతర మూడు నెలల పాటు సాగుతూ భక్తుల సందర్శనతో కిటకిటలాడుతుంది.
కొమురవెల్లి మల్లన్న జాతర
Komuravelli mallanna jatara: ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటి సిద్ధిపేట జిల్లా కొమురవెల్లిలో వెలిసిన శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం. కోరమీసాల మల్లన్నగా ప్రసిద్ధి. ఇక్కడ ఏటా సంక్రాంతి నుంచి మల్లన్న బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మూడు నెలల పాటు సాగే ఈ జాతరలో లక్షలాది మంది భక్తులు మల్లన్న స్వామిని దర్శించుకుంటారు.
లేటెస్ట్ ఫోటోలు
సంక్రాంతి రోజు ప్రారంభమైన ఈ జాతర వేడుకలు ఉగాది వరకు జరుగుతాయి. ప్రతి ఆదివారం, బుధవారాల్లో ఈ జాతర జరుగుతుంది. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలి రావడంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా ఉంటుంది. భక్తులు కొండపై ఉన్న మల్లన్నకి తోబుట్టువుగా రేణుకా ఎల్లమ్మకు బోనాలు సమర్పిస్తారు. ఆలయానికి వచ్చే భక్తులు మట్టి పాత్రల్లో నైవేద్యం వండి తీసుకొచ్చి మల్లన్నకి సమర్పిస్తారు.
మల్లన్న జాతర ప్రత్యేకతలు
ఈ జాతరలో ఎక్కువ యాదవ భక్తులు సందర్శిస్తారు. ఈ జాతరలో బోనం, పట్నం అనే వాటికి ఎక్కువ ప్రాధన్యత ఇస్తారు. బోనం అంటే కొత్త మట్టి కుండలో నైవేద్యం వండుకుని స్వామివారికి నివేదించడం కోసం తీసుకొస్తారు. పట్నం వేడుక చేసేందుకు భక్తులు ఎక్కువగా పసుపు తీసుకొస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులందరూ పసుపులో తడిసి ముద్దవుతారు. అందరూ ఒకరిమీద మరొకరు పసుపు చల్లుకుంటూ కనిపిస్తారు.
జాతరలో పట్నం వేసేందుకు పసుపు, కుంకుమ, బియ్యపు పిండి, తంగేడు ఆకులతో చేసిన పచ్చరంగు పొడి తీసుకొస్తారు. ఆలయం సమీపంలో రంగు రంగుల ముగ్గులు వేస్తారు. ఢమరుకం వాయిస్తూ బోనాలు సమర్పిస్తారు. సంప్రదాయ, జానపద కీర్తనలు ఆలపిస్తూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. కన్నుల పండుగగా జరిగే ఈ జాతర తిలకించేందుకు భక్తులు దూర ప్రాంతాల నుంచి వస్తారు.
ఒగ్గు కళాకారులు ప్రత్యేక ఆకర్షణ
జాతరలో స్వామి వారిని కీర్తిస్తూ పాటలు పాడే వారిని ఒగ్గు పూజారులుగా పిలుస్తారు. పెద్ద పెద్ద ముగ్గులు వేసి వాటి మధ్య నిలబడి స్వామి వారిని కీర్తిస్తూ ఢమరుకం వాయిస్తూ పాటలు పాడతారు. ఒగ్గు కళాకారులు ఈ జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. ఇక్కడికి వందల సంఖ్యలో ఒగ్గు కళాకారులు వస్తారు.
అగ్ని గుండం
జాతరలో మరొక కీలక ఘట్టం అగ్ని గుండం. కణకణ మండే ఎర్రటి నిప్పుల మీద భక్తులు నడుస్తారు. ఆలయ పరిసరాల్లో అగ్నిగుండాలు ఏర్పాటు చేస్తారు. దీని కోసం కొన్ని క్వింటాళ్ల కర్రలు ఉపయోగిస్తారు. కొంతమంది భక్తులు ఈ అగ్ని గుండం కోసం కర్రలు విరాళంగా ఇస్తారు. స్వామి వారి ప్రతిమలు పట్టుకుని భక్తులు నిప్పుల గుండం దాటి వెళతారు. ఇలా మూడు సార్లు చేస్తారు. మనసులో కోరిక కోరుకుని ఇలా చేస్తే నెరవేరుతుందని నమ్ముతారు. అలాగే భక్తుల కోరిక నెరవేరినందుకు గాను స్వామి వారికి మొక్కలు చెల్లించుకునేందుకు అగ్ని గుండం మీద నడుస్తారు.
కొమురవెల్లి చరిత్ర
పురాణాల ప్రకారం పూర్వం ఇక్కడ కుమార స్వామి కొంతకాలం పాటు తపస్సు చేశాడని అందుకే ఈ ప్రాంతానికి కొమురవెల్లి అనే పేరు వచ్చిందని చెప్తారు. శివుడు తన పరమ భక్తుల పుత్రుడుగా జన్మించి తన మహిమలతో భక్తులని కాపాదారాని క్షేత్ర పురాణం చెబుతోంది. కొమురవెల్లి మల్లన్నగా మల్లికార్జున స్వామి ఇక్కడ కొలువు దీరాడని భక్తులు విశ్వసిస్తారు.