Bonalu History: బోనం గిప్పటిది కాదు.. వందల ఏండ్లసంది ఉన్నది.. ఇగో సదువుర్రి
Bonalu History : ఆషాడ మాసం అచ్చింది.. ఇగ బోనం ఎత్తుడు మెుదలైంది. పట్నంల గోల్కొండ బోనం షురూ అయింది. గిదంతా సరే.. అసలు బోనం ఎప్పుడు మెుదలుపెట్టిండ్రు? ఎందుకు మెుదలుపెట్టిండ్రు? గిసొంటి ముచ్చట్లు జర తెలుసుకుందాం..
తెలంగాణ అస్తిత్వం బోనం. బోనం ఎత్తితే ఊరూవాడకు సంబురం. గిప్పుడంటే.. బోనం పట్నంల బాగా ఫేమస్ అయింది గానీ.. ఒకప్పుడు ఊర్లళ్ల గూడా బోనాల పండుగ మస్తు చేసేటోళ్లు. భాగ్యనగరంల నాలుగు వారాల పాటు బోనాలు జురుగుతయి. ఆ ముచ్చట ఏందో ఓసారి సూద్దాం.
తెలంగాణ సర్కార్ బోనాల పండుగను చేత్తంది. ఈ బోనాల పండగలో మెుదాటి బోనం గోల్కొండ కాడనే ఎత్తుతరు. ఆ తర్వాత ఇగ అంతటా.. ఎత్తుతరు. ఆషాడ మాసంల తొలి బోనం గురువారం లేదా ఆదివారం ఎత్తుతరు. మస్తుగా సంబరాలు జేస్తరు. దీని ఎనక పెద్ద చరిత్రే ఉన్నది. ఏటా.. పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, బాలమ్మ, ముత్యాలమ్మ, మహంకాళమ్మ, పెద్దమ్మ ఇలా ఏడుగురు అక్కాచెల్లెళ్ల దేవాలయాలను బాగా అలంకరిస్తరు.
ముందుగాల గోల్కొండలో జగదాంబిక అమ్మవారి కాడ బోనం ఎత్తుతరు. ఆ తర్వాత.. ఇగ మిగిలిన గుళ్లలో కూడా మెుదలైతది. బోనం అంటే భోజనం అని అర్థమత్తది. అమ్మ వారికి సమర్పించే.. నైవేద్యాన్ని బోనం అంటరు. ఇదేదో గిప్పుడు మెుదలైన ముచ్చట కాదు.. వెయ్యేండ్లసంది జరుపుతున్నరు. కాకతీయ రాజులలో ఒకరైన ప్రతాప రుద్రుడు గోల్కొండలోని జగదాంబిక ఆలయంల.. బోనాల సమయంలో ప్రత్యేక పూజలు చేసిండట. చరిత్ర చెబుతున్న ముచ్చట గిది. అటెనక అచ్చిన నవాబులు సూత ఈ సంప్రదాయాన్ని కొనసాగించిండ్రు. తొలి బోనం ఈడ మెుదలైతే.. రెండో వారం బల్కంపేట కాడ షూరు అయితది. ఇక మూడో వారం సికింద్రాబాదు కాడ.. ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఎత్తుతరు.
సికింద్రాబాదు.. ఉజ్జయిని మహంకాళి ఆలయానికి గూడా మస్తు చరిత్ర ఉన్నది. బ్రిటీష్ పాలన కాలంల.. ఈడ సురటి అప్పయ్య అనేటాయన.. ఆంగ్లేయుల దగ్గర పనిచేసేటోడు. పని మీద 1813ల మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి బదిలీ అయిపోయిండు. ఆ సమయంల ఈడ భాగ్యనగరంల.. ఓ వ్యాధి వచ్చిందట. అది తగ్గించమని ఉజ్జయినిని అమ్మవారిని కోరుకున్నాడట. వ్యాధి తగ్గినాక.. అచ్చి.. సికింద్రాబాదు కాడ.. ఉజ్జయిని గుడి కట్టించిడట. గప్పటిసంది.. ఆషాడంల బోనాల సంబరాలు మస్తుగా జేస్తరు.
ఆషాడంల అమ్మవారు పుట్టింటికి వస్తరని చాలా మంది నమ్మకం. గందుకోసమే.. తమ బిడ్డ ఇంటికి అచ్చిందనుకొని.. అమ్మవార్లకు బోనం సమర్పిస్తరు. దీని ఎనకాల సైన్స్ కూడా ఉన్నది. వాన కాలం అంటే రోగాల కాలం. ఎసొంటి రోగం రాకుండా.. మా పొరగళ్లను సల్లంగా సూడు తల్లి అని.. బోనం సమర్పిస్తరు. బోనంలో మట్టి కుండకు చుట్టూ పసుపు రాసి, వేప ఆకులు కడతరు. ఇట్లా జేస్తే.. బ్యాక్టీరియా, వైరసులు నాశనమైతయి. ఆరోగ్యం మంచిగా ఉంటది.
బోనాల పండ అంటే.. ముందుగా యాదికొచ్చేది.. పోతురాజు కూడా. పురాణాల ప్రకారం.. ఏడుగురు అక్కాచెళ్లెళ్లయిన అమ్మవార్ల తమ్ముడే.. పోతురాజు అంటారు మరి. ఇట్లా బోనాలకు మస్తు చరిత్ర ఉన్నది.. తెలంగాణ బోనాలు అంటే మస్తు ఫేమస్.