ఆషాడ బోనాల పండుగ అంటే.. గ్రామదేవత అమ్మవారిని పూజించే.. పండుగ. బోనం అంటే భోజనం అని అర్థం. దీనిని కొత్తకుండలో వండి ప్రదర్శనగా వెళ్లి గ్రామదేవతలకు భక్తితో సమర్పిస్తారు. చిన్నముంతలో పానకం పోస్తారు. దానిపై దివ్వె పెట్టి.. బోనంపై జ్యోతిని వెలిగించి.. జాతరను కన్నుల పండుగగా నిర్వహిస్తారు. వేటపోతు మెడలో వేప మండలు కట్టి.. పసుపు కలిపిన నీరు, వైప ఆకులను చల్లుకుంటూ భక్తులు ఊరేగింపుగా గ్రామదేవతల ఆలయాలకు వెళ్లి బోనాలు సమర్పిస్తారు.
ఇట్లా బోనాలు సమర్పిస్తే.. దేవతలు శాంతించి.. అంటు వ్యాధులు రాకుండా కాపాడుతారని భక్తుల నమ్మకం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ బోనాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. మహిళలు వండిన అన్నంతోపాటుగా పాలు, పెరుగు, బెల్లంతో కూడిన బోనాన్ని మట్టి, ఇత్తడి లేదంటే.. రాగి కుండలలో తమ తలపై పెట్టుకుని డప్పు చప్పుళ్లతో వెళ్తారు. ఈ బోనాల కుండలకు చిన్న వేప రెమ్మలతోపాటుగా పసుపు, కుంకుమ, బియ్యం పిండి ముగ్గుతో అలంకరించి.. దానిపై ఓ దీపం పెడతారు. గ్రామ దేవతల గుళ్లను అందంగా అలంకరిస్తారు.
ఆషాడ మాసంలో దేవి పుట్టింటికి వెళ్తుందని నమ్మకం. అందుకకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని, తమ సొంత కుమార్తె ఇంటికి వచ్చిన భావనతో భక్తి శ్రద్ధలతో బోనాలను సమర్పిస్తారు. బోనాల సందర్భంగా పొట్టేళ్ల రథంపై అమ్మవారిని ఊరేగింపు చేసేవారు. పూర్వకాలంలో ఈ పండుగ రోజున దుష్ట శక్తులను పారద్రోలేందుకు ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలి ఇచ్చేవారు. తర్వాత మేకలు, కోళ్లను బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది.
ఈ పండగ రోజున స్త్రీలు పట్టుచీరలు, నగలు ధరిస్తారు. పూనకం వచ్చిన స్త్రీలు.. తలపై బోనం మోస్తూనే.. డప్పు చప్పుళ్లకు అనుగుణంగా దేవిని స్మరిస్తూ.. నర్తిస్తారు. బోనాలను మోసుకెళ్లే మహిళలను అమ్మవారు ఆవహిస్తారని నమ్మకం. బోనాల పండుగ గోల్కొండ కోటలో మెుదలై.. సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి, బల్కంపేట్ ఎల్లమ్మ, మీదుగా ఓల్డ్ సిటీ ప్రాంతానికి చేరుకుంటుంది.
అమ్మవార్ల సోదరుడైన పోతురాజు.. వేషంలో ఉండే వ్యక్తి బోనాల సందర్భంగా ముందు ఉండి నడిపిస్తాడు. పోతురాజు గంభీరంగా బలశాలిగా ఉంటాడు. ఒంటిపై పసుపు, నుదుటిపై కుంకుమ, కాలికి గజ్జెలు కలిగి చిన్న ఎర్రని ధోతీని ధరించి.. డప్పు వాయిద్యానికి అనుగుణంగా ఆడతాడు.