Nellore Cheating: నెల్లూరులో పెళ్లి పేరుతో మోసం.. సహజీవనం చేసి డబ్బుతో ఉడాయించాడు
Nellore Cheating: నెల్లూరు జిల్లాలో పెళ్లిపేరుతో యువతిని మోసం చేసి డబ్బుతో ఉడాయించిన ఘటన చోటు చేసుకుంది. భార్యతో విడాకులు తీసుకున్నానని, పెళ్లి చేసుకుంటానని మహిళలను నమ్మించి ఒక వ్యక్తి సహజీవనం చేశాడు. ఆమె వద్దనున్న మూడు లక్షల రూపాయిలు తీసుకుని ఖర్చు చేసి అనంతరం పరారయ్యాడు.
Nellore Cheating: పెళ్లి పేరుతో యువతిని మోసం ఆమె డబ్బులు మొత్తం వాడేసుకుని పరారైన ఘటన నెల్లూరులో వెలుగు చూసింది. బాధితురాల నుంచి లక్షలు కాజేసి రెండు నెలలుగా కనిపించటం లేదు. ఆరా తీస్తే ఆయన తన భార్యతో ఉంటున్నాడని తెలిసింది. దీంతో బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు.
ఈ ఘటన నెల్లూరు పట్టణంలోని చిన్నబజారు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నెల్లూరు పట్టణంలోని ఖుద్దాస్ నగర్‌కు చెందిన ఓ మహిళలకు 2015లో హుమయూన్ అనే వ్యక్తితో వివాహం అయింది. విభేదాల కారణంగా భార్యాభర్తలు విడిపోయారు. భర్త నుంచి విడాకులు తీసుకుని ఒంటరిగానే మహిళ ఉంటోంది. ఈ క్రమంలో ఆమెకు ఫయాజ్ అనే మరో వ్యక్తి పరిచయం అయ్యాడు. అయితే ఫయాజ్‌కు అప్పటికే వివాహం అయింది. తనకు వివాహం అయిందని, భార్య నుంచి విడాకులు తీసుకుని ఒంటరిగానే ఉంటున్నానని ఆమెను నమ్మించాడు.
ఇద్దరి పరిస్థితి ఒకటేనని ఆ మహిళ నమ్మింది. దీంతో ఇద్దరూ కొంతకాలంగా సహ జీవనం చేస్తున్నారు. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉండే వారు. ఈ క్రమంలో మహిళ వద్ద మూడు లక్షల రూపాయిలు తీసుకుని ఖర్చు చేసేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారు అయ్యాడు. రెండు నెలలుగా ఫయాజ్ కనిపించడం లేదు. దీంతో బాధిత మహిళ ఆయన గురించి ఆరా తీసింది. ఎక్కడున్నాడని తెలిసిన వారినంతా అడిగింది. చివరికి ఆయన ఎక్కడున్నాడో తెలుసుకుంది. ఫయాజ్ తన భార్యతో ఉంటున్నాడు. ఆ విషయం తెలుసుకున్న ఈ మహిళ తీవ్ర మనోవేదనకు గురైంది.
బాధిత మహిళ మంగళవారం నెల్లూరు పట్టణంలోని చిన్నబజారు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. భార్యతో ఉంటూనే విడాకులు తీసుకున్నానని ఫయాజ్ తనను నమ్మించి మోసగించాడని, అంతేకాకుండా నా వద్ద నున్న డబ్బులను కాజేసిన ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిన్నబజారు పోలీస్ స్టేషన్ ఎస్ఐ అయ్యప్ప కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
కర్నూలు జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యార్థినీపై లెక్చరర్ లైగింక వేధింపులు
కర్నూలు జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యార్థినీపై లెక్చరర్ లైగింక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆయనపైన పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. కర్నూలు జిల్లా కోడుమూరులోని ఓ ప్రైవేటు కాలేజీలో కంప్యూటర్ లెక్చరర్‌గా భాస్కర్ అనే వ్యక్తి విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఇంటర్మీడియట్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అంతేకాకుండా ఆమె ఇబ్బందులకు గురి చేశాడు. తనను కంప్యూటర్ లెక్చరర్ భాస్కర్ లైంగికంగా వేధించాడని ఆ విద్యార్థినీ తన స్నేహితులకు చెప్పింది. బాధితురాలి స్నేహితులు మంగళవారం విద్యార్థి సంఘాల దృష్టికి తీసుకెళ్లారు.
రంగంలోకి దిగిన విద్యార్థి సంఘాలు కళాశాల వద్దే ఆందోళన చేపట్టాయి. లెక్చరర్‌ను విధుల నుంచి తొలగించాలని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. అనంతరం విద్యార్థినులతో కలిసి ర్యాలీగా వెళ్లి ఆర్‌టీసీ బస్టాండ్ సర్కిల్‌లో ఆందోళన చేపట్టారు. నిందితుడు భాస్కర్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీంతో బాధిత విద్యార్థినీతో కలిసి విద్యార్థి సంఘ నేతలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కోడుమూరు ఎస్ఐ ఏపీ శ్రీనివాసులు కాలేజీకి వెళ్లి విద్యార్థులను, సిబ్బందిని విచారించారు. అనంతరం కంప్యూటర్ లెక్చరర్ భాస్కర్‌పై ఎస్ఐ ఏపీ శ్రీనివాసులు పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేశామని, కేసు దర్యాప్తు చేస్తామని ఎస్ఐ తెలిపారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)