Food Delivery: ఏడాదిలో ప్రతి నిమిషానికి 158 ఆన్‌లైన్ ఆర్డర్లు అందుకున్న వంటకం ఇదే, వేటిని భారతీయుల అధికంగా తిన్నారంటే...
స్విగ్గి, జొమోటో వంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లు వచ్చాక ఆహారాన్ని ఆర్డర్ చేయడం ఎక్కువైపోయింది. గత ఏడాది అధికంగా ఆర్డర్ చేసిన వంటకాల జాబితాలో మళ్ళీ బిర్యాని మొదటి స్థానంలో నిలిచింది.
ఆన్లైన్ ఆహారాన్ని ఆర్డర్ చేయడం అనేది జీవితాలను చాలా సులభతరం చేసింది. వండే ఓపిక లేకపోతే చాలు అరగంటలో ఆహారాన్ని ఆర్డర్ చేసుకుని తినేయవచ్చు కూడా. పొడవైన క్యూలో రెస్టారెంట్ ముందు నిల్చుని ఆర్డర్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇంటికే ఆహారం సమయానికి చేరుకుంటుంది. జొమోటో వంటి ఆన్లైన్ ప్లాట్ ఫామ్‌లో అధికంగానే ఆర్డర్లను అందుకుంటున్నాయి. 2024లో అత్యధికంగా ఆర్డర్ చేసిన ఆహారాలపై స్విగ్గీ ఒక నివేదికను విడుదల చేసింది. ఈ ఏడాది కూడా బిర్యానీ మొదటి స్థానంలో నిలిచింది. స్విగ్గీ డెలివరీ యాప్‌లో ఈ సంవత్సరం బిర్యానీ ఆర్డర్లు 83 మిలియన్లు వచ్చినట్టు ఈ నివేదిక చెబుతుంది. అంటే ఎనిమిది కోట్లకు పైమాటే. లెక్క వేసుకుంటే నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్ చేసినట్టు లెక్క. వరుసగా తొమ్మిదో సంవత్సరం కూడా బిర్యానీనే మొదటి స్థానంలో నిలిచింది.
రెండో స్థానంలో దోశ
బిర్యానీ తర్వాత దోశ 23 మిలియన్ల ఆర్డర్లతో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. స్విగ్గిలో బిర్యానీ తర్వాత దోశనే అధికంగా ఆర్డర్ పెట్టారు. కేవలం ఒక్క బెంగళూరులోనే పాతిక లక్షల మసాలా దోశలను ఆర్డర్ పెట్టినట్టు నివేదిక చెబుతోంది. ఇక ఢిల్లీ, చండీగఢ్, కోల్ కతా వంటి నగరాల్లో చోలే, ఆలూ పరాటా, కచోరీలు వంటివి కూడా ఎక్కువగా ఆర్డర్లు వచ్చాయి.
బెంగళూరులో ఈ ఏడాది ఒక వినియోగదారుడు ఏకంగా ఒకేసారి 49,900 రూపాయలు ఖర్చుపెట్టి ఆర్డర్ చేశారు. ఆయన ఆర్డర్ చేసిన వాటిలో ఎన్నో రకాల ఆహారాలు ఉన్నాయి.
టాప్‌లో చికెన్ రోల్
ఇక స్నాక్స్ విషయానికి వస్తే 2024లో చికెన్ రోల్ 24 లక్షలకు పైగా ఆర్డర్ చేసిన స్నాక్ గా అవతరించింది. 16 లక్షలకు పైగా ఆర్డర్లతో మోమోస్ రెండో స్థానంలో ఉండగా, ఫ్రెంచ్ ఫ్రైస్ 1.3 మిలియన్ ఆర్డర్లతో మూడో స్థానంలో నిలిచింది. అర్థరాత్రి ఎక్కువ మంది చికెన్ బర్గర్‌ను ఆర్డర్ ఇచ్చినట్టు స్విగ్గీ తెలిపింది. ముఖ్యంగా అర్ధరాత్రి 12 నుంచి రెండు గంటల మధ్య చికెన్ బర్గర్లు పద్దెనిమిదన్నర లక్షలకు పైగా ఆర్డర్లు వచ్చినట్టు నివేదిక చెబుతోంది.
ఇది కేవలం స్విగ్గిలో వచ్చిన ఆర్డర్లు మాత్రమే. ఇక జొమాటో కూడా ఇలాగే నివేదికను బయట పెడితే అందులో కూడా అధికంగానే ఆర్డర్లు ఉండే అవకాశం ఉంది. జొమాటోలో కూడా దాదాపు బిర్యానీనే మొదటి స్థానంలో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే బిర్యానీకి దేశ వ్యాప్తంగా అభిమానులు ఎక్కువ. బిర్యానీలో రకరకాల వంటకాలు లభిస్తాయి. వెజ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల బిర్యానీలు ఉన్నాయి. కాబట్టి బిర్యానీ ఆర్డర్లే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
సంబంధిత కథనం
టాపిక్