తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Varalakshmi Vratam: వరలక్ష్మీ వ్రతం కోసం కలశ స్థాపన చేసే విధానం.. సింపుల్ గా పూజ చేసుకునే పద్ధతి ఇదే

Varalakshmi vratam: వరలక్ష్మీ వ్రతం కోసం కలశ స్థాపన చేసే విధానం.. సింపుల్ గా పూజ చేసుకునే పద్ధతి ఇదే

HT Telugu Desk HT Telugu

15 August 2024, 8:00 IST

google News
    • Varalakshmi vratam: వరలక్ష్మీ వ్రతం చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే కలశ స్థాపన ఎలా చేయాలి.. సింపుల్ గా పూజ చేసుకునే పద్ధతి గురించి పంచాంగకర్త ఆధ్యాత్మిక వేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు. 
వరలక్ష్మీ వ్రతం సింపుల్ గా చేసుకునే పద్ధతి
వరలక్ష్మీ వ్రతం సింపుల్ గా చేసుకునే పద్ధతి (pinterest)

వరలక్ష్మీ వ్రతం సింపుల్ గా చేసుకునే పద్ధతి

Varalakshmi vratam: శ్రీ మ‌హాల‌క్ష్మిని పూజించ‌డానికి శ్రావ‌ణ మాసం ప‌ర‌మ పవిత్ర‌మైన మాస‌మ‌ని ప్ర‌ముఖ ఆధ్యాత్మిక వేత్త‌, పంచాంగ క‌ర్త చిల‌క‌మ‌ర్తి ప్ర‌భాక‌ర చ‌క్ర‌వ‌ర్తి శ‌ర్మ తెలిపారు. ఈ మాసంలో వ‌చ్చే రెండో శుక్ర‌వారానికి ఎంతో విశిష్ట‌త ఉంద‌ని చిల‌క‌మ‌ర్తి తెలిపారు. ఆ రోజున చేసే వ‌ర‌ల‌క్ష్మి వ్ర‌తానికి ఎంతో మ‌హ‌త్యం ఉంద‌ని.. ఆరోజు వ్ర‌తం ఆచ‌రించి మహిళ‌లు స‌త్ఫ‌లితాలు పొంద‌వ‌చ్చ‌ని చిల‌క‌మ‌ర్తి తెలిపారు.

అన్ని సౌభాగ్యాల్ని (లక్ష్మిని) అందించే అమ్మ‌వారు వరలక్ష్మీ దేవి. వర అంటే కోరుకున్నది, శ్రేష్ఠమైంది అని అర్థాలు. ఈ అర్థాలను అన్వయం చేస్తే కోరిన కోర్కెలు లేదా శ్రేష్టమైన కోర్కెలు ఇచ్చే తల్లిగా వరలక్ష్మీ దేవిని భావించవచ్చు. ఈ దేవిని సక్రమంగా, భక్తిభావనతో కొలిచే వ్రతమే 'వరలక్ష్మీ వ్రతం'.

స్వయంగా పరమేశ్వరుడే పార్వతికి ఈ వ్రతం గురించి చెప్పాడు. మహా భక్తురాలైన చారుమతీ దేవి వృత్తాంతాన్ని కూడా పరమేశ్వరుడు పార్వతికి వివరించాడు. చారుమతి ఉత్తమ ఇల్లాలు. మహాలక్ష్మీ దేవి పట్ల ఎంతో భక్తిశ్రద్ధలు కలిగిన చారుమతి అమ్మ వారిని త్రికరణశుద్ధిగా పూజిస్తుండేది. ఆమె పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరించింది.

శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు అభయమిస్తుంది. అమ్మ ఆదేశాను సారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించిన చారుమతి సమస్త సిరి సంపదల్ని వరలక్ష్మీ వ్రత ప్రసాదంగా అందుకుంటుంది.

శ్రావణ మాసంలో శ్రవణా నక్షత్రం రోజున పూర్ణిమ వస్తుంది. శ్రవణం శ్రీనివాసుడి జన్మనక్షత్రం. పూర్ణిమ రోజున అమ్మ వారు షోడశ కళలతో వెలుగొందుతుంది. శుక్రవారం అమ్మకు ప్రీతి పాత్రమైన వారం. ఈవిధంగా చూస్తే లక్ష్మీ శ్రీనివాసులు వైభవం అనంతంగా ప్రకాశించే పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం చెయ్యటం లక్ష్మీశ్రీనివాసుల అనుగ్రహానికి తొలిసోపానంగా చెప్పుకోవచ్చు. సకల సౌభాగ్యాలు కలగాలని, నిత్య సుమంగళిగా తాము జీవితకాలం ఉండాలని కోరుకుంటూ మహిళలు ఈ వ్రతాన్ని ఆచరిస్తార‌ని ఆధ్యాత్మిక వేత్త చిల‌క‌మ‌ర్తి తెలిపారు. అయితే ఈ వ్ర‌తాచ‌ర‌ణ‌కు కొన్ని నియ‌మాలున్నాయ‌ని చిల‌క‌మ‌ర్తి తెలిపారు.

కలశ స్థాపన ఇలా చేయండి

కలశం కోసం తెచ్చుకున్న పాత్రను శుభ్రంగా కడిగి, పసుపు, కుంకుమలతో అలంకరించాలి. వ్రతానికి ఎంపిక చేసుకున్న స్థలాన్ని శుభ్రం చేసుకుని, పీటవేసి, దానిమీద నూతన వస్త్రం వేసి, దానిపై బియ్యంపోసి వేదికను సిద్ధం చేయాలి. వేదికను పూలు, చందనం, పరిమళద్రవ్యాలు చల్లి శోభాయమానంగా చేసుకోవాలి. ఆ తర్వాత కలశాన్ని దానిపై అమర్చాలి. దానికి తాంబూలం సమర్పించి ఆరాధించాలి.

కలశంలో నీరు పోసి మామిడాకులు లేదా తమలపాకులు కాని అందులో వేయాలి. ఆకులు ఏవైనా అవి నిటారుగా నిలిచేటట్టు చూచుకోవాలి. దాని మీద కొబ్బరికాయ నుంచి దానికి రవికె గుడ్డను వస్త్రంగా చుట్టాలి. కొబ్బరికి ముఖస్వరూపం వచ్చేలా కళ్లు, ముక్కు, పెదవులు, కనుబొమ్మలు అమరేలా దిద్దవచ్చు లేదా అమ్మవారి రూపును దానికి తగిలించి ఆకారం ఏర్పరచవచ్చు. దానికి తమకు తోచిన నగలు వగైరాలు అలంకరించవచ్చు.

వ్రతతోరాన్ని ఐదుపొరలుగా తీసుకుని దానికి పసుపు రాయాలి. దానికి మధ్యలో మామిడాకునుకాని, తమలపాకును కాని పెట్టి ముడివేయాలి. దీన్ని అమ్మవారి సమక్షంలో ఉంచి పూజించాక చేతికి మణికట్టు దగ్గర ధరించాలి. దీన్ని మొదటి శుక్రవారం కట్టుకుంటే నెలంతా ఉంచుకుని అమ్మవారి పూజ నెలరోజులూ జరుపుకోవాలి లేదా వరలక్ష్మీ వ్రతం నాడు కట్టుకుని కలశానికి ఉద్వాసన పలికిన తర్వాత తీసేయొచ్చు. ఇంటి ఆచారాలను బట్టి పూజావిధానంలో మార్పులు ఉండొచ్చు.

అమ్మవారికి పూజలో ప్రసాదంగా చక్కరపొంగలి కానీ పాయసం కాని నివేదన చెయ్యాలి. పాయసం దేనితో తయారు చేసినా దోషం కాదు. పూజలో వినియోగించిన బియ్యాన్ని మర్నాడు అన్నం వండి దేవతామందిరంలో ఇలువేలుపుకు ప్రసాదంగా సమర్పించి స్వీకరించాలి. కలశంలో ఉంచిన కొబ్బరికాయను మరుసటిరోజున మనం రోజూ పూజించే దేవుడికి నివేదన చేసి కొట్టి ప్రసాదంగా చేసుకుని అందరూ తీసుకోవాలి. కలశంలో ఉన్న జలాన్ని కుటుంబసభ్యులందరూ తీర్థంగా తీసుకోవాలి. శిరస్సు మీద చల్లుకోవచ్చు.

ఏదైనా అవాంతరం వల్ల శ్రావణ శుక్రవారం రోజున వ్రతం చేసు కోవటం సాధ్యపడకపోతే తర్వాతి వారం చేసుకోవచ్చు. ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేద‌ని చిల‌క‌మ‌ర్తి తెలిపారు. వరలక్ష్మీ వ్ర‌తానికి సంబంధించి ఒక సామాజిక సందేశం ఉంద‌ని చిల‌క‌మ‌ర్తి తెలిపారు. చారుమతికి శ్రీవరలక్ష్మీ దేవి కలలో కనిపించి తనను పూజించమని, సకల ఐశ్వర్యాలనూ ఇస్తానని చెప్పింది. చారుమతి ఆ వ్రతాన్ని స్వార్థబుద్ధితో తానొక్కతే చెయ్యలేదు. తనతోపాటు తనవారు, తన చుట్టుపక్కల ఉన్న కుటుంబాల స్త్రీలంతా వరలక్ష్మీదేవి కటాక్షానికి పాత్రులు కావాలని అందరినీ కలుపుకుని వ్రతం చేసింది. స్త్రీలు ఇలా అందరినీ కలుపుకొని సామరస్య ధోరణిలో, నిస్వార్థబుద్ధితో ఉండాల‌నేది ఈ క‌థ‌లోని సారాంశ‌మ‌ని చిల‌క‌మ‌ర్తి తెలిపారు.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
తదుపరి వ్యాసం