Varalaksmi Vratham Recipes: వరలక్ష్మీ వ్రతానికి ఒక గంటలో తొమ్మిది రకాల ప్రసాదాలు ఇలా సులువుగా చేసేయండి, రెసిపీలు ఇదిగో-here are the recipes to make nine types of prasads for varalakshmi vratham easily in one hour ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Varalaksmi Vratham Recipes: వరలక్ష్మీ వ్రతానికి ఒక గంటలో తొమ్మిది రకాల ప్రసాదాలు ఇలా సులువుగా చేసేయండి, రెసిపీలు ఇదిగో

Varalaksmi Vratham Recipes: వరలక్ష్మీ వ్రతానికి ఒక గంటలో తొమ్మిది రకాల ప్రసాదాలు ఇలా సులువుగా చేసేయండి, రెసిపీలు ఇదిగో

Haritha Chappa HT Telugu
Aug 14, 2024 11:30 AM IST

Varalaksmi Vratham Recipes: వరలక్ష్మీ వ్రతానికి అమ్మవారికి సమర్పించేందుకు ఒక గంటలో తొమ్మిది నైవేద్యాలు సులువుగా ఎలా చేయాలో ఇక్కడ చెప్పుము. ఇక్కడ చెప్పినట్టు ప్లాన్ చేసుకుంటే చాలా త్వరగా ఈ ప్రసాదాలను వండేయచ్చు.

వరలక్ష్మీ వ్రతం సింపుల్ రెసిపీలు
వరలక్ష్మీ వ్రతం సింపుల్ రెసిపీలు

Varalaksmi Vratham Recipes: హిందూ మహిళలకు వరలక్ష్మీ వ్రతం ఎంతో ప్రధానమైన పండుగ. శ్రావణమాసంలో శుక్ల పక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే పండుగ ఇది. వరలక్ష్మీ మాత విష్ణుమూర్తి భార్య. ఆమెను పూజించడం ద్వారా విష్ణు మూర్తిని కూడా ప్రసన్నం చేసుకోవచ్చు. శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మీ అమ్మవారిని పూజిస్తే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు దక్కుతాయి. వరలక్ష్మీ వ్రతం రోజు నైవేద్యాలు అతి తక్కువ సమయంలో ఎక్కువ వండాలనుకుంటే ఇక్కడ మేమిచ్చిన ప్లాన్ ఫాలో అయిపోయింది. తొమ్మిది రకాల నైవేద్యాలను చాలా సింపుల్ గా తక్కువ సమయంలోనే చేసేయచ్చు.

ముందు రోజు రాత్రి ఇలా చేయండి...

వరలక్ష్మీ వ్రతానికి ముందురోజే కొన్ని రకాల పప్పులను నానబెట్టుకోవాలి. పూర్ణం బూరెల కోసం ఒక గిన్నెలో ఒక కప్పు మినపప్పు, ఒకటిన్నర కప్పు బియ్యం వేసి నానబెట్టుకోవాలి. మరొక గిన్నెల కొమ్ము శెనగలను వేసి నానబట్టాలి. గారెల కోసం మినపప్పును కూడా నానబెట్టుకుని ఉంచాలి. మూడు నాలుగు రకాల పండ్లను కొని ఇంట్లో పెట్టుకోవాలి.

తెల్ల అన్నం వండి రెడీగా...

మరుసటి రోజు ఉదయం లేచాక అన్నం వండి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మనం చేసే తొమ్మిది నైవేద్యాలలో మూడు అన్నంతో చేసేవే. కాబట్టి మూడు నైవేద్యాలకు సరిపడా తెల్ల అన్నాన్ని వండేసుకోవాలి. అలాగే శెనగపప్పును కూడా బూరెల కోసం కుక్కర్లో ఉడికించుకుని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు తొమ్మిది నైవేద్యాలు చేయడానికి సిద్ధమవ్వాలి.

మొదటి నైవేద్యం: పులిహోర

1. చింతపండును వేడినీళ్లలో వేసి నానబెట్టుకోవాలి. ఆ చింతపండును బాగా పిండి రసాన్ని వేరు చేసుకోవాలి.

2. ఆ రసంలోనే కరివేపాకులు, పావు స్పూను ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు వేసి బాగా కలిపి అయిదు నిమిషాల స్టవ్ మీద పెట్టి ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి.

3. మరో పక్క పెద్ద గిన్నెలో వండిన అన్నాన్ని తీసుకుని పసుపు, ఒక స్పూను నూనె వేసి పొడిగా పొడిగా వచ్చేలా కలుపుకోవాలి.

4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. ఆ నూనెలో శెనగపప్పు, పల్లీలు, మిననప్పు వేసి వేయించాలి.

5. తరువాత ఆవాలు, కరివేపాకులు, పచ్చిమిర్చి, ఎండు మిర్చి, చిటికెడు ఇంగువ వేసి వేయించాలి.

6. ఇప్పుడు అన్నంలో ముందుగా ఉడికించిన చింతపండు ఇగురు వేసి ఓసారి కలుపుకోండి. తరువాత కళాయిలోని తాళింపును కూడా వేసి కలుపుకోండి. అంతే టేస్టీ పులిహోర రెడీ అయినట్టే.

రెండో నైవేద్యం: దద్దోజనం

1. ఒక గిన్నెలో తెల్ల అన్నాన్ని వేయండి. ఆ అన్నంలో పాలు, పెరుగు వేసి బాగా కలుపుకోండి.

2. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. అవసరం అయితే నీళ్లు కూడా వేసి కలపండి.

3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండు మిర్చి, కరివేపాకులు, మినపప్పు వేసి వేయించి... పెరుగు అన్నంపై వేయాలి. అంతే దద్దోజనం సిద్ధమైపోయింది.

మూడో నైవేద్యం: పరమాన్నం

1. ఇప్పుడు ముందుగానే వండిన అన్నాన్ని ఒక గిన్నెలో వేయాలి. అందులో అరకప్పు నీళ్లు వేసి మళ్లీ స్టవ్ మీద పెట్టాలి.

2. ఆ అన్నంలో బెల్లం తురుమును వేసి బాగా కలుపుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిపోయే వరకు ఉడికించాలి.

3. బెల్లం కరిగిపోయాక యాలకుల పొడిని వేసి కలుపుకోవాలి.

4. మరిగించిన పాలను అందులో వేసి బాగా కలుపుకోవాలి. కాస్త చిక్కగా అయ్యాక స్టవ్ కట్టేయాలి. పరమాన్నం కూడా నైవేద్యంగా మారిపోయింది.

నాలుగో నైవేద్యం: సేమియా పాయసం

1. పాలను ముందుగానే కాచి చల్లార్చి పెట్టుకోవాలి.

2. ఇప్పుడు స్టవ్ మీద నెయ్యి వేసి సేమియాను వేయించాలి.

3. అవి రంగు మారేదాకా వేయించి నీళ్లు వేయాలి. అది మెత్తగా ఉడికాక పాలు వేయాలి.

4. అందులో పంచదార వేసి చిక్కగా అయ్యేవరకు ఉంచాలి.

5. రెండు స్పూన్ల నెయ్యిలో బాదం,జీడిపప్పు, కిస్మిస్ లు వేసి వేయించి ఆ మొత్తాన్ని సేమియాలో వేయాలి. అంతే సేమియా పాయసం సిద్ధం.

అయిదో నైవేద్యం: శెనగల తాళింపు

1. కొమ్ము శెనగలను ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి కుక్కర్లో వేసిఒక విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి.

2. ఆ కొమ్ము శెనగలను ఒక గిన్నెలో వేసుకోవాలి.

3. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. నూనెలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకులు, ఎండు మిర్చి, ఉప్పు వేసి వేయించాలి.

4. ఆ వేగాక ముందుగా ఉడికించుకున్న కొమ్ముశెనగలను వేసి కలుపుకోవాలి. శెనగల తాళింపు రెడీ అయిపోయింది.

ఆరో నైవేద్యం - అల్లం గారెలు

1. ముందురాత్రి నానబెట్టుకున్న మినపప్పును నీళ్లు వేయకుండా గట్టిగా రుబ్బుకోవాలి.

2. ఆ రుబ్బును ఒక గిన్నెలో వేసి ఉప్పు, అల్లం తరుగు, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకులు తరుగు వేసి కలుపుకోవాలి.

3. స్టవ్ మద కళాయి పెట్టి నూనె వేయాలి. ఆ నూనె వేడెక్కాక గారెలను వేసుకోవాలి. అల్లం గారెలు అమ్మవారికి సిద్ధమైపోయాయి.

ఏడో నైవేద్యం: పూర్ణం బూరెలు

1. కుక్కర్లో శెనగపప్పు, నీళ్లు వేసి ఉడకబెట్టుకోవాలి.

2. ముందుగా నానబెట్టుకున్న మినపప్పు, బియ్యం మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఆ మిశ్రమంలో నీళ్లు వేసి కాస్త పలుచగా వస్తుంది.

3. ఇప్పుడు కుక్కర్లో ఉన్న శెనగపప్పును మెత్తగా గరిటెతో కలుపుకోవాలి.

4. ఆ శెనగపప్పులో బెల్లం తురుమును వేసి బాగా కలుపుకోవాలి. చిన్న మంట మీద ఉడికించుకోవాలి.

5. ఈ మొత్తం మిశ్రమాన్ని గట్టిగా అయ్యేవరకు ఉడికించుకోవాలి.

6. ఆ మిశ్రమం చల్లారాక చేత్తోనే బాల్స్ లా చుట్టుకోవాలి.

7. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. ఆ నూనెలో బాల్స్‌ను మినపప్పులో మిశ్రమంలో ముంచి నూనెలో వేయాలి.

8. బ్రౌన్ రంగులోకి మారే వరకు వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. పూర్ణం బూరెలు రెడీ.

ఎనిమిదో నైవేద్యం: ఫ్రూట్ మిక్స్

1. ఆపిల్, అరటి పండు ముక్కలు చేసుకోవాలి.

2. దానిమ్మ గింజలను ఏరి పక్కన పెట్టుకోవాలి.

3. ఒక గిన్నెలో ఆపిల్ ముక్కలు, అరటి పండు ముక్కలు, దానిమ్మ గింజలు, జీడిపప్పులు, పంచదార వేసి కలుపుకోవాలి.

4. అంతే ఫ్రూట్ మిక్స్ రెడీ.

తొమ్మిది నైవేద్యం: గోధుమ రవ్వ స్వీట్

1. స్టవ్ మీద గిన్నె పెట్టి నెయ్యి వేయాలి.

2. ఆ నెయ్యిలో డ్రైఫ్రూట్స్ వేసి వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు అదే నెయ్యిలో గోధుమ రవ్వను వేసి వేయించుకోవాలి.

4. గోధుమ రవ్వ వేగాక ఒక కప్పు గోధుమ రవ్వకు, ఒకటిన్నర కప్పు నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి.

5. ఇక కప్పు పంచదార కూడా వేసి కలపాలి.

6. ఇది హల్వాలాగా దగ్గరగా వచ్చే దాకా చిన్న మంట మీద ఉడికించుకోవాలి.

7. తరువాత ముందుగా నెయ్యిలో వేయించిన డ్రైఫ్రూట్స్ పైన చల్లేయాలి. అంతే గోధుమ రవ్వ స్వీట్ రెడీ అయినట్టే.

అమ్మవారికి పైన చెప్పినట్టు తొమ్మిది నైవేద్యాలు రెడి చేసేయండి. ఇవన్నీ చాలా సింపుల్ గా తయారయ్యేవే. ఒకసారి చేసి చూడండి.