తెలుగు న్యూస్  /  National International  /  Sri Lanka Protesters To End Occupation Of Official Buildings Rajapaksa To Leave Singapore Today

Sri Lanka crisis: అధికారిక భవనాల నుంచి వీడేందుకు సమ్మతించిన ఆందోళనకారులు

14 July 2022, 12:45 IST

    • Sri Lanka crisis: శ్రీలంక ప్రస్తుత పరిస్థితి: శ్రీలంకలో అధికారిక భవనాల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న ఆందోళనకారులు ప్రకటించారు. అయితే ఆర్థిక సంక్షోభానికి కారణమైన అధ్యక్షుడు, ప్రధాన మంత్రి రాజీనామాలు చేసేంతవరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Sri lanka crisis: ప్రధాన మంత్రి కార్యాలయం వద్ద ఆందోళనకారుల నిరసన
Sri lanka crisis: ప్రధాన మంత్రి కార్యాలయం వద్ద ఆందోళనకారుల నిరసన (AP)

Sri lanka crisis: ప్రధాన మంత్రి కార్యాలయం వద్ద ఆందోళనకారుల నిరసన

Sri Lanka crisis: పోయిన వారాంతంలో అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే నివాసంలోకి చొచ్చుకుపోవడంతో ఆయన బుధవారం ఉదయం మాల్దీవులకు పారిపోవాాల్సి వచ్చింది. ఆ సమయంలో ప్రధాన మంత్రి కార్యాలయంలోకి కూడా ఆందోళనకారులు చొచ్చుకువెళ్లారు.

ట్రెండింగ్ వార్తలు

‘‘వైవాహిక స్థితితో సంబంధం లేకుండా.. పరస్పర అనుమతితో లైంగిక సంబంధం తప్పు కాదు’’: ఢిల్లీ హైకోర్టు

CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

CSIR UGC NET : సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు షురూ..

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

బుధవారం రాజీనామా చేస్తానని రాజపక్సే ప్రకటించినప్పటికీ, ఆయన ప్రకటనపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు.

కాగా తన గైర్హాజరీలో యాక్టింగ్ ప్రెసిడెంట్‌గా ప్రధానమంత్రి కొనసాగుతారని రాజపక్సే చెప్పారు. ఆందోళనకారులు తక్షణం అధికారిక భవనాలు వీడాలని ప్రధాన మంత్రి రణిల్ విక్రమ సింఘే డిమాండ్ చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని భద్రతాదళాలను ఆదేశించారు.

‘మేం అధ్యక్ష భవనం, అధ్యక్ష సచివాలయం, ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి తక్షణం శాంతియుతంగా వైదొలుగుతున్నాం. అయితే మా ఆందోళనను కొనసాగిస్తాం..’ అని ఆందోళనకారుల తరపు అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.

‘ఈ భవనం జాతీయ సంపద. దానిని రక్షించుకోవాలి..’ అని బౌద్ధ సన్యాసి ఒమాల్పే శోబిత విలేకరులతో అన్నారు. ‘తగిన రీతిలో ఆడిట్ జరగాలి. ఆస్తులన్నీ ప్రభుత్వానికి అప్పగించాలి..’ అని అన్నారు.

రాజపక్సే విదేశాలకు పారిపోయిన అనంతరం అధ్యక్ష నివాసం, సచివాలయంలోకి లక్షలాది మంది ప్రజలు వచ్చి సందర్శించారు.

కొలంబోలోని తన కార్యాలయాన్ని వేలాది మంది ప్రజలు ఆక్రమించుకున్న నేపథ్యంలో విక్రమసింఘే వీడియో సందేశంలో మాట్లాడుతూ ‘నేను యాక్టింగ్ ప్రెసిడెంట్‌గా నా బాధ్యతలు నిర్వర్తించనివ్వకుండా అడ్డుకునేందుకు నా కార్యాలయంలో తిష్ట వేస్తున్నారు..’ అని వ్యాఖ్యానించారు.

‘ఫాస్టిస్టులు టేక్ ఓవర్ చేసేందుకు మేం అనుమతించం. అందుకే దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ, కర్ఫ్యూ విధించాం..’ అని ప్రకటించారు.

కాగా గురువారం ఉదయం కర్ఫ్యూ ఎత్తివేశారు. అయితే పార్లమెంటు ఎదుట ఆందోళనకారులతో రాత్రిపూట జరిగిన ఘర్షణలో ఒక సైనికుడు, ఒక కానిస్టేబుల్ గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

ఇతర ప్రాంతాల్లో ఆందోళనకారులు విజయం సాధించినప్పటికీ, శాసన వ్యవస్థపై చేసిన దాడిలో ఆందోళనకారులకు ఎదురుదెబ్బ తగిలింది.

బుధవారం దాదాపు 85 మంది గాయాలతో అడ్మిట్ అయ్యారని కొలంబోలోని ప్రధాన ఆసుపత్రి నివేదించింది. ప్రధాన మంత్రి కార్యాలయం వద్ద టియర్ గ్యాస్ కారణంగా శ్వాస ఆడక ఓ వ్యక్తి మరణించాడు.

Rajapaksa: సింగపూర్‌కు వెళ్లే యత్నంలో రాజపక్సే

రాజపక్సే గురువారం మాల్దీవుల్లోనే ఉన్నారు. ఆయన భార్య, ఇద్దరు బాడీ గార్డులతో సహా సింగపూర్ వెళ్లేందుకు ప్రయివేటు జెట్ కోసం ఎదురుచూస్తున్నారు.

బుధవారం ఉదయం ఆయన మాల్దీవులకు వచ్చినప్పుడు నిరసనలు వ్యక్తమవడంతో ఆయన ఇతర ప్రయాణికులతో కలిసి కమర్షియల్ ఫ్లైట్‌లో సింగపూర్ వెళ్లేందుకు విముఖంగా ఉన్నట్టు స్థానిక మీడియా నివేదించింది.

మాల్దీవుల్లో యంత్రాంగం రాజపక్సే సురక్షితంగా ఉండేందుకు అంగీకరించవద్దని వెలనా అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌లో నిరసన ప్రదర్శనలు ఎదురయ్యాయి.

కాగా రాజపక్సే బుధవారం రాత్రి వాల్డోర్ఫ్ ఆస్టోరియా ఇథాఫుషి సూపర్ లగ్జరీ రిసార్ట్‌లో బస చేసినట్టు స్థానిక మీడియా వెల్లడించింది.

దేశంలో ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంకలో ప్రతి ఐదుగురిలో నలుగురు పస్తులు ఉంటున్న వేళ వారు విలాసవంతమైన రిసార్ట్‌లో బస చేశారన్న విమర్శలు వెల్లువెత్తాయి.

రాజపక్సే గురువారం మాల్దీవుల నుంచి సింగపూర్ బయలుదేరుతారని, ఆయన ప్రయాణ సమయంలోనే రాజీనామా ప్రకటన ఉంటుందని కొలంబోలోని భద్రతా వర్గాలు తెలిపాయి.

‘రాజీనామా లేఖ సిద్ధమైంది..’ అని ఏఎఫ్‌పీ వార్తసంస్థకు ఓ అధికారి తెలిపారు. ‘రాజపక్సే నుంచి గ్రీన్ లైట్ రాగానే, సభాపతి దానిని వెల్లడిస్తారు..’ అని చెప్పారు.

అధ్యక్ష పదవికి పోటీ చేసే ముందు 2019లో అమెరికా పౌరసత్వాన్ని వదులుకున్నందున, అమెరికాకు వీసా పొందేందుకు రాజపక్సే చేసిన ప్రయత్నాలు తిరస్కరణకు గురైనట్టు దౌత్య వర్గాలు తెలిపాయి.

టాపిక్