తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ukraine | ఆ విషయంలో 'తగ్గేదే లే' అంటున్న ఉక్రెయిన్​.. రష్యా ఏం చేస్తుంది?

Ukraine | ఆ విషయంలో 'తగ్గేదే లే' అంటున్న ఉక్రెయిన్​.. రష్యా ఏం చేస్తుంది?

Sharath Chitturi HT Telugu

21 February 2022, 15:53 IST

    • Russia Ukraine crisis | రష్యాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో.. నాటో సభ్యత్వంపై ఉక్రెయిన్​ కీలక వ్యాఖ్యలు చేసింది. కొన్ని దేశాలు.. తమ ఆలోచనను ఉపసంహరించుకోవాలని చెబుతున్నా, తాము మాత్రం నాటో సభ్యత్వాన్ని ఆశిస్తున్నట్టు స్పష్టం చేసింది. మరోవైపు పరిస్థితిని అదుపుచేసేందుకు బైడెన్​- పుతిన్​ భేటీ అయ్యే అవకాశం ఉందని వస్తున్న వార్తలపై రష్యా నీళ్లు చల్లేసింది!
సరిహద్దులో ఉక్రెయిన్​ సైనికులు
సరిహద్దులో ఉక్రెయిన్​ సైనికులు (Bloomberg)

సరిహద్దులో ఉక్రెయిన్​ సైనికులు

Ukraine NATO news | రష్యా- ఉక్రెయిన్​ మధ్య విభేదాలు దాదాపు 30ఏళ్ల నుంచి ఉన్నా.. ఇటీవలి కాలంలో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరడానికి గల ముఖ్య కారణం.. 'నాటో సభ్యత్వం'. నాటోలో చేరాలని ఉక్రెయిన్​ సంకల్పించగా.. దాన్ని రష్యా తీవ్రంగా వ్యతిరేకించింది. ఆలోచనలు విరమించుకోవాలని హెచ్చరించింది. అందుకు తగ్గట్టుగానే ఉక్రెయిన్​ను మూడువైపులా చుట్టుముట్టి.. సరిహద్దులో 10లక్షలకుపైగా సైనికులను మోహరించింది. రష్యా.. ఏ క్షణంలోనైనా ఉక్రెయిన్​పై దండయాత్ర చేసేందుకు సిద్ధంగా ఉందని ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. పరిస్థితి ఇంత తీవ్రంగా మారిన వేళ.. రష్యా ఒత్తిడికి ఉక్రెయిన్​ తలొగ్గుతుందా? నాటోలో చేరే ఆలోచనలను ఉపసంహరించుకుంటుందా? అన్న ప్రశ్నలపై గత కొంతకాలంగా ఊహాగానాలు జోరందుకున్నాయి. తాజాగా.. వాటికి ఉక్రెయిన్​ జవాబు చెప్పేసింది. ఇప్పటికీ.. నాటో సభ్యత్వం పొందాలన్న ఆలోచనతోనే ఉన్నట్టు స్వయంగా ఉక్రెయిన్​ విదేశాంగమంత్రి దిమిత్రో కులేబా వెల్లడించారు. కొన్ని పాశ్చాత్య దేశాలు.. తమ ఆలోచనలు విరమించుకోవాలని సూచిస్తున్నా.. తాము మాత్రం దాన్ని వ్యతిరేకిస్తున్నట్టు పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు

‘‘వైవాహిక స్థితితో సంబంధం లేకుండా.. పరస్పర అనుమతితో లైంగిక సంబంధం తప్పు కాదు’’: ఢిల్లీ హైకోర్టు

CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

CSIR UGC NET : సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు షురూ..

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

రష్యాతో సరిహద్దు ఉద్రిక్తతల వేళ.. ఓ అంతర్జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు కులేబా.

"ఉక్రెయిన్​లో మెజారిటీ మంది ప్రజలు.. నాటోలోకి దేశం చేరాలనే ఆశిస్తున్నారు. మేము కూడా అదే ఆలోచనలో ఉన్నాము. కొన్ని​ దేశాలు.. మా ఆలోచనను విరమించుకోవాలని అభ్యర్థిస్తున్నాయి. అయితే అందులో అమెరికా లేదు. మేము చెప్పేదంతా ఒక్కటే. రష్యా.. తన బలగాలను ఉపసంహరించుకుని, ఉక్రెయిన్​ కోరుకున్నది సాధిస్తే.. ప్రపంచంలో ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలపడుతుంది. మరింత భద్రతగా ఉంటుంది," అని కులేబా అన్నారు.

ఉక్రెయిన్ తూర్పు ప్రాంత ప్రజలు.. రష్యాకు మద్దతుగా నిలుస్తున్నారు. అయితే.. నాటో దళాలు సరిహద్దులో తిష్టవేసుకుని కూర్చుంటే.. ఉక్రెయిన్​పై ఆధిపత్యం చెలాయించడం కష్టమవుతుందని రష్యా భావిస్తోంది. అందుకే ఉక్రెయిన్​ ప్రయత్నాలను తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తోంది.

మరి ఇప్పుడు.. నాటో సభ్యత్వం కోసం ప్రయత్నిస్తామని ఉక్రెయిన్​ తేల్చిచెప్పడంతో రష్యా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని సర్వత్రా ఆందోళన నెలకొంది.

శాంతి సదస్సుపై నీళ్లు చల్లిన రష్యా..!

Biden Putin Ukraine | మరోవైపు.. రష్యా అధ్యక్షుడు పుతిన్​, అమెరికా దేశాధినేత జో బైడెన్​.. త్వరలో సమావేశం అవుతారని సోమవారం వార్తలొచ్చాయి. ఉద్రిక్తతలు తగ్గించేందుకు వారు కృషి చేస్తారని ఊహాగానాలు వెలువడ్డాయి. ఫలితంగా శాంతి స్థాపనపై ప్రపంచ దేశాల్లో ఆశలు చిగురించాయి. అయితే ఇప్పుడు ఆ ఆశలపై రష్యా నీళ్లు చల్లినట్టే కనిపిస్తోంది. అగ్రనేతల మధ్య సదస్సు నిర్వహించేందుకు ప్రణాళికలేవీ లేవని రష్యా వెల్లడించింది. పైగా.. ఈ దశలో అధ్యక్షులు భేటీకావడంలో అర్థం లేదు అన్నట్టుగా వ్యాఖ్యానించింది.